Dev Mohan: ఇటు సమంతతో.. అటు రష్మికతో సినిమాలు.. ఎవరీ దేవ్ మోహన్?
సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘శాకుంతలం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయంకాబోతున్నాడు మలయాళీ నటుడు దేవ్ మోహన్. త్వరలోనే ఈ చిత్రం విడుదలకానున్న సందర్భంగా దేవ్ గురించి కొన్ని సంగతులివీ..
ప్రముఖ నటి సమంత (Samantha Ruth Prabhu) ప్రధాన పాత్ర పోషించిన ‘శాకుంతలం’ (Shaakuntalam)లో అతడు కీలక పాత్ర పోషించాడు. మరో ప్రముఖ కథానాయిక రష్మిక (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ‘రెయిన్‌బో’ (Rainbow)లో ముఖ్య భూమిక పోషిస్తున్నాడు. ఇద్దరు అగ్ర హీరోయిన్ల సినిమాల్లో కీ రోల్‌లో కనిపించనుండడంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతడే మలయాళ నటుడు దేవ్ మోహన్ (Dev Mohan). ‘శాకుంతలం’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్న ఆయన గురించి కొన్ని విశేషాలు..
మిస్టర్ ఇండియా పోటీల్లో..
దేవ్ మోహన్ స్వస్థలం కేరళలోని త్రిశ్శూర్. 1992 సెప్టెంబరు 18న జన్మించాడు. అతనికో సోదరి. మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన దేవ్.. బెంగళూరులోని ఓ కార్పొరేట్ సంస్థలో కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేశాడు. దేవ్‌కు చిన్నప్పటి నుంచీ వ్యాయామం చేసే అలవాటు ఉండడంతో బెంగళూరులోనూ ప్రతిరోజూ జిమ్‌కు వెళ్లేవాడు. అలా జిమ్‌కు వెళ్తుండే దేవ్‌కు ఓ మోడల్ పరిచయమయ్యాడు. ఫిజిక్ బాగుందని చెబుతూ మిస్టర్ ఇండియా పోటీల్లో పాల్గొనాలని దేవ్‌కు ఆ మోడల్ సలహా ఇచ్చాడు. ఆ దిశగా ప్రయత్నం చేస్తే బాగుంటుందనుకున్న దేవ్ 2016లో ముంబయిలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని ఫైనలిస్ట్‌గా ఎంపికయ్యాడు. ఉద్యోగం చేస్తూనే వారాంతాల్లో ఫ్యాషన్ షోల్లో పాల్గొనేవాడు.
అలా సినిమా అవకాశం..
‘నాకు నటన అంటే ఆసక్తి ఉండేది కాదు. అనుకోకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టా’ అని చాలామంది సినీ తారలు చెప్పడం వినే ఉంటాం. దేవ్ కూడా ఆ కోవలోకే వస్తాడు. యాక్టింగ్ అంటే ఇష్టంలేని అతడు సినీ రంగంలోకి ఎలా అడుగు పెట్టాడంటే..? దేవ్ మోడలింగ్ చేసే సమయంలో తన స్నేహితుడు ఓ నిర్మాణ సంస్థ కొత్త హీరోలను వెతుకుతోందని చెప్పి, అదృష్టం పరీక్షించుకోమన్నాడట. మిత్రుడి మాటను కాదనలేక దేవ్ సంబంధిత ఆడిషన్‌కు వెళ్లాడు. ఆడిషన్ ఇచ్చిన కొన్నిరోజుల్లోనే సెలక్ట్ చేసినట్లు ఆయనకు శుభవార్త అందింది. అక్కడి వరకు పరిస్థితి బాగానే ఉన్నా తదుపరి పరిణామాలు దేవ్‌ని కుదురుగా ఉండనివ్వలేదు. నటుడిగా ఎంపికయ్యావనే కబురు తప్ప ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయాన్ని ఎంతకీ చెప్పకపోవడంతో దేవ్.. ఆ చిత్ర దర్శకుడికి తరచూ ఫోన్లు చేసేవాడట. ఎన్నిసార్లు అడిగినా.. ‘సినిమా అంటూ తీస్తే నీతోనే’ అనేది ఆ దర్శకుడి నుంచి సమాధానం. ఎట్టకేలకు చిత్రీకరణ మొదలయ్యాకే హీరోనవుతున్నాననే నమ్మకం కలిగిందని దేవ్ ఓ సందర్భంలో తెలిపాడు. మరో ట్విస్ట్ ఏంటంటే? నటుడిగా తన ప్రతిభను వెండితెరపై చూసుకోవాలనుకున్న దేవ్ కల నెరవేరలేదు. తన తొలి సినిమా ‘సూఫియం సుజాతయుం’ (Sufiyum Sujatayum) ఓటీటీలో విడుదలవడంతో దేవ్‌కి నిరాశ ఎదురైనట్టైంది. కానీ, తన నటనపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపించడంతో దేవ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
నటుడనే విషయం చెప్పకుండా..
సినిమాలో నటించే అవకాశం వచ్చిన విషయాన్ని దేవ్ ఎవరికీ చెప్పలేదు. తాను పోషించిన పాత్ర కోసం గడ్డం, జుట్టు పెంచుకోవడంతో ‘దేవ్.. ఏదో చేస్తున్నాడు’ అని సహోద్యోగులు అనుకునేవారట. కానీ, అసలు విషయం తెలుసుకోలేకపోయారు. పైగా ఆ సినిమా ట్రైలర్ చూసి ‘ఈ చిత్రంలోని హీరో నీలానే ఉన్నాడు’ అంటూ పొగిడేవారు. దేవ్ మోహనే ఆ హీరో అని కొన్ని రోజుల తర్వాత తెలుసుకున్నారు.
తొలి ప్రయత్నంలోనే గుర్తింపు
తొలి ప్రయత్నంలోనే సవాలు విసిరే పాత్ర చేశాడు దేవ్. ‘సూఫియుం సుజాతయుం’లో సూఫీ గురువుగా ఆయన నటించాడు. ఆ పాత్రలో ఒదిగిపోయేందుకు వాళ్ల హావభావాలు, సూఫీ ప్రత్యేకమైన నాట్యం, కొంచెం అరబిక్, ధ్యానం... ఇలా ఎన్నో నేర్చుకున్నాడు. ఖురాన్ నుంచి కొన్ని విషయాలు తెలుసుకున్నాడు. ‘నా తొలి సినిమా సూఫియుం సుజాతయుం చూసిన నిర్మాత గుణ నీలిమ ‘శాకుంతలం’లో దుష్యంతుడి పాత్రకు ఎంపిక చేశారు’ అని దేవ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
సమంతకు విజ్ఞప్తి..!
నటుడిగా కెరీర్ ప్రారంభమైన అనతి కాలంలోనే ఇతిహాస నేపథ్య చిత్రంలో నటించడం, అదీ సమంతతో కలిసి తెరను పంచుకోవడంపై ఆనందం వ్యక్తం చేసిన దేవ్.. సమంత నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు. ఇక్కడి వాతావరణం, తెలుగు భాష కొత్త కావడంతో .. చిత్రీకరణ సమయంలో ఎలాంటి సందేహాలు వచ్చినా అడుగుతానని, నటనలో సహకారంకావాలని షూటింగ్ ప్రారంభించిన తొలిరోజే సమంతకు విజ్ఞప్తి చేశాడట. సమంత కన్నా వయసులో దేవ్ మోహన్ ఐదేళ్లు చిన్నవాడు వాడు కావడం గమనార్హం. దేవ్ నటించిన తొలి సినిమా ‘సూఫియుం సుజాతయుం’ 2020లో విడుదలైంది. ఆ తర్వాత ‘హోమ్’ చిత్రంలో అతిథి పాత్ర పోషించాడు. అది 2021లో ప్రేక్షకుల ముందుకురాగా దేవ్ నటించిన మూడో చిత్రం ‘పాత్రాండు’ 2022లో రిలీజ్ అయింది. ఈ మూడు సినిమాల అనుభవంతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడాయన.
ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ తెరకెక్కించిన ‘శాకుంతలం’ ఈ నెల 14న విడుదలకాబోతుంది. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమాల చేస్తున్న దేవ్.. రష్మిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘రెయిన్‌బో’లోనూ నటిస్తున్నాడు. నూతన దర్శకుడు శాంతరూబన్ ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శాకుంతలం విషయానికొస్తే.. కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపొందిన ఆ సినిమాలో మోహన్‌బాబు, మధుబాల, గౌతమి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అల్లు అర్జున్ తనయ అర్హ బాల నటిగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. 3డీ వెర్షన్‌లోనూ ఆ సినిమా విడుదలవుతుంది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
iPhone: ఐఫోన్ డెలివరీ ఆలస్యం.. కోపంతో షాపు ఉద్యోగులనే చితకబాదారు
-
Defamation: కాంగ్రెస్ ఎంపీపై.. అస్సాం సీఎం సతీమణి రూ.10 కోట్లకు దావా!
-
Revanth Reddy: కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు ఉంటాయి: రేవంత్‌రెడ్డి
-
Suryakumar Yadav: ఇన్నాళ్లూ తికమక పడ్డా.. నా కొత్త పాత్రను ఇష్టపడుతున్నా: సూర్యకుమార్