కథానాయకులు కర్షకులైతే..!

‘రైతే రాజు’ ఇది తరచూ వినిపించే మాట. నిజజీవితంలో రైతు పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. అయితే.. సినిమా ఇండస్ట్రీకి మాత్రం రైతే రాజు. ఎందుకో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. అవును.. రైతు సెంటిమెంట్‌తో వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

Updated : 25 Mar 2021 09:06 IST

వ్యవసాయం కథాంశంతో వచ్చి ఆకట్టుకున్న సినిమాలివే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘రైతే రాజు’ ఇది తరచూ వినిపించే మాట. నిజ జీవితంలో రైతు పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. అయితే.. సినిమా ఇండస్ట్రీకి మాత్రం రైతే రాజు. ఎందుకో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. అవును.. రైతు సెంటిమెంట్‌తో వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అన్నివర్గాల ప్రేక్షకుల గుండెల్ని మెలిపెట్టే సెంటిమెంట్‌ ఏరియా ఏది? అంటే అది దేశానికి అన్నం పెట్టే రైతే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సెంటిమెంట్‌తో వచ్చిన సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. మరి అలా వచ్చి ఇలా హిట్టు కొట్టిన సినిమాల్లో కొన్ని మీకోసం..!

సంకల్పానికి ‘శ్రీకారం’

వ్యవసాయం నేపథ్యంలో ఏడాదికి ఒక సినిమా వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు. దానికి ‘శ్రీకారం’ ఒక మంచి ఉదాహరణ. కాన్సెప్ట్‌ పాతదే అయినా.. డైరెక్టర్‌ కిషోర్‌ తీర్చిదిద్దిన విధానం బాగుంది. శర్వానంద్‌ నటన దానికి మరింత బలాన్ని ఇచ్చింది. ‘ఒక హీరో తన కొడుకును హీరోను చేస్తున్నాడు.. డాక్టర్‌ తన కొడుకును డాక్టర్‌ చేస్తున్నాడు.. ఒక ఇంజినీర్ తన కొడుకును ఇంజినీర్‌ చేస్తున్నాడు.. కానీ.. ఒక రైతు మాత్రం తన కొడుకును రైతును చేయడం లేదు..’ అంటూ హృదయాలను కదిలించే డైలాగ్స్‌ ఎన్నో ఉన్నాయి. లక్షలు తెచ్చిపెట్టే ఉద్యోగం వదులకొని హఠాత్తుగా సొంతూరికి వచ్చేస్తాడు హీరో.. ఈ క్రమంలో వాళ్ల ఊరిలో వ్యవసాయం మానేసి పనుల కోసం పట్నం వెళ్లిన వాళ్లందరినీ సొంతూరికి తీసుకొచ్చే ప్రయత్నం.. మధ్యలో కరోనా దెబ్బ.. ఇలా ఆసక్తికరమైన మలుపులతో సినిమా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది.

సేంద్రీయ ’భీష్మ’

వ్యవసాయం అనే కాన్సెప్ట్‌ తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త కాదు. అందులో కొత్త కోణంతో తెరకెక్కించిన సినిమా ‘భీష్మ’. సేంద్రీయ వ్యవ‌సాయం అనే నేప‌థ్యం మినహా క‌థ సాధార‌ణ‌మైందే. 2020లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అవసరమైన చోట మంచి హాస్యాన్ని జోడించి.. ప్రేక్షకులను సీట్లో కూర్చోబెట్టడానికి ఏం చేయాలో అదే చేశాడు డైరెక్టర్‌ వెంకీ కుడుముల. వేల కోట్ల విలువ చేసే భీష్మ ఆర్గానిక్స్ కంపెనీకి ఒక డిగ్రీ కూడా ఉత్తీర్ణుడు కానీ యువకుడు సీఈవోగా ఎంపికవుతాడు. మరోవైపు ఫీల్డ్ సైన్స్ గ్రూప్ ఓనర్ అయిన రాఘవన్ మాత్రం ఆరోగ్యం దెబ్బ తీసే పురుగు మందులు కనిపెట్టి వాటితో ఎక్కువ దిగుబడి సాధించి బిజినెస్‌లో భీష్మ ఆర్గానిక్స్‌ను దాటాలని చూస్తుంటాడు. ఈ క్రమంలో రైతులకు ఎంతగానో ఉపయోగపడే ‘భీష్మ’ సంస్థను హీరో ఎలా రక్షిస్తాడన్నదే కథ.

వీకెండ్‌ వ్యవసాయంతో ‘మహర్షి’

సిటీలో ఉద్యోగం చేసే యువతకు వ్యవసాయంపై ఒక దృక్పథాన్ని కలిగించిన చిత్రం ‘మహర్షి’. మహేశ్‌బాబు ప్రధానపాత్రలో ఈ సినిమాను వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. ‘భూమి విలువ పెరిగిపోతోంది.. రైతుల విలువ తగ్గిపోతోంది..’ అంటూ 2019లో వచ్చిన ఈ చిత్రం ఉద్యోగులంతా వీకెండ్‌లో అగ్రికల్చర్‌ చేస్తే బాగుంటుందని మంచి సందేశాన్ని ఇచ్చింది. సక్సెస్‌కి చిరునామా అయిన హీరో.. ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీ అయిన ఆరిజిన్‌కి సీఈఓ అవుతాడు. తన స్నేహితుడు రవి కోసం రామాపురం గ్రామానికి వస్తాడు. అక్కడి సమస్యలు తెలుసుకున్న వాటికి పరిష్కారం వ్యవసాయం చేయడమేనని తెలుసుకున్న హీరో ఏం చేశాడు? యువతను వ్యవసాయం వైపు ఎలా ఆకర్షించాడు? వీకెండ్‌ వ్యవసాయం చేసే ఆలోచన ఎలా పుట్టించాడన్నది కథ.

‘నీరునీరు’ అంటూ కన్నీళ్లు పెట్టించిన ‘ఖైదీ నంబర్‌ 150’

దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఈ చిత్రంతోనే మళ్లీ తెలుగు తెరపై రీఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. ‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌’ అనే ట్యాగ్ లైన్‌కు తగ్గట్టుగానే మంచి విజయం సాధించిందీ చిత్రం. తమిళ ప్రేక్షకులను అలరించిన ‘కత్తి’కి రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేశారు. ‘నీరునీరు’ అనే పాటకు కన్నీళ్లు పెట్టని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఓ గ్రామంలో రైతుల పొట్టకొట్టి ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయించుకున్న కార్పొరేట్‌ సంస్థతో హీరో చేసే పోరాటమే ఈ చిత్రం. ఈ సినిమాలోని డైలాగ్స్‌ రైతుల కష్టాలను ప్రతిబింబించేలా ఉంటాయి. చిరంజీవికి ఒక పరిపూర్ణమైన రీఎంట్రీ ఇచ్చిందీ చిత్రం.

అసలైన పల్లెటూరి రైతు ‘చినబాబు’

డాక్టర్, లాయర్, కలెక్టర్, ఇంజినీర్ ఇలా.. తమ వృత్తిని ఎలా గొప్పగా చెప్పుకుంటారో.. తాను రైతును అని గర్వంగా చెప్పుకొనే వ్యక్తిగా కార్తి నటించిన చిత్రం ‘చినబాబు’. అసలైన పల్లెటూరి వాతావరణంలో వచ్చిన చిత్రం ఇది. వ్యవసాయం ఎంతో ఇష్టపడే హీరోకు ఎదురయ్యే అవమానాలు.. అడ్డంకులు ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. ‘పుట్టించేవాడు దేవుడైతే.. పండించేవాడూ దేవుడే’ అని హీరో చెప్పే డైలాగ్స్‌ ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యాయి.

రికార్డుల ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా..?’

ప్రేమకథా చిత్రంగా వచ్చిన ఈ సినిమాలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో హీరో సిద్ధార్థ్‌ ఓ పెద్ద బిజినెస్‌మెన్‌ కుటుంబంలో పుట్టిన వ్యక్తి. తాను ప్రేమించిన అమ్మాయి కోసం అవన్నీ వదులుకొని ఒక గ్రామానికి వస్తాడు. తన ప్రేయసి కోసం ఓ సవాల్‌ను స్వీకరించి రైతుగా మారతాడు. చివరికి విజయం సాధించి తన ప్రేయసిని పెళ్లి చేసుకుంటాడు. ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన దేశంలో అత్యధిక భాషల్లోకి రీమేక్‌ అయిన తెలుగు సినిమాగా రికార్డు సృష్టించిందీ చిత్రం. 9 భాషల్లోకి ఈ సినిమాను రీమేక్‌ చేశారు.

ఇంకా కొన్ని..

రాజశేఖర్‌ హీరోగా 2003లో వచ్చిన ‘ఆయుధం’ కూడా వ్యవసాయానికి సంబంధించిందే. ఈ సినిమా రాజశేఖర్‌ కెరీర్‌లో ఓ మంచి మైలురాయిగా నిలిచింది. సూర్య కథానాయకుడిగా నటించిన ‘బందోబస్తు’లో కూడా మిడతల దండు వల్ల రైతులు పడే ఇబ్బందులను ప్రస్తావించారు. ‘రాముడొచ్చాడు’లో నాగార్జున వ్యవసాయం చేస్తారు.  ఇవన్నీ ఇలా ఉండగా.. డైరెక్టర్ కృష్ణవంశీ ఇటీవల ఓ సినిమా ప్రకటించారు. ‘అన్నం’ పేరుతో ఆ సినిమా తెరకెక్కించనున్నట్లు చెప్పారు. అయితే, ఎవరితో ఈ సినిమా తెరకెక్కిస్తారన్నది తెలియాల్సి ఉంది.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని