Prince Review: రివ్యూ: ప్రిన్స్
Prince Movie Review: శివకార్తికేయన్ (Sivakarthikeyan), మరియా (Maria) నటించిన ‘ప్రిన్స్’ ఎలా ఉందంటే?
Prince Review: చిత్రం: ప్రిన్స్; నటీనటులు: శివకార్తికేయన్, మరియా, సత్యరాజ్, ప్రేమ్‌జీ తదితరులు; సంగీతం: తమన్; ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస; కూర్పు: ప్రవీణ్ కె.ఎల్.; దర్శకత్వం: అనుదీప్ కేవీ; నిర్మాతలు: సునీల్ నారంగ్, డి.సురేశ్‌బాబు, పుష్కర్ రామ్ మోహన్ రావు; విడుదల: 21-10-2022
ఓ సినిమా విజయం ప్రభావం కచ్చితంగా ఆ తర్వాత సినిమా మీద ఉంటుంది. అంతేకాదు తొలి సినిమా స్థాయికి ఏమాత్రం తగ్గినా ‘అబ్బే’ అనేస్తారు. అందులోనూ గత సినిమా భారీ విజయం అందుకుంటే ఇంకా కష్టం. అచ్చంగా ఇలాంటి పరిస్థితుల్లోనే సినిమా చేశారు దర్శకుడు అనుదీప్ కేవీ (Anudeep KV). ‘జాతిరత్నాలు’ ఘనవిజయం తర్వాత ‘ప్రిన్స్’ అంటూ తమిళ, తెలుగు భాషల్లో సినిమా చేశారు. శివకార్తికేయన్ (Sivakarthikeyan) కథానాయకుడిగా తెరకెక్కిన ఆ సినిమా ఎలా ఉంది? ‘ప్రిన్స్’ (Prince Review) నవ్వించాడా లేదా చూద్దాం.
కథేంటంటే?: ఆనంద్ (శివకార్తికేయన్ - Sivakarthikeyan) ఓ స్కూలు టీచర్. క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లేంత స్ట్రిక్ట్ టీచర్. అలాంటి కుర్రాడు స్కూల్లో ఇంగ్లిష్ టీచర్‌గా చేరిన జెస్సికా (మరియా) అనే బ్రిటిష్ అమ్మాయిని చూసి మనసు పారేసుకుంటాడు. వీరి ప్రేమను జెస్సికా తండ్రి అంగీకరించడు. దీంతో ప్రేమ పెళ్లిళ్లకు బాగా సపోర్టు చేసే తన తండ్రి విశ్వనాథ్ (సత్యరాజ్ - Satyaraj) దగ్గరకు వెళ్తాడు. అయితే అతను మాత్రం షాక్ ఇస్తాడు. అప్పటివరకు లవ్‌గురులా మాటలు చెప్పిన విశ్వనాథ్ ఒక్కసారి వ్యతిరేకం అయిపోతాడు. అప్పటివరకు ప్రేమ పోరాటంలా కనిపించిన ఈ కథ రెండు దేశాల మధ్య పోరులా మారిపోతుంది. దీంతో ఆనంద్ తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అనేదే సినిమా కథ.
ఎలా ఉందంటే?: యాక్షన్ ఓరియెంటెడ్, ఫ్యామీలీ బ్యాక్‌డ్రాప్, మాఫియా డాన్.. ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమాలు కాస్త స్లో అయినా.. ప్రేక్షకులు అడ్జెస్ట్ అవుతారు. కానీ, కామెడీనే నమ్ముకుని సినిమా చేసేటప్పుడు థియేటర్‌లో ఎప్పుడూ నవ్వులు వినిపిస్తూనే ఉండాలి. అరుపులు, కేకలు మోగుతూనే ఉండాలి. ఇది సగటు ప్రేక్షకుడి ఆలోచన. అందుకే నవ్వించడం, నవ్వించే సినిమా చేయడం అంత ఈజీ కాదంటారు. అయితే దీనికి అక్కడకక్కడా చెర్రీ లాంటి ఎమోషన్స్ కూడా ఉండాలి. ‘ప్రిన్స్’ విషయంలో ఈ పాయింట్ దగ్గరే సమ్‌థింగ్ మిస్సింగ్ అనిపిస్తుంది.
నిన్న చెప్పిన జోక్, నిన్నవేసిన పంచ్ ఈ రోజు వేస్తే సినిమా నుంచి ప్రేక్షకుడు డీవియేట్ అయిపోతాడు. కొత్తదనమేమీ లేదా అంటూ ఓ చిన్న ప్రశ్న లాంటి ఫేస్ పెడతాడు. ఇప్పుడు ‘ప్రిన్స్’ విషయంలోనూ అదే జరిగింది. చదువుకున్నా అల్లరి చిల్లరగా తిరిగే ఓ కుర్రాడు, అతనికి ముగ్గురు స్నేహితులు.. పెద్దింటి అమ్మాయిని ప్రేమిస్తాడు, ఎలాగోలా ఆ అమ్మాయిని తన అమాయకత్వం, మంచితనంతో ప్రేమలో ఒప్పిస్తాడు. ఈలోగా ఓ సమస్య వచ్చిపడుతుంది, దాన్ని హీరో ఎలా క్లియర్ చేశాడు. ఈ కథ ‘జాతిరత్నాలు’లో మొన్నే చూశాం. ఇంచుమించు అదే తరహా స్క్రీన్‌ప్లేతో మళ్లీ ‘ప్రిన్స్’ చేశారు. దీంతో ప్రేక్షకుడికి కొత్తదనం కనిపించక కూర్చొన్న కుర్చీలోనే కూలబడతాడు. అక్కడక్కడా కొన్ని పంచ్‌లు, ఫేస్ ఎక్స్‌ప్రెషన్లు పేలి చిన్నగా నవ్వుకుంటాడు. అది తప్ప ‘ప్రిన్స్’ చూపించిన మెరుపులేవీ పెద్దగా లేవు.
ఎవరెలా చేశారంటే?: హీరో ఓరియెంటెడ్ కామెడీ సినిమాలకు మన దగ్గర మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఆ సినిమాల్లో హీరో ఒంటి చేత్తో సినిమాను నడిపిస్తాడు. ఇప్పుడు ‘ప్రిన్స్’ విషయంలోనూ అదే జరిగింది. శివకార్తికేయన్ సినిమాను సింగిల్ హ్యాండ్‌తో డీల్ చేశాడు. ఉక్రెయిన్ భామ మరియ తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించింది. ఇక చెప్పుకోవాల్సిన పాత్రలో ముఖ్యమైనది సత్యరాజ్. విశ్వనాథం అనే పొగడ్తలకు పడిపోయే సగటు వ్యక్తిగా అదరగొట్టారు. తెలియని విషయాలు తెలుసు అని చెప్పి ఆయన నవ్వించే విధానం అదిరిపోతుంది. ప్రేమ్‌జీ అమేరన్ తనదైన పంచ్‌లు, రియాక్షన్లతో అదరగొట్టాడు.
సాంకేతిక నిపుణుల విషయానికొస్తే మనోజ్ పరమహంస కెమెరా పనితనం బాగుంది. పాటలు అందంగా చిత్రీకరించారు. మిగిలిన సన్నివేశాల్లో అంత స్కోప్ లేదు. తమన్ పాటలు బాగున్నాయి. గతంలో విన్నట్టే ఉన్నా బాణీలు బాగున్నాయి. వాటిని చిత్రీకరించిన విధానమూ బాగుంది. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా తగ్గలేదు. ఆఖరిగా చెప్పాల్సింది దర్శకుడు అనుదీప్ గురించి. ‘అలాంటి సినిమానే కావాలి అంటే.. అదే కథ మళ్లీ తీశాడు’ అని అదే సినిమాలో చెప్పినట్లు.. అనుదీప్ అదే పని చేశారు. అయితే ‘జాతిరత్నాలు’లో వర్కౌట్ అయిన రైటింగ్ మ్యాజిక్ ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు.
తెలుగు సినిమా అని ఈ సినిమా ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత తమిళంలో తీసి తెలుగులోకి అనువదించారు. ఆ వాసన సినిమా అంతటా కనిపిస్తుంటుంది. అలాగే సత్యరాజ్ తప్ప తెలుగు సినిమాలో విరివిగా నటించే ఒక్క నటుడూ ఇందులో కనిపించలేదు. దీంతో నేటివిటీ సమస్య బాగా కనిపిస్తుంది. దాంతో ఆ నటులు పంచ్‌లు వేస్తున్నా కనెక్ట్ అవ్వవు. అనుదీప్ స్టైల్ వన్ లైనర్స్, కౌంటర్ పంచ్‌లు చాలానే ఉన్నాయి. అందులో కొన్ని మాత్రమే నవ్వులు పూయిస్తాయి.
బలాలు
+ శివకార్తికేయన్ నటన
+ కొన్ని కామెడీ సీన్స్
బలహీనతలు
- తెలిసిన, ట్విస్ట్‌లు లేని కథ
- నేటివిటీ
- కొత్తదనం కొరవడటం
చివరిగా: ప్రిన్స్.. అదే ‘జాతిరత్నానికి’ కొత్త మెరుగులు..
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
SC: ఆ రికార్డులు సమర్పించండి.. బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
-
Politics News
TS Assembly: ‘ఎందుకు రావట్లేదు’- కేటీఆర్... ‘పిలిస్తే కదా వచ్చేది’- ఈటల
-
Movies News
Thunivu: ఓటీటీలో ‘తునివు’ వచ్చేస్తోంది.. రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే..?
-
World News
North Korea: రూ.13.9వేల కోట్లు కొల్లగొట్టిన కిమ్ ‘జాతిరత్నాలు’..!
-
Latestnews News
IND vs AUS: అశ్విన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఆసీస్ ‘డూప్లికేట్’ వ్యూహం!
-
India News
Mumbai: ముంబయిలో ఉగ్ర దాడులంటూ ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్..!