క్యూట్‌ బేబీ టు స్టార్‌ హీరోయిన్‌..

మోడల్‌గా కెరీర్‌ ఆరంభించి.. నటిగా వెండితెరకు పరిచయమై.. దక్షిణాదిలోనే కాకుండా దేశవ్యాప్తంగా కుర్రకారు హృదయాలు కొల్లగొట్టి.. నేషనల్‌ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు కథానాయిక రష్మిక....

Updated : 05 Apr 2021 11:48 IST

రష్మిక గురించి ఈ విషయాలు తెలుసా..

ఇంటర్నెట్‌డెస్క్‌: మోడల్‌గా కెరీర్‌ ఆరంభించి.. నటిగా వెండితెరకు పరిచయమై.. దక్షిణాదిలో కుర్రకారు హృదయాలు కొల్లగొట్టి.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కథానాయిక రష్మిక. చూడచక్కని అందం.. అందరితో కలిసిపోయే మనస్తత్వం.. హృదయాలను కట్టిపడేసే ఎక్స్‌ప్రెషన్స్‌.. ఆమెని వర్ణించడానికి ఇవి కేవలం కొన్ని మాటలు మాత్రమే. ‘మేడమ్‌’గా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ఇప్పుడు దక్షిణాదిలోనే కాకుండా బీటౌన్‌లోనూ తన సత్తా చాటుకునేందుకు సిద్ధమైంది. సోమవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా రష్మిక గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు.

డాడీస్‌ డాటర్‌

కర్ణాటకలోని కొడగు జిల్లాకు చెందిన మదన్‌, సుమన్‌ దంపతులకు 1996 ఏప్రిల్‌ 5న రష్మిక జన్మించింది. రష్మికకు శిమన్‌ అనే చెల్లి ఉంది. చిన్నప్పటి నుంచి రష్మికకు తండ్రి మదన్‌ అంటే ఎంతో ఇష్టం. తన అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలను ఎక్కువగా తండ్రితోనే పంచుకుంటారు ఈ ముద్దుగుమ్మ. అందుకే ఆమె డాడీస్‌ డాటర్‌.


మేకప్‌ @ స్కూల్‌

కూర్గ్‌ పబ్లిక్‌ స్కూల్‌లో రష్మిక ప్రాథమిక విద్య పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే ఆమెకు నటనపై తెలియని మక్కువ ఏర్పడింది. దీంతో స్కూల్‌లో జరిగే పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో రష్మిక పాల్గొని అందరి ప్రశంసలు అందుకుంది. అలాగే ఈ చిన్నదానికి క్రీడలంటేనూ ఇష్టమే.


మోడలింగ్‌ టు బ్రాండ్‌ అంబాసిడర్‌

ఫ్యాషన్‌, యాక్టింగ్‌పై ఉన్న ప్రేమతో రష్మిక మోడలింగ్‌ వైపు తన తొలి అడుగులు వేసింది. మోడల్‌గా ఉన్న తరుణంలో ‘క్లీన్‌ అండ్‌ క్లియర్‌ ఫ్రెష్ ఫేస్‌’ పోటీల్లో పాల్గొని విజేతగా అవార్డు అందుకుంది. అనంతరం ఆ బ్రాండ్‌కు వాణిజ్య ప్రచారకర్తగా ఆమె వ్యవహరించారు. వాటితోపాటు కొన్ని ప్రకటనల్లోనూ రష్మిక తళుక్కున మెరిశారు.


యాడ్స్‌తో ఇంప్రెస్‌..

యాడ్స్‌లో రష్మికను చూసి ఇంప్రెస్‌ అయిన కన్నడ దర్శకుడు రిషబ్‌ శెట్టి ఆమెను కథానాయికగా వెండితెరకు పరిచయం చేస్తూ 2016లో ‘కిర్రాక్‌పార్టీ’ తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్‌హిట్‌ కావడంతోపాటు రష్మికకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా పెరిగింది. అనంతరం ఆమె ‘అంజనీపుత్ర’, ‘ఛమక్‌’ వంటి కన్నడ చిత్రాల్లో నటించారు. ‘ఛమక్‌’ చిత్రానికి గాను ఆమె మొదటిసారి ఫిలింఫేర్‌ అందుకున్నారు.


టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్

‘ఛలో’తో రష్మిక తెలుగు తెరకు పరిచయమయ్యారు. 2018లో విడుదలైన ఈ సినిమాలో నాగశౌర్య కథానాయకుడు. ఇందులో రష్మిక నటన, హావభావాలు చూసి తెలుగువారు సైతం ఆమెపై మనసు పారేసుకున్నారు. అనంతరం ఈ చిన్నది ‘గీతగోవిందం’తో ఇక్కడ స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆమె మహేశ్‌ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు’, నితిన్‌తో ‘భీష్మ’ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ‘పుష్ప’లో నటిస్తున్నారు.


ముంబయిలో ల్యాండ్‌..

టాలీవుడ్‌లో ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న రష్మికకు ఇటీవల ముంబయి నుంచి ఆఫర్స్‌ వెల్లువెత్తాయి. దీంతో ఆమె బీటౌన్‌ బాటపట్టారు. ఈ క్రమంలోనే ప్రముఖ పాప్‌ సింగర్‌ బాద్షాతో కలిసి ‘టాప్‌టక్కర్‌’ ఆల్బమ్‌లో ఆడిపాడారు. మరోవైపు, అమితాబ్‌ బచ్చన్‌తో ‘గుడ్‌బై‌’, సిద్దార్థ్‌ మల్హోత్రతో ‘మిషన్‌ మజ్ను’లను పట్టాలెక్కించింది ఈ బ్యూటీ.


కుక్క బిస్కెట్లు.. వైన్‌..!

ఏ విషయాన్నైనా పరిశీలించి.. పరిశోధించి తెలుసుకోవాలనే మనస్తత్వం రష్మికది. దీంతో ఆమె ఇటీవల కుక్క బిస్కెట్లు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనే ఆశతో కొద్దిగా తిన్నారట. వాళ్ల ప్రాంతంలో మహిళలు ప్రతిరోజూ వైన్‌ సేవిస్తారని రష్మిక అన్నారు. అలాగే ఈ నటికి ఐస్‌క్రీమ్స్‌ అంటే చెప్పలేనంత మమకారం. ప్రతిరోజూ ఐస్‌క్రీమ్‌ ఇచ్చినా సరే ఆమె నో అనకుండా తింటారట.


నిశ్చితార్థం.. ప్రేమ.. కాంట్రవర్సీ..

నటీనటుల జీవితంలో కాంట్రవర్సీలకు కొదవే ఉండదు. ఏదో ఒక సమయంలో వాళ్ల గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. అలాగే, ఈ నటి గురించి కూడా కొన్ని వార్తలు గతంలో తెగ చక్కర్లు కొట్టాయి. తన మొదటి సినిమా హీరో రక్షిత్‌శెట్టితో రష్మికకు నిశ్చితార్థమైన విషయం తెలిసిందే. కాకపోతే కొన్ని కారణాల వల్ల వాళ్లిద్దరూ విడిపోయారు. దాంతో టాలీవుడ్‌కు చెందిన ఓ హీరోతో రష్మిక ప్రేమలో ఉందని అందరూ చెప్పుకున్నారు.


మరికొన్ని విశేషాలు

*రష్మికకు పెంపుడు జంతువులంటే మక్కువ. శునకాలు, పిల్లులను ఈ బ్యూటీ పెంచుకుంటున్నారు.

*క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో వర్కౌట్లు చేస్తూనే ఉంటారట ఈ నటి.

*షారుఖ్‌, శ్రీదేవి తనకిష్టమైన నటీనటులని రష్మిక చాలాసార్లు చెప్పారు.

*రష్మిక ఈ మధ్యనే మాంసాహారానికి దూరమయ్యారు. దీంతో ఆమె వెజ్‌ వంటకాలతోపాటు ప్రోటీన్‌ కోసం ఎగ్స్‌ ఎక్కువగా తీసుకుంటారట.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని