Shah Rukh Khan: మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది.. మోదీపై ప్రశంసలు కురిపించిన షారుక్‌..

ప్రధాని మోదీపై బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

Published : 11 Sep 2023 10:32 IST

ముంబయి: దిల్లీ వేదికగా జరిగిన జీ20 (G20) శిఖరాగ్ర సదస్సును విజయవంతం చేసినందుకు ప్రధాని మోదీ (PM Modi)పై బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపంచదేశాల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు మోదీ కృషి చేస్తున్నారని షారుక్‌ కొనియాడారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

మోదీ ట్వీట్‌ చేసిన ఓ వీడియోను రీ ట్వీట్‌ చేసిన షారుక్‌..‘‘జీ20 సదస్సుకు నాయకత్వం వహించినందకు మోదీకి అభినందనలు. ఈ సదస్సు వల్ల వివిధ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. వాటి భవిష్యత్తు బాగుంటుంది. ఇక మోదీని చూసి ప్రస్తుతం భారతీయులందరూ గర్వపడుతున్నారు. మీ నాయకత్వంలో ఒంటరిగా కాకుండా ఐకమత్యంతో అభివృద్ధి చెందుతాం’’ అని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ‘వన్‌ ఎర్త్‌, వన్ ఫ్యామిలీ, వన్‌ ఫ్యూచర్‌’ అనే నినాదాన్ని కూడా షారుక్‌ ప్రస్తావించారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై బ్రెజిల్‌ అధ్యక్షుడి ప్రశంసలు.. వీడియో వైరల్‌

ఇక మరోవైపు షారుక్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జవాన్‌’ (Jawan) రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తూ.. టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. రోజుకు సుమారు రూ.100 కోట్లు వసూలు చేస్తూ ఇప్పటి వరకు రూ.350 కోట్లు రాబట్టింది. ఇదిలాగే కొనసాగితే త్వరలోనే షారుక్‌ సినిమా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని విశ్లేషకులు అంటున్నారు. అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో షారుక్‌ సరసన నయనతార నటించగా.. విజయ్‌ సేతుపతి, దీపిక పదుకొణె, ప్రియమణి, సునీల్‌ గ్రోవర్‌, సాన్య మల్హోత్ర, యోగిబాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని