satyadev: ప్రతి ప్రేక్షకున్ని గాడ్సే హెచ్చరిస్తుంది

విభిన్న కథలు/పాత్రలతో ప్రేక్షకులకు చేరువైన నటుడు సత్యదేవ్‌. అనతికాలంలోనే మంచి కథానాయకుడిగానూ మెప్పించారు.

Published : 17 Jun 2022 00:35 IST

కచ్చితంగా పాన్‌ఇండియా సినిమా చేస్తా

విభిన్న కథలు/పాత్రలతో ప్రేక్షకులకు చేరువైన నటుడు సత్యదేవ్‌(satyadev). అనతికాలంలోనే మంచి కథానాయకుడిగానూ మెప్పించారు. ‘బ్లఫ్ మాస్టర్‌’,  ‘తిమ్మరుసు’ తదితర చిత్రాలతో తనేంటో నిరూపించుకున్నారు. తాజాగా గోపీ గణేశ్‌ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన మరో విభిన్న చిత్రం ‘గాడ్సే’ జూన్‌ 17న విడుదలవుతున్న నేపథ్యంలో సత్యదేవ్‌ పంచుకున్న విశేషాలివే.

గాడ్సే కథ వినగానే ఏమనిపించింది?నటుడిగా ఎలాంటి అనుభూతి చెందారు?

సత్యదేవ్‌: నటుడిగా నాకు ఆ సత్తా ఉందనే నమ్మకం ఉంది. అదే నన్ను ఇప్పటివరకు నడిపించింది. కానీ, కథ విన్నపుడు ఈ కథ ద్వారా నేను సంధించే ప్రశ్న ఎంత వరకు ప్రేక్షకులను చేరుతుందా? అనిపించింది. డైరెక్టర్‌ గోపీగణేశ్‌ ఆ విషయంలో నాకు పూర్తి భరోసా ఇచ్చారు. టీజర్‌, ట్రైలర్లకు వచ్చిన స్పందన చూశాకా మేము సంధించిన ప్రశ్నలు ప్రేక్షకులకు చేరుతాయనే నమ్మకం కలిగింది.

గాడ్సేలో కథానాయకుడి పాత్ర చేయడానికి ఎలాంటి కసరత్తు చేశారు?

సత్యదేవ్‌: హోమ్ వర్క్‌ అంటూ ఏం లేదు. మనలో కూడా సమాజానికి సంబంధించి బాధ్యత అనేది ఉంటుంది కదా.. ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఎవరు లేకపోయిన మనం రూల్స్‌ పాటించాలి అనే విషయాన్ని డ్రైవర్‌కు నేనెప్పుడూ చెబుతూ ఉంటా. అతను ఆ క్షణంలో పాటించకపోయినా తనలో ఆ ఆలోచనని కలిగిస్తే భవిష్యత్‌లో పాటిస్తాడనే నమ్మకం. ఇలాంటి చిన్న చిన్న విషయాల ద్వారా అయిన సమాజం పట్ల మనకున్న ప్రేమను చూపించొచ్చు. అది నాలో ఉంది కాబట్టే ఇలాంటి కథ నా దగ్గరకు వచ్చిందని నమ్ముతున్నా. మనలో ఉండే ప్రశ్నించేతత్వాన్ని చూపించేదే ఈ కథ.

‘గాడ్సే’ టైటిల్‌ను ఎంపిక చేసుకోవడం వెనుక కారణం పబ్లిసిటీ కోసమా? ప్రేక్షకుల్లో అటెన్షన్‌ క్రియేట్‌ చేయడానికా?

సత్యదేవ్‌: రెండూ కారణమే. ఒక నాటకంలో గాడ్సే పాత్ర చేసిన ఓ చిన్న కుర్రాడు గాంధీని చంపనని, ఆయనంటే ఇష్టమని అక్కడినుంచి పారిపోతాడు. అటువంటి నేపథ్యం ఉన్న అతను రెండు గన్నులతో స్వైర విహారం చేస్తున్నాడంటే అతనికి ఏదో అన్యాయం జరిగి ఉంటుంది. అతని పేరు విశ్వనాథ రామచంద్ర కాని అందరూ గాడ్సే అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. గాడ్సే అనే టైటిల్‌ పెట్ట్డడానికి కారణం అది కథలో భాగం కావడమే.

మామూలుగా ఇటువంటి వ్యతిరేక నేపథ్యం ఉన్న టైటిల్‌ పెట్టడం ద్వారా వివాదాస్పదం అయ్యే ప్రమాదం లేదంటారా?

సత్యదేవ్‌: రాజకీయ కోణానికి సంబంధించిన కథలు ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. ఈ కథ ఒక మతానికో, ప్రాంతానికో పరిమితమైనది కాదు. సమాజంలో అందరికి తెలిసిన అన్ని అంశాలపై తీసుకున్న కథాంశం కాబట్టి ఎటువంటి కాంట్రవర్సీ ఉండదనేది మా ఉద్దేశం. సినిమా చూశాకా ప్రేక్షకులు ఒక సానుకూల దృక్పథంతో బయటకు వస్తారు. అదే సమయంలో ఎంటర్‌టైన్‌మెంట్‌కూ ఢోకా లేదు.

మీ సినిమాలో యాక్షన్‌ సీన్లను ఆశించవచ్చా?

సత్యదేవ్‌: ఈ సినిమాలో యాక్షన్‌, డ్రామా,ఎమోషన్స్‌ అన్నీ ఉంటాయి. సినిమా చూసిన అనంతరం ప్రేక్షకుడు సంతృప్తి చెందుతాడు.

గాడ్సేకు దర్శకుడు మిమ్మల్నే కథానాయకుడిగా ఎంచుకోవడానికి కారణం ఏంటి?సందేశం ఏదైనా ఉందా?

సత్యదేవ్‌: గోపీగణేశ్‌తో ఇంతకుముందు ‘బ్లఫ్‌ మాస్టర్‌’ చేశా. అది సమాజంపై సెటైరికల్‌ మూవీ. ఆ సినిమాకు నన్నే హీరోగా తీసుకోవడానికి ఆయన చాలా కష్టపడ్డారు. ఇద్దరం ఒకరిని ఒకరం నమ్మాం. దాన్ని ప్రేక్షకులు ఆదరించారు. ఆ కారణంతోనే గాడ్సేకు నన్ను ఎంపిక చేసుకున్నారని భావిస్తున్నాను. మా సినిమా ఎటువంటి సందేశాన్ని బోధించదు. సమాజంలో జరిగే విషయాలనే చూపిస్తుంది. ప్రతీకారం తీర్చుకుంటున్న కథానాయకుడు చెప్పే కథ ఇది. మేము ప్రేక్షకున్ని ఎలా అలరిస్తామనేది ట్రైలర్‌ ద్వారానే వారికి అర్థమైంది.

హీరోయిన్‌గా ఐశ్వర్యలక్ష్మీనే తీసుకోవడానికి కారణమేంటి?

సత్యదేవ్‌: ఆమె అద్భుతమైన నటి. మలయాళంలో మాయానది, వరదన్‌ సినిమాలతో నిరూపించుకుంది. అటువంటి హీరోయిన్‌ గాడ్సేతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది. ఆమె పాత్ర సినిమాకు చాలా ప్లస్‌ అవుతుంది. ఆమెది ఒక ప్రత్యేకపాత్ర. ఆ పాత్రకు ఎటువంటి లవ్‌స్టోరీ లేదు. హీరో పాత్రను కంట్రోల్‌ చేసే రోల్‌లో ఆమె బాగా నటించారు. దర్శకుడు నాకు సమాజానికి మధ్య మాత్రమే లవ్‌స్టోరీని తీర్చిదిద్దాడు(నవ్వులు)

ప్రస్తుతం పాన్‌ఇండియా సినిమాల హవా నడుస్తోంది కదా? మీ నుంచి ఎప్పుడు ఆశించవచ్చు?

సత్యదేవ్‌: బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌లతో రాజమౌళి సినిమా హద్దులను చెరిపేశారు. ప్రస్తుతం ఇండియన్‌ సినిమాగా తెలుగు సినిమా సత్తా చాటుతోంది. ఇది మంచి పరిణామం. పాన్‌ఇండియా సినిమా చేయడం నా కల. అది ఎప్పటికి తీరుతుందో చూడాలి.క చ్చితంగా చేస్తా.

బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌ రామ్‌సేతులో మీరు నటిస్తున్నారు కదా! ఆ పాత్ర ఎలా ఉండబోతోంది?

సత్యదేవ్‌: నటిస్తున్న మాట నిజమే. కానీ దాని గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను.

చిరంజీవితో ‘ఆచార్య’లో చేశారు కదా ఎలా అనిపించింది?

సత్యదేవ్‌: నిజంగా అది మరిచిపోలేని అనుభూతి. కల నిజమైనట్లే. నేను చిన్నప్పట్నుంచి ఆయన అభిమానిని. అటువంటిది ఆయనతో కలిసి పనిచేయడం అదృష్టం అనే చెప్పాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని