Bappi Lahiri: బప్పి లహిరి బంగారం వెనకున్న కథ ఇదే..!

‘డిస్కోకింగ్‌’గా పేరు తెచ్చుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు బప్పి లహిరికి బంగారు ఆభరణాలంటే ఎంతో ఇష్టం. బంగారాన్ని సెంటిమెంట్‌గా భావించేవారు. బంగారాన్ని కొనుగోలు చేయడానికి విశేషమైన రోజుగా...

Updated : 16 Feb 2022 15:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘డిస్కోకింగ్‌’గా పేరు తెచ్చుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు బప్పి లహిరికి బంగారు ఆభరణాలంటే ఎంతో ఇష్టం. బంగారాన్ని సెంటిమెంట్‌గా భావించేవారు. బంగారాన్ని కొనుగోలు చేయడానికి విశేషమైన రోజుగా చెప్పుకొనే ‘ధన త్రయోదశి’ నాడు.. క్రమం తప్పకుండా ఏదో ఒక ఆభరాన్ని కొనుగోలు చేసేవారు. దీంతో బప్పి లహిరి ‘గోల్డ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2014లో భాజపా తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో తన వద్ద 754 గ్రాముల బంగారం, 4.62 కిలోల వెండి, సతీమణి వద్ద 967 గ్రాముల బంగారం, 8.9 కేజీల వెండి ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. బుధవారం ఆయన కన్నుమూశారు. తన బంగారం వెనకున్న కథేంటో ఆయన గతంలో ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఆనాటి సంగతులు ఆయన మాటల్లోనే..

ఆయన ఆహార్యానికి అభిమానినై..

‘‘గోల్డ్‌ ఈజ్‌ మై గాడ్‌.. దీన్నే నేను ఎక్కువగా నమ్ముతుంటా. బంగారాన్ని నా అదృష్టంగా భావించడానికి కారణం లేకపోలేదు. సంగీత కుటుంబంలో పుట్టిన నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్‌పై ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. అమెరికన్‌ గాయకుడు, నటుడు ఎల్విస్ ప్రెస్లీ అంటే నాకు అమితమైన అభిమానం. ఆయన ఎక్కువగా గోల్డ్‌ చెయిన్స్‌ ధరిస్తుండేవాడు. చిన్నప్పటి నుంచి ఆయన ఆహార్యం నన్ను ఎంతో ఆకర్షించింది. కెరీర్‌లో గొప్ప పేరు తెచ్చుకున్నాక.. ఆయనలా బంగారు ఆభరణాలు ధరించాలని అనుకునేవాడిని. ‘జాక్మీ’ పాటలు రికార్డ్‌ చేసిన తరుణంలో మా అమ్మ.. దేవుడి పేరు లాకెట్‌తో ఉన్న ఓ గోల్డె చెయిన్‌ని బహుమతిగా అందించింది. ఆ ఆల్బమ్‌ సూపర్‌హిట్‌ అయ్యింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె మరో గోల్డ్‌ చెయిన్‌ ఇవ్వగా.. నాకు వివాహమైంది. అప్పటి నుంచి బంగారాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. నా సతీమణి సైతం.. అదే విషయాన్ని ఓ సారి చెప్పారు. అలా, ప్రతిసారీ నేను బంగారం కొనుగోలు చేసి ధరించడం అలవాటుగా మారింది’’

ఎవరూ గుర్తుపట్టలేరు..!

‘‘ఈ బంగారు ఆభరణాలను నేను ఎప్పుడూ ధరిస్తూనే ఉంటాను. పబ్లిక్‌లోకి వెళ్లినప్పుడూ ఇవి నా ఒంటిపైనే ఉంటాయి. ఒకవేళ బంగారం లేకుండా నేను బయటకు వెళితే సామాన్య ప్రజలు నన్ను గుర్తు పట్టలేరు’’

మర్చిపోలేని మాటలు..!

‘‘ప్రముఖ పాప్‌ సింగర్‌ మైఖేల్‌ జాక్సన్‌ 1996లో భారతదేశానికి వచ్చారు. అదే సమయంలో ఓసారి ముంబయిలో ఆయన నన్ను కలిశారు. నా మెడలో ఉన్న బంగారం చూసి ఆశ్చర్యపోయిన ఆయన వెంటనే నా వద్దకు వచ్చి.. ‘‘మీరు ధరించిన బంగారు ఆభరణాలు అద్భుతంగా ఉన్నాయి’’ అని నన్ను పలకరించారు. అయితే, నేను సంగీత దర్శకుడిననే విషయం అప్పటికి ఆయనకు తెలియదు. దాంతో ఆయన.. ‘‘ఇంతకీ మీ పేరు ఏమిటి?’’ అని అడిగారు. ‘‘నా పేరు బప్పి లహిరి’’ అని చెప్పగానే ‘‘మీరు సంగీత దర్శకుడు కదా. మీరు సంగీతం అందించిన ‘డిస్కో డ్యాన్సర్‌’లోని ‘జిమ్మి జిమ్మి’పాట నాకెంతో నచ్చింది’ అని మైఖేల్‌ తెలిపారు. ఆ మాటలు ఎప్పటికీ గుర్తుంటాయి’’

అవి అంటే ప్రత్యేకమైన ఇష్టం..!

‘‘నేను ధరించే బంగారు ఆభరణాల్లో కొన్ని అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. వాటిల్లో ఒకటి.. మా తల్లి మొదట ఇచ్చిన చెయిన్‌. మరొకటి గణపతి లాకెట్‌ ఉన్న గొలుసు‌. అవి నాకెప్పటికీ రక్షగా ఉంటాయని నమ్ముతుంటాను. నా భార్య ఓసారి ‘బి’ అక్షరంతో ఉన్న ఓ బంగారు గొలుసును పుట్టినరోజు బహుమతిగా నాకు అందించింది. మరోసారి ‘BAPP’ అనే పేరుతో బ్రేస్‌లెట్‌ చేయించుకున్నాను. వీటిని ప్రత్యేకంగా భావిస్తుంటాను’’ 

చివరి పోస్ట్‌లోనూ ‘గోల్డ్’‌..!

బప్పి లహిరి సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేవారు. 2014లో ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన ఆయన.. తన ఆల్బమ్స్‌, మ్యూజిక్‌ కాన్సర్ట్‌లకు సంబంధించిన అనేక ఫొటోలను తరచూ అభిమానులతో షేర్‌ చేసుకుంటారు. తన వ్యక్తిగత విశేషాలను సైతం ఇన్‌స్టాలో పంచుకుంటూ ఉండేవారు. ముఖ్యంగా తన బంగారు ఆభరణాల ఫొటోలను అందరితో షేర్‌ చేసుకుని.. బంగారంపై తనకున్న ప్రేమను బయటపెట్టేవారు. ఇదిలా ఉండగా మూడు రోజుల క్రితం ఆయన.. తన పాత ఫొటోని షేర్‌ చేశారు. దానికి ‘ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌’ అని క్యాప్షన్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. అది చూసిన ప్రతి ఒక్కరూ.. ‘RIP Gold Man’ అని కామెంట్లు పెడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని