Tollywood: ఒకటి, రెండు కాదు ఏడు.. టాలీవుడ్‌లో కొత్త ట్రెండు!

చిత్ర పరిశ్రమలో కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి.  ఒక సినిమాకు సంబంధించి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు విడుదల తేదీలు తెరపైకొచ్చాయి.

Updated : 22 Feb 2022 12:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక సినిమాకు సంబంధించి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు విడుదల తేదీలు తెరపైకొచ్చాయి. కొవిడ్‌/ కరోనా ఇందుకు ఓ కారణంగా నిలిచింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం ఈ కొత్త పంథాకి నాంది పలికింది.

అది లేదా ఇది..

సుమారు రూ. 400 కోట్లతో నిర్మితమైన పాన్‌ ఇండియా చిత్రం ‘రౌద్రం రణం రుధిరం- ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR). రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా కొవిడ్‌ కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు 2022 సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేయాలని చిత్ర బృందం భావించినా థర్డ్‌ వేవ్‌ దృష్ట్యా మరోసారి వాయిదా వేయక తప్పలేదు. కొవిడ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో కొత్త విడుదల తేదీల్ని ఇటీవల ప్రకటించింది. టాలీవుడ్‌లో ఎన్నడూలేని విధంగా రెండు తేదీలను ఫిక్స్‌ చేసింది. అప్పటి పరిస్థితిని బట్టి.. మార్చి 18న లేదా ఏప్రిల్‌ 28న విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. కానీ, అనూహ్యంగా మార్చి 25ను ఖరారు చేసింది.

ఇదే బాటలో..

విడుదల తేదీ ప్రకటనకు సంబంధించి కొన్ని చిత్ర బృందాలు ఇదే బాటలో నడిచాయి. పవన్‌ కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో నటించిన ‘భీమ్లానాయక్‌’ను ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్‌ 1న విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. ఫిబ్రవరి 25నే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. మలయాళ సూపర్‌ హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని యువ దర్శకుడు సాగర్‌ కె. చంద్ర తెరకెక్కించారు. నిత్య మేనన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలు.

బాక్సింగ్‌ నేపథ్యంలో వరుణ్‌తేజ్‌ నటించిన చిత్రం ‘గని’. కిరణ్‌ కొర్రపాటి దర్శకుడు. బాలీవుడ్‌ నటి సయీ మంజ్రేకర్‌ ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. విడుదలకు సంబంధించి చిత్ర బృందం ఫిబ్రవరి 25, మార్చి 4 తేదీలను బుక్‌ చేసింది. ఫిబ్రవరి 25నే విడుదల చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది. ఇదే రోజు ‘భీమ్లానాయక్‌’ విడుదలవుతుండటంతో ‘గని’ విడుదలపై మీమాంస నెలకొంది. శరత్‌ మండవ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. మార్చి 25న లేదా ఏప్రిల్‌ 15న ఈ సినిమా విడుదలకానుంది. త్వరలోనే ఓ డేట్‌ ఖరారవుతుంది.

అంటే.. సరదాకి!

‘‘మీరంతా రెండు తేదీలు బుక్‌ చేస్తే మేం ఏడు చేయకూడదా’’ అంటూ నటుడు నాని పెట్టిన ఫన్నీ ట్వీట్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ఏప్రిల్‌ 22, ఏప్రిల్‌ 29, మే 6, మే 20, మే 27, జూన్‌ 3, జూన్‌ 10.. వీటిల్లో ఎప్పుడైనా తాను హీరోగా నటించిన చిత్రం ‘అంటే.. సుందరానికీ!’ ప్రేక్షకుల ముందుకురానుంది. వివేక్‌ ఆత్రేయ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. నాని సరసన నజ్రియా సందడి చేయనుంది. కొవిడ్‌తో మొదలైన ఈ నయా ట్రెండ్‌ ఇలానే కొనసాగుతుందా? అంటే కాలమే సమాధానం చెప్పాలి!



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని