LEO: విజయ్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌.. ఐదో ఆటకు గ్రీన్‌ సిగ్నల్‌.. కాకపోతే చిన్న కండీషన్‌..!

విజయ్‌ (Vijay) అభిమానులు ఆనందించే వార్త ఒకటి వైరల్‌గా మారింది. ఆయన నటించిన సరికొత్త సినిమా బెనిఫిట్‌ షోకు ప్రభుత్వం అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. 

Published : 11 Oct 2023 17:19 IST

చెన్నై: విజయ్‌ (Vijay) అభిమానులకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆయన హీరోగా నటించిన ‘లియో’ (LEO) స్పెషల్‌ షోస్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దాదాపు వారం రోజులపాటు ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

‘మాస్టర్‌’ (Master) తర్వాత విజయ్‌ (Vijay) - లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లియో’. త్రిష, సంజయ్‌ దత్‌, అర్జున్‌ సర్జా వంటి భారీ తారాగణంతో మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఇది సిద్ధమైంది. దసరా సెలబ్రేషన్స్‌లో భాగంగా అక్టోబర్‌ 19న ఇది విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ‘లియో’ స్పెషల్‌ షోస్‌కు అనుమతి ఇవ్వాలంటూ గత నెలాఖరులో చిత్ర నిర్మాణ సంస్థ సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ ప్రభుత్వాన్ని కోరింది. వీరి విన్నపాన్ని పరిశీలించిన ప్రభుత్వం ఐదో ఆటకు అనుమతి ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్‌ 19 తేదీ నుంచి అక్టోబర్‌ 24వ తేదీవరకూ ఐదో షోకు ఓకే చెప్పింది. అయితే.. సినిమా ప్రదర్శన మాత్రం ఉదయం తొమ్మిది గంటల నుంచి మాత్రమే ప్రారంభం కావాలని పేర్కొంది. తెల్లవారుజామున 4 గంటల షోకు నిరాకరించింది. ఐదో ఆటకు గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అప్పటి నుంచి క్యాన్సిల్‌..!

రజనీకాంత్‌, విజయ్‌, అజిత్‌.. వంటి స్టార్‌ హీరో సినిమాలు విడుదలైనప్పుడు బెనిఫిట్‌ షోలు ప్రదర్శించడం తమిళనాడులోనూ ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘తునివు’, ‘వారిసు’ చిత్రాలకు బెనిఫిట్‌ షోలు ప్రదర్శించారు. అయితే, థియేటర్ల వద్ద రద్దీ.. పలువురు మధ్య వాగ్వాదంతో ప్రమాదవశాత్తు ఓ అభిమాని మృతి చెందాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం ఆనాటి నుంచి బెనిఫిట్‌ షోలు రద్దు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని