Tollywood: వీరు డ్యాన్స్‌తోనే ఆగిపోలేదు.. మరో అడుగేశారు

ఎందరో నటులకు ఆమె తన కొరియోగ్రఫీతో క్రేజ్‌ తీసుకొచ్చారు. డ్యాన్స్‌ మాస్టర్‌గా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.

Published : 02 Mar 2022 14:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన కొరియోగ్రఫీతో ఎందరో నటులకు ఆమె క్రేజ్‌ తీసుకొచ్చారు. డ్యాన్స్‌ మాస్టర్‌గా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. దర్శకురాలిగానూ తనదైన ముద్రవేయాలనుకున్నారు. ‘హే సినామిక’ చిత్రంతో తన కల నెరవేర్చుకున్నారు. ఆ ప్రతిభావంతురాలు మరెవరోకాదు బృంద మాస్టర్‌. ‘హే సినామిక’ కోసం ఆమె డైరెక్టర్‌గా మారారు. ఈ సినిమాలో దుల్కర్‌ సల్మాన్‌, కాజల్‌ అగర్వాల్‌, అదితిరావు హైదరీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం మార్చి 3న ప్రేక్షకుల ముందుకురానుంది. కొరియోగ్రాఫర్‌గా సినీ ప్రయాణం మొదలుపెట్టి తర్వాత మెగాఫోన్‌ పట్టి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నవారిని గుర్తుచేసుకుందామా..

అసిస్టెంట్‌గా మొదలై..

బాలీవుడ్‌ చిత్రం ‘ఇన్సఫ్‌ కీ పుకర్‌’తో అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా బృంద మాస్టర్‌ ప్రస్థానం మొదలైంది. ‘ఆఖరిపోరాటం’, ‘జానకి రాముడు’, ‘ప్రేమ్‌ ప్రతిజ్ఞ’, ‘ఫూల్‌ ఔర్‌ కాంటే’, ‘జాగృతి’ చిత్రాలకు అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గానే పనిచేశారు. ‘ముగవరీ’ అనే తమిళ సినిమాతో కొరియోగ్రాఫర్‌గా మారారు. ‘నమ్మవీర్‌’ అనే తమిళ సినిమా కోసం తొలిసారి కెమెరా ముందుకొచ్చారు. నిర్మల అనే పాత్రలో నటించి, మెప్పించారు. బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌.. ఇలా అన్ని చిత్ర పరిశ్రమల్లోని అగ్ర తారలతో పనిచేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల, కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రధారిగా రూపొందిన ‘గాంధారి’ వీడియో ఆల్బమ్‌కు వైవిధ్యభరిత నృత్యరీతులు సమకూర్చి ప్రశంసలు అందుకున్నారు. ఇలా డ్యాన్స్‌ మాస్టర్‌గా రాణిస్తూనే ‘స్టార్ట్‌ కెమెరా యాక్షన్‌’ చెప్పాలనే తన కలను నిజం చేయాలనుకున్నారు. ప్రేమ, పెళ్లి, విడాకులు.. కాన్సెప్ట్‌తో రొమాంటిక్‌ కామెడీగా ‘హే సినామిక’ తెరకెక్కించారు.

ఆఖరిపోరాటంతో..

‘ఆఖరిపోరాటం’తో కొరియోగ్రాఫర్‌గా టాలీవుడ్‌కి పరిచయమైన సుచిత్రా చంద్రబోస్‌ ‘చైతన్య’, ‘మనీ’, ‘వజ్రం’, ‘చిన్నబ్బాయి’, ‘అన్నమయ్య’, ‘జయం మనదేరా’, ‘ప్రియమైన నీకు’, ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మనసంతా నువ్వే’, ‘నిన్నే ఇష్టపడ్డాను’, ‘ఝుమ్మందినాదం’, ‘గోపాల గోపాల’ తదితర చిత్రాల్లోని పాటలకు నృత్యరీతులు సమకూర్చారు. ‘పల్లకిలో పెళ్లికూతురు’ సినిమాతో ‘డైరెక్టర్‌ సుచిత్రా చంద్రబోస్‌’ అయ్యారు. బ్రహ్మానందం తనయుడు గౌతమ్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు రాఘవేంద్రరావు స్క్రీన్‌ప్లే అందించారు.

వర్షం ఇచ్చిన అవకాశం..

‘చికుబుకు చికుబుకు రైలే’ స్టెప్పుతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన డ్యాన్స్‌ మాస్టర్‌ ప్రభుదేవా. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకూ ఉన్న స్టార్లందరికీ డ్యాన్స్‌ మెలకువలు నేర్పి స్టార్‌ కొరియోగ్రాఫర్‌ అయ్యారు. దర్శకుడిగా మారే అవకాశాన్ని ‘వర్షం’ సినిమా ద్వారా అందుకున్నారు. ఈ సినిమాలోని ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ పాట చిత్రీకరణ సమయంలో ‘ఏదైనా చిత్రానికి నువ్వు డైరెక్షన్‌ చేయొచ్చు కదా’ అని ప్రభుదేవాను అడిగారట నిర్మాత ఎం.ఎస్‌. రాజు. ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న ఆ మంచి తరుణం మించితే బాగుండదని వెంటనే ఓకే అన్నారట ప్రభుదేవా. అలా సిద్ధార్థ, త్రిష జంటగా లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈ చిత్రం అత్యధిక భాషల్లో రీమేక్‌ అయిన తెలుగు సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఆ చిత్రం అందించిన విజయంతో ప్రభుదేవా తెలుగులో ‘పౌర్ణమి’, ‘శంకర్‌దాదా జిందాబాద్‌’, తమిళంలో ‘పోక్కిరి’, ‘విల్లు’, హిందీలో ‘వాంటెడ్‌’, ‘రామయ్య వస్తావయ్యా’, ‘యాక్షన్‌ జాక్సన్‌’, ‘సింగ్‌ ఈజ్‌ బ్లింగ్‌’, ‘దబాంగ్‌ 3’, ‘రాధే’ తదితర చిత్రాలను తెరకెక్కించారు. దర్శకుడిగానే కాకుండా పలు సినిమాల్లో తనలోని నటుడ్ని పరిచయం చేశారు.

‘ఏగన్’తో..

అజిత్‌ హీరోగా ‘ఏగన్‌’ అనే సినిమా తెరకెక్కించి దర్శకుడిగా తన డ్రీమ్‌ నెరవేర్చుకున్నారు రాజు సుందరం. ‘చెంబరుతి’ అనే చిత్రంతో కొరియోగ్రాఫర్‌గా తన సినీ ప్రయాణానికి శ్రీకారం చుట్టిన ఆయన వందలకుపైగా సినిమాలకు పనిచేశారు. ‘జీన్స్‌’ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. ‘పెళ్లైన కొత్తలో’, ‘యాక్షన్‌ 3డీ’, ‘సైజ్‌ జీరో’ తదితర చిత్రాల్లో మెరిశారు.

లారెన్స్‌.. మాస్‌

తొలినాళ్లలో.. ప్రభుదేవాతో కలిసి పలు పాటలకు పనిచేసిన లారెన్స్‌ టాలీవుడ్‌ ప్రముఖ నటుడు చిరంజీవి దృష్టిని ఆకర్షించారు. చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘హిట్లర్‌’, ‘మాస్టర్‌’ తదితర సినిమాల్లోని సూపర్‌హిట్‌ పాటలకు ఆకట్టుకునే నృత్యరీతులు సమకూర్చి మంచి గుర్తింపు పొందారు. అలా తెలుగుతోపాటు ఇతర చిత్ర పరిశ్రమల్లోనూ వరుస అవకాశాలు అందుకున్నారు. మధ్యలో నటుడిగానూ మెరిశారు. ‘మాస్‌’ సినిమాతో దర్శకుడిగా మారారు. నాగార్జున, జ్యోతిక, ఛార్మి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత ‘స్టైల్’, ‘ముని’, ‘డాన్‌’, ‘కాంచన’, ‘రెబల్‌’ సినిమాలను తెరకెక్కించారు. ‘హారర్‌- కామెడీ సినిమాలకు లారెన్స్‌ పెట్టింది పేరు’ అని అనిపించుకున్నారు. ఇక్కడ ఘన విజయం అందుకున్న ‘కాంచన’ను కన్నడలో ‘కల్పన’గా, హిందీలో ‘లక్ష్మి’గా రూపొందించారు.

ఖతర్నాక్‌ డైరెక్టర్‌

అమ్మ రాజశేఖర్‌.. ‘దేవి’, ‘ఆజాద్‌’, ‘అంజి’, ‘సై’, ‘లక్ష్మి’, ‘లక్ష్యం’ తదితర చిత్రాల్లోని పాటలకు తన డ్యాన్స్‌తో మంచి క్రేజ్‌ తీసుకొచ్చారు .‘ఖతర్నాక్‌’ సినిమాతో మెగాఫోన్‌ పట్టారు. రవితేజ, ఇలియానా జంటగా ఈ సినిమాను తెరకెక్కించారు. ద్వితీయ ప్రయత్నం.. ‘రణం’తో ఘన విజయం అందుకున్నారు. గోపీచంద్‌, కామ్నా జఠ్మలానీ నాయకానాయికలు. ఆ తర్వాత ‘టక్కరి’, ‘బీభత్సం’, ‘మంగో’, ‘రణం 2’ తదితర సినిమాలకు దర్శకత్వం వహించారు.

* వీరే కాదు ఫరాఖాన్‌, రెమో డిసౌజా, గణేశ్‌ ఆచార్య, అహ్మద్‌ఖాన్‌, చిన్ని ప్రకాశ్‌, గాయత్రి రఘురామ్‌ వంటి ఎందరో ప్రముఖ కొరియోగ్రాఫర్లు దర్శకులుగా మారి ప్రేక్షకుల్ని అలరించారు. మరికొందరు యువ కొరియోగ్రాఫర్లూ డైరెక్టర్‌ అయ్యే ప్రయత్నంలో ఉన్నారు. సినిమాకు సంబంధించిన 24 విభాగాల్లో ఒకటైన కొరియోగ్రఫీ నుంచి వాటన్నింటికీ సారథ్యం వహించే స్థాయికి చేరుకోవడం అభినందించాల్సిన విషయమే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని