Ramabanam: బాలకృష్ణ పెట్టిన పేరు.. క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌..‘రామబాణం’ విశేషాలివీ

ప్రముఖ హీరో గోపీచంద్‌ తాజా చిత్రం ‘రామబాణం’ ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విశేషాలపై ప్రత్యేక కథనం..

Updated : 03 May 2023 10:09 IST

గతేడాది ‘పక్కా కమర్షియల్‌’తో పలకరించిన హీరో గోపీచంద్‌ (Gopichand).. ఈ వేసవికి ‘రామబాణం’ (Ramabanam)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మే 5న (Ramabanam on May 5th) సినిమా విడుదలకాబోతున్న సందర్భంగా.. అది ఎలా మొదలైంది? నేపథ్యమేంటి? తదితర విశేషాలపై ఓ లుక్కేద్దాం (Ramabanam Release on May 5th)..

  1. నటుడిగా గోపీచంద్‌కి ఇది 30వ సినిమా. ‘లక్ష్యం’ (2007), ‘లౌక్యం’ (2014) తర్వాత దర్శకుడు శ్రీవాస్‌ (Sriwass)- గోపీచంద్‌ కాంబినేషన్‌లో రూపొందిన 3వ చిత్రం. ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా సినిమాకి ఏడేళ్లు గ్యాప్‌ ఉండడం యాదృచ్ఛికం.
  2. తమ కాంబోలో తెరకెక్కిన రెండు సినిమాలు విజయం అందుకోవడంతో హ్యాట్రిక్‌ కోసం ప్రయత్నం మొదలుపెట్టిన శ్రీవాస్‌.. యాక్షన్‌ స్టోరీని గోపీచంద్‌కు వినిపించగా.. ‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కథల్లో నటించి చాలా కాలమైంది. ఆ నేపథ్యంలో చేద్దాం’ అని ఆయన మనసులో మాట బయటపెట్టారు. దాంతో, రచయిత భూపతిరాజాని తీసుకుని గోపీచంద్‌ను శ్రీవాస్‌ కలిశారు. భూపతి రాసిన కథతోనే సినిమా ప్రారంభించారు.
  3. 2018లో విడుదలైన ‘సాక్ష్యం’ తర్వాత దర్శకుడు శ్రీవాస్‌ వేరే రెండు సినిమాలు చేయాలనుకున్నారు. పలు కారణాల వల్ల అవి చివరి దశలో క్యాన్సిల్‌ అయ్యాయి. అలా జరగడం వల్ల ఈ కాంబోలో మూడో చిత్రం తెరకెక్కింది.
  4. ఈ చిత్రం సెట్స్‌పై ఉండగా గోపీచంద్‌.. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘అన్‌స్టాపబుల్‌’ కార్యక్రమానికి హాజరయ్యారు. సినిమా విశేషాలు గోపీచంద్‌ను అడిగి తెలుసుకున్న బాలకృష్ణ.. ‘రామబాణం’ పేరు బాగుంటుందంటూ ఆ చిత్రానికి టైటిల్‌ ఖరారు చేశారు. ఇలా ప్రముఖ హీరో.. మరో హీరో సినిమాకి టైటిల్‌ పెట్టడం.. పైగా కార్యక్రమంలో ప్రకటించడం అరుదైన విషయం.
  5. ఉద్దేశపూర్వకంగా పెట్టకపోయినా గోపీచంద్‌ సినిమాల పేర్లకు చివరన సున్నా ఎక్కువగా కనిపిస్తుంది. ఆయన విలన్‌గా చేసిన ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’.. కథానాయకుడిగా నటించిన ‘యజ్ఞం’, ‘రణం’, ‘లక్ష్యం’, ‘లౌక్యం’, ‘సౌఖ్యం’, ‘శంఖం’, ‘శౌర్యం’, ‘సాహసం’, ‘పంతం’ ఆ జాబితాలోనివే. ఈ విషయంలో ‘రామబాణం’ 13వ చిత్రం.
  6. ‘గద్దలకొండ గణేశ్‌’లో ‘జర్రా జర్రా’ పాటకు డ్యాన్స్‌ చేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగమ్మాయి డింపుల్‌ హయాతి (Dimple Hayathi) ఈ సినిమాలో కథానాయిక. ఇందులో ఆమె యూట్యూబర్‌ భైరవిగా కనిపిస్తుంది. రవితేజ సరసన నటించిన ‘ఖిలాడి’ సమయంలోనే ‘రామబాణం’లో నటించే అవకాశం దక్కించుకుందామె. ఆ మూవీలో గ్లామరస్‌గా కనిపించింది కాబట్టి పక్కింటి అమ్మాయి తరహా పాత్రైన భైరవికి సెట్‌ అవుతుందో లేదోనని రెండు సార్లు స్క్రీన్‌ టెస్ట్‌ చేసి మరీ రామబాణానికి డింపుల్‌ను ఎంపిక చేశారు. ‘గల్ఫ్‌’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆమె కోలీవుడ్‌లోనూ నటించింది.
  7. ‘రామబాణం’లో గోపీచంద్‌ వ్యాపారవేత్తగా, ఆయన సోదరుడిగా జగపతిబాబు, వదినగా ఖుష్బూ నటించారు. ‘లక్ష్యం’లానే ఇది కూడా అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో రూపొందినా రెండింటికీ ఎలాంటి పోలికలు ఉండవని చిత్ర బృందం పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించింది. వినోదాత్మక సన్నివేశాలతోపాటు కథలో ఆహార కల్తీ అంశాన్ని అంతర్లీనంగా ప్రస్తావించారు. ఆర్గానిక్‌ ఫుడ్‌పై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
  8. మంచి గుర్తింపు ఉన్న హీరో సినిమాలకి సంగీతమూ ప్రధానమే. అందుకే మ్యూజిక్‌ డైరెక్టర్‌ విషయంలో దర్శకుడు, నిర్మాత, హీరో ఆచితూచీ అడుగేస్తుంటారు. అలా ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్‌ను ఎంపిక చేశారు. గోపీచంద్‌, మిక్కీ కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. ఇప్పటికే విడుదలైన పాటలు శ్రోతల్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘ఐఫోన్‌’ సాంగ్‌ నెట్టింట వైరల్‌ అయింది.
  9. సినిమాని రూపొందించడం ఒకెత్తైతే దాన్ని ప్రేక్షకులకు చేరువ చేయడం మరో ఎత్తు. ఎక్కువ మందికి సినిమా రీచ్ అవ్వాలంటే క్రియేటివ్‌గా ప్రమోట్‌ చేయాల్సిందే. ఈ విషయంలో మిగిలిన చిత్ర బృందాల కంటే ఓ అడుగు ముందే ఉంది ‘రామబాణం’ టీమ్‌. ఓ సంస్థ విక్రయించే పాల ప్యాకెట్లపైన సినిమా రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను ప్రచురించి, అందరి దృష్టిని ఆకర్షించింది.
  10. ఈ సినిమా U/A సెన్సార్‌ సర్టిఫికెట్‌ పొందింది. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు ఒక్క ఆడియో కట్‌గానీ వీడియో కట్‌గానీ (అభ్యంతరకరమైనవి) చెప్పలేదు. అలా జీరో కట్స్‌, జీరో మ్యూట్స్‌తో సెన్సార్‌ పూర్తిచేసుకున్న అతి తక్కువ సినిమాల్లో ఇది ఒకటి. పలు యాక్షన్‌ సన్నివేశాలను దృష్టిలో పెట్టుకుని ‘యూ’ సర్టిఫికేషన్‌కు బదులు యూ/ఏ దక్కింది. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని