Adipurush: ప్రభాస్‌కు కొత్త అనుభవం.. దర్శకుడి మూడో ప్రయత్నం

రామాయణం ఆధారంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా.. ‘ఆదిపురుష్‌’. ఈ శుక్రవారం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు, హీరో, హీరోయిన్ల వివరాలపై ఓ లుక్కేద్దాం..

Published : 14 Jun 2023 10:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎప్పుడెప్పుడా అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆదిపురుష్‌’ (Adipurush) కొన్ని గంటల్లోనే విడుదలకానుంది. నెట్టింట ప్రస్తుతం ఈ సినిమా హ్యాష్‌ట్యాగ్‌ (#Adipurush) ట్రెండింగ్‌లో ఉంది. మరి, ఈ చిత్రం విషయంలో కీలకమైన వ్యక్తుల గురించి తెలుసుకుందామా (Adipurush Release on June 16th)..

దర్శకుడికి 3వ సినిమా..

దర్శకుణ్ని ‘కెప్టెన్‌ ఆఫ్‌ సినిమా’ అంటారు. సాధారణ కథలు, ఫిక్షనల్‌ స్టోరీలు అయితే దర్శకుడికి స్వేచ్ఛ ఎక్కువ లభిస్తుంది. కానీ, అందరికీ తెలిసిన ఇతిహాసాలను, పురాణగాథలను సినిమాగా మలచాలంటే తెర వెనుక చెప్పలేనంత కష్టం దాగుంటుంది. ఆయా గాథల్ని ఏమాత్రం మార్చి చూపించినా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఉంటాయని తెలిసీ ‘ఆదిపురుష్‌’ కోసం దర్శకుడు ఓంరౌత్‌ (OM Raut) ముందడుగువేశారు. అత్యున్నత సాంకేతికతతో సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో సినిమాని రూపొందించారు. రామాయణాన్ని (Ramayan) ఆధారంగా చేసుకుని భారీ స్థాయిలో తీశారంటే ఈ డైరెక్టర్‌కు ఎక్కువ అనుభవం ఉందనుకుంటే పొరపాటే. ‘ఆదిపురుష్‌’ కంటే ముందు ఆయన కేవలం రెండు సినిమాలకే దర్శకత్వం వహించారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ముంబయిలో పుట్టి పెరిగిన ఓంరౌత్‌.. ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ విద్యలో పట్టా పొందారు. సినిమాలకు సంబంధించి న్యూయార్క్‌లోని ప్రముఖ యూనివర్సిటీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. తన తాత డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్‌, ఎడిటర్‌ కావడంతో ఆ ప్రభావం ఓంరౌత్‌పై పడింది. బాల్యంలో థియేటర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేసిన ఆయన కొన్ని యాడ్స్‌లోనూ నటించారు. పెద్దయ్యాక ‘కరామతి కోట్‌’ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. రైటర్‌, డైరెక్టర్‌గా ఎమ్‌టీవీ నెట్‌వర్క్‌లో కొన్నాళ్లు పనిచేశారు. ‘సిటీ ఆఫ్‌ గోల్డ్‌’, ‘హాంటెడ్‌- 3డీ’ సినిమాలకు నిర్మాత వ్యవహరించారు. ‘లోక్‌మాన్య’ (Lokmanya) అనే మరాఠీ చిత్రంతో మెగాఫోన్‌ పట్టారు. బాల గంగాధర్‌ తిలక్‌ జీవితంలోని కొన్ని ఘట్టాల ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. ఆ తర్వాత ఆయన డైరెక్ట్‌ చేసిన ‘తానాజీ’ (Tanhaji).. జాతీయ అవార్డు అందుకుంది.

హీరోకి 21వ సినిమా..

ఈ సినిమాలో ప్రభాస్‌ (Prabhas) రాముడిగా నటించిన సంగతి తెలిసిందే. హీరోగా ఆయనకు ఇది 21వ చిత్రమే అయినా ఈ నేపథ్యంలో విషయంలో మొదటిది. ఎక్కువగా మాస్‌, యాక్షన్‌ చిత్రాలు చేసిన ఆయన ‘బాహుబలి’తో జానపద కథను టచ్‌ చేశారు. ఇప్పుడు ‘ఆది పురుష్‌’ మైథలాజికల్‌ జానర్‌ కొత్త. సినిమా ప్రకటన వెలువడగానే రాముడిగా ప్రభాస్‌ ఎలా ఉంటాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఫస్ట్‌లుక్‌ చూసి ఫిదా అయ్యారు. ‘మనం జన్మతోకాదు చేసే కర్మతో చిన్నా పెద్దా అవుతాం’ అని ఆయన చెప్పిన సంభాషణకు కనెక్ట్‌ అయ్యారు. ఈ సినిమాలో నటించడం తన అదృష్టమని ఆయన ఓ వేడుకలో తెలిపారు. అది ఒక సినిమా కాదని భావోద్వేగమని పేర్కొన్నారు.

ప్రతి నాయకుడికి 64వ చిత్రం..

నటుడిగా సుదీర్ఘ ప్రస్థానమున్న బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan).. ఈ  సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయనకు ఇది 64వ చిత్రం. ఇందులో ఆయన రావణాసురుడు/లంకేశ్‌ పాత్రలో కనిపించనున్నారు. ఓంరౌత్‌ తీసిన ‘తానాజీ’లోనూ ఆయన ప్రతినాయకుడిగా నటించారు. ప్రస్తుతం తెలుగు సినిమా ‘దేవర’ (Devera)లోనూ విలన్‌గా నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ (NTR) హీరోగా దర్శకుడు శివ కొరటాల తెరకెక్కిస్తున్న సినిమా ఇది.

హీరోయిన్‌కి 16వ చిత్రం..

తెలుగు సినిమా ‘1 నేనొక్కడినే’తో తెరంగేట్రం చేసింది దిల్లీ భామ కృతి సనన్‌ (Kriti Sanon). తదుపరి ‘దోచేయ్‌’లో నటించిన ఆమె బాలీవుడ్‌లో బిజీ అయిపోయారు. ‘ఆదిపురుష్‌’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ఆమెకు 16వ సినిమా ఇది. ఇందులో సీత పాత్ర పోషించారు. అద్భుతంగా నటించారంటూ ప్రభాస్‌ ఆమెకు కితాబిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని