Jailer: చిత్ర పరిశ్రమకో అగ్ర నటుడు.. ‘జైలర్‌’లో కీలక పాత్రధారులు వీరే..

రజనీకాంత్‌ హీరోగా దర్శకుడు నెల్సన్‌ తెరకెక్కించిన చిత్రం ‘జైలర్‌’. ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇందులోని కీలక పాత్రలపై ఓ లుక్కేయండి..

Published : 08 Aug 2023 12:46 IST

అగ్ర నటుడు రజనీకాంత్‌ (Rajinikanth) తెరపై కనిపించి సుమారు రెండేళ్లవుతుంది. ఆ లోటును తీర్చి, అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు ‘జైలర్‌’ (Jailer) చిత్రం సిద్ధమైంది. స్క్రీన్‌పై రజనీకాంత్‌ ఒక్కరు కనిపిస్తేనే పండగ వాతావరణం నెలకొంటుంది. ఆయనతోపాటు ఇతర చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర నటులు తోడైతే ఆ సందడి మరోస్థాయికి చేరుకుంటుంది. మరి, ఈ సినిమాలో ఎవరెవరు కనిపించనున్నారంటే?

మలయాళం నుంచి మోహన్‌లాల్‌

మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ (Mohanlal). అగ్ర కథానాయకుడిగా రాణిస్తున్న ఆయనకు గెస్ట్‌ రోల్స్‌ ప్లే చేయడం కొత్తేమీ కాదు. కథ నచ్చితే ఎవరి సినిమాలోనైనా నటించేందుకు ఆయన ముందుంటారు. ‘శ్రీ అయ్యప్పనుమ్‌ వవరమ్‌’, ‘పేరువన్నపురతే విశేషంగళ్‌’, ‘సమ్మర్‌ ఇన్‌ బెథ్లెహమ్‌’, ‘వాంటెమ్‌’, ‘కిలుక్కమ్‌ కిలుకిలుక్కమ్‌’ తదితర చిత్రాల్లో ఆయన తళుక్కున మెరిశారు. ‘జైలర్‌’లో మ్యాథ్యూ అనే పాత్రలో కనిపించనున్నారు. 

కన్నడ నుంచి శివ రాజ్‌కుమార్‌

శాండిల్‌వుడ్‌ అగ్ర నటుల్లో ఒకరైన శివ రాజ్‌కుమార్‌ (Shiva Rajkumar) సైతం ఇతర హీరోల చిత్రాల్లో నటించేందుకు ముందుంటారు. రజనీకాంత్‌తో కలిసి నటించే అవకాశంరావడంతో కథను కూడా విననని దర్శకుడికి చెప్పారట. ఈ సినిమాలో ఆయన నరసింహగా నటించారు. సుమారు 12 నిమిషాలపాటు ఆయన తెరపై కనిపిస్తారు. తాను పోషించిన పాత్ర సినిమాకు కీలకమని, క్లైమాక్స్‌లోనూ ఆ క్యారెక్టర్‌ తెరపైకి వస్తుందని శివ రాజ్‌కుమార్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. గతంలో.. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ఉపేంద్ర, సుదీప్‌ల చిత్రం ‘కబ్జ’ తదితర వాటిల్లో ఆయన అతిథిగా అలరించారు.

హిందీ నుంచి జాకీష్రాఫ్‌

‘అరణ్య కాండ’ సినిమాతో 2010లో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్‌ ప్రముఖ నటుడు జాకీష్రాఫ్‌ (Jackie Shroff). ‘బిగిల్‌’, ‘మాయవన్‌’ తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి, తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఆయన ‘జైలర్‌’లో ఓ కీ రోల్‌ ప్లే చేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో.. ‘నువ్వు ఆయన్ను చూసింది ఓ పోలీసోడి తండ్రిగానే.. కానీ ఆయనలో నువ్వు చూడని ఇంకొకడిని నేను చూశా’ అంటూ హీరోని ఉద్దేశించి జాకీష్రాఫ్‌ చెప్పిన డైలాగ్‌ సినిమాపై అంచనాలు పెంచింది. ఈయన తెలుగు వారికి పరిచయమే. ‘అస్త్రం’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత ‘శక్తి’, ‘పంజా’, ‘సాహో’ చిత్రాల్లో నటించారు.

విలన్‌ ఈయనే..

ఈ చిత్రంలో రజనీకాంత్‌తో తలపడేది మలయాళ నటుడు వినాయకన్‌ (Vinayakan). తమిళంలో ఆయన నటించిన ఏడో చిత్రమిది. తెలుగులో ఇప్పటి వరకు ఒకే ఒక్క చిత్రంలో నటించారు. అదే.. కల్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన ‘అసాధ్యుడు’. ‘జైలర్‌’లో ఆయన క్యారెక్టర్‌ క్రూరంగా ఉంటుందని ఇటీవల విడుదలైన ట్రైలర్‌ తెలియజేస్తుంది.

వీరు ఇలా..

‘పడిక్కవదన్‌’లో రజనీకాంత్‌, రమ్యకృష్ణ (Ramya Krishnan) తొలిసారి కలిసి నటించారు. రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన ‘బాబా’ చిత్రంలో ఆమె అతిథిగా కనిపించారు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ‘నరసింహ’కు ప్రత్యేక అభిమానగణం ఉన్న సంగతి తెలిసిందే. ‘జైలర్‌’లో వీరిద్దరు భార్యాభర్తలుగా నటించారు. ఈ సినిమాలో సునీల్‌ కూడా సందడి చేయనున్నారు. గతంలో.. రజనీకాంత్‌ హీరోగా వచ్చిన ‘కథానాయకుడు’లోనూ సునీల్‌ (Sunil) నటించారు. టైగర్‌ ముత్తువేల్‌ పాండియన్‌గా రజనీకాంత్‌ నటించగా ఆయన కొడుకు అర్జున్‌గా వసంత్‌ రవి (Vasanth Ravi), కోడలిగా మిర్నా మేనన్‌ (Mirnaa Menon) కనిపిస్తారు. హీరోయిన్‌ తమన్నా, యోగిబాబు తదితరులు ఇతర కీలక పాత్రల్లో అలరించనున్నారు. దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ (Nelson Dilipkumar) తెరకెక్కించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందకు రానుంది. ఇంతమంది తారలు నటించడం, ట్రైలర్‌ ఆకట్టుకోవడంతో ‘జైలర్‌’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని