Baby: బేబీ.. నిడివి తగ్గించకపోవడానికి కారణమదే: సాయిరాజేశ్‌

భవిష్యత్తులో తాను నిర్మాతగానే కాకుండా దర్శకుడిగానూ కొనసాగుతానని సాయిరాజేశ్‌ చెప్పారు. ‘బేబీ’ (Baby) సినిమాతో దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్న ఆయన తాజాగా సక్సెస్‌మీట్‌లో తన సినిమా గురించి పలు విషయాలపై మాట్లాడారు.   

Updated : 15 Jul 2023 18:59 IST

హైదరాబాద్‌: ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్‌ ఆనంద్‌ (Viraj Anand) ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘బేబీ’ (Baby). సాయి రాజేశ్‌ దర్శకుడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజే రూ.7 కోట్లు వరకూ కలెక్షన్స్‌ రాబట్టింది. సినిమాకు వస్తోన్న పాజిటివ్‌ టాక్‌ను దృష్టిలో ఉంచుకుని చిత్రబృందం తాజాగా సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. తన చిత్రానికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి సాయిరాజేశ్‌ ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ముఖ్యంగా సినిమా నిడివిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇది నా పెయిన్‌..!

‘‘20 ఏళ్ల క్రితం నేను ఒక అమ్మాయిని ప్రేమించా. ఎనిమిది నెలలు ఎంతో బాధ అనుభవించా. ఇరవైఏళ్లు అయ్యాక కూడా ప్రేమ తాలూకు పెయిన్‌ నాకు గుర్తుంది. ఆ బాధను ఒక పాత్రతో స్క్రీన్‌ మీదకు తీసుకురావాలనుకున్నా. అలా, ‘బేబీ’ రాశా. అయితే ఈ కథను నేను హీరోయిన్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో రాయలేదు. హీరో పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో రాశా. ఫస్ట్‌ లవ్‌ వల్ల వచ్చే పెయిన్‌ ఎలా ఉంటుందో చూపించడం కోసమే ఈ కథ సిద్ధం చేశా. మరో విషయం ఏమిటంటే.. నా ఫస్ట్‌ లవ్‌ నా భార్యనే. మా విషయం తెలిసి.. ఎనిమిది నెలలపాటు ఆమెను ఎక్కడికో తీసుకువెళ్లిపోయారు. ఆమె ఎక్కడ ఉందో తెలియక నరకం అనుభవించా.

సినిమాల్లోకి వస్తా: మహేశ్‌బాబు కుమార్తె సితార

విమర్శలూ స్వీకరిస్తా..!

మా సినిమాపై ప్రేక్షకులు చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. అయితే, మాకు ప్రశంసలే కాదు.. కొన్ని సంభాషణల విషయంలో విమర్శలూ వస్తున్నాయి. కథకు అవి అవసరం కాబట్టే కొన్ని పదాలను వాడాల్సి వచ్చింది. అంతేకానీ వేరే ఉద్దేశం ఏమీ లేదు. కాబట్టి, ప్రశంసలు ఎలా స్వీకరిస్తున్నానో.. విమర్శలను తీసుకుంటా. ఇక, మా చిత్రానికి ‘బేబీ’ టైటిల్‌ను మార్కెటింగ్‌ స్ట్రాటజీకి అనుగుణంగానే పెట్టా. చిన్న టైటిల్స్‌ అయితే త్వరగా ప్రేక్షకుల్లోకి వెళ్తాయని నేను నమ్ముతుంటా.

నిడివి తగ్గిస్తే ప్రమాదమే..!

నిడివి కాస్త తగ్గిస్తే బాగుంటుందని అల్లు అరవింద్‌ చెప్పారు. ఒకవేళ అలా చేసి ఉంటే హీరోయిన్‌ పాత్ర మరింత నెగెటివ్ అయ్యేది. కలెక్షన్స్‌ తగ్గినా పర్వాలేదు కానీ పాత్రను తప్పుగా చూపించకూడదనే ఉద్దేశంతోనే లెంగ్త్‌ తగ్గించలేదు. అలాగే, లెంగ్త్‌ సరిపోక.. విరాజ్‌ పాత్రకు సరిగ్గా న్యాయం చేయలేకపోయా. వేరే పాత్రలకు సంబంధించిన చాలా పాయింట్స్‌ మిస్‌ చేశా. అందుకే కాంట్రవర్సీలు అవుతున్నాయి’’ అని సాయి రాజేశ్‌ చెప్పారు.

అనంతరం ఆనంద్‌ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా కథ విన్నప్పుడు సవాలుగానే భావించా. దర్శకుడు రాసిన రైటింగ్‌ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు అడుగువేశా. షూటింగ్‌ సమయంలో దర్శకుడు చెప్పినట్టు నటించా. అలాగే, కొన్ని సీన్స్‌ను నాకు నచ్చిన విధంగా చేశా. ఈరోజు యూత్ నుంచి వస్తోన్న స్పందనకు ఆనందంగా ఉన్నా’’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని