Ramayanam: ‘సంపూర్ణ రామాయణం’ TO ‘ఆదిపురుష్‌’.. ఏయే అంశాలను టచ్‌ చేశారంటే?

రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన చిత్రాలు.. అందులో ఏయే ఇతివృత్తాలను తీసుకుని సినిమాలను తెరకెక్కించారో చదివేయండి.

Published : 15 Jun 2023 11:06 IST

వాల్మీకి రచించిన ఇతిహాసగాథ రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పటికే పలు చిత్రాలు తెరకెక్కి అఖండ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడిదే బాటలో రామాయణం గొప్పతనాన్ని చాటి చెబుతూ ఈతరం వారికి ఆ రాముడి గాథను చేరువ చేసేందుకు రూపుదిద్దుకున్న సరికొత్త చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). ఓంరౌత్‌ (Om Raut) దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ తెలుగు తెరపై వచ్చిన ‘రామాయణ’ చిత్రాలు.. అందులో ఏయే అంశాలను దర్శకులు ప్రధానంగా చూపించారు..? అనే ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం.

సంపూర్ణ రామాయణం..!

మొదటిసారి సంపూర్ణ రామాయణాన్ని వెండితెరపై చూపించారు దర్శకుడు కె.సోము. ‘సంపూర్ణ రామాయణం’ (Sampoorna Ramayanam)గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ఎన్‌.టి.రామారావు (NTR) రాముడి పాత్రలో.. పద్మిణీ జానకిగా కనిపించి.. అందరి మన్ననలు అందుకున్నారు. వాల్మీకి రచించిన రామాయణంలోని బాలకాండ, అయోధ్య కాండ, అరణ్య కాండ, కిష్కింద కాండ, సుందర కాండ, యుద్ధ కాండలను ఇందులో సంక్షిప్తంగా చూపించారు. రామ జననం నుంచి పట్టాభిషేకం వరకూ అన్ని ప్రధాన ఘట్టాలతో ఈ సినిమా సిద్ధమైంది. 1958లో విడుదలైన ఈ సినిమా 200 రోజులకు పైగా థియేటర్లలో ఆడింది. ఇదే చిత్రాన్ని ‘రామాయణ్‌’ అనే పేరుతో హిందీలో విడుదల చేశారు. ఇక, ఈ సినిమా నిడివి 3 గంటల 24 నిమిషాలు.


సీతారామ కల్యాణం..!

సీతాదేవి - శ్రీరాముడి పరిణయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రం ‘సీతారామ కల్యాణం’ (Seeta Rama Kalyanam). ఎన్టీఆర్‌ (NTR) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గీతాంజలి, హరనాథ్‌... జానకి రాములుగా కనిపించారు. రావణాసురుడిగా ఎన్టీఆర్‌ కనిపించి.. తన నటనతో మెప్పించారు. సీతారాముల జననం.. వాళ్ల పరిణయం.. వంటి ఘట్టాలను ఈ సినిమాలో చూపించారు. ముఖ్యంగా ‘శ్రీ సీతారాముల కల్యాణం చూద్దం రారండి’ అంటూ వచ్చే పాట అజరామరం. 1961లో విడుదల ఈ సినిమా 8వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌గా మెరిట్‌ సర్టిఫికేట్‌ అందుకుంది. ఇదే చిత్రాన్ని తమిళంలోనూ డబ్‌ చేశారు.


లవకుశ..!

శ్రీరామ పట్టాభిషేకం తర్వాత వచ్చే ఉత్తరకాండ అందరితో కన్నీళ్లు పెట్టిస్తుంది. గర్భవతిగా ఉన్న సీతమ్మను శ్రీరాముడు అడవులకు పంపించడం.. ఆమె లవకుశలకు జన్మ నివ్వడం.. తదితర విషయాలతో సాగుతుంది. సీతమ్మ ఆనాడు పడిన కష్టాలను వెండితెరపై చూపించిన మొదటి తెలుగు చిత్రం ‘లవకుశ’ (Lavakusa). సి.పుల్లయ్య, సి.ఎస్‌.రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌ (NTR) - అంజలీదేవి ప్రధాన పాత్రలు పోషించారు. 1958లోనే ఈ సినిమా మొదలైనప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో కొన్నేళ్లపాటు ఆగిపోయింది. 1963లో విడుదలైంది. తెలుగులో వచ్చిన మొట్టమొదటి ఫుల్‌ లెంగ్త్‌ కలర్‌ సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఘంటసాల, కె.వి.మహదేవన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌గా వ్యవహరించిన ఈ సినిమాలో సుమారు 27 పాటలు ఉన్నాయి. ‘బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ ఇన్‌ తెలుగు’గా ఈ సినిమా నేషనల్‌ అవార్డు దక్కించుకుంది.


సంపూర్ణ రామాయణం..!

శోభన్‌బాబు (Sobhan Babu), చంద్రకళ ప్రధాన పాత్రధారులుగా బాపు తెరకెక్కించిన చిత్రం ‘సంపూర్ణ రామాయణము’ (Sampoorna Ramayanam). వాల్మీకి రచించిన రామాయణాన్ని ఆధారంగా చేసుకుని దీన్ని రూపొందించారు. ఉత్తరకాండను మినహాయించి.. మిగిలిన ఆరు కాండలను ఈ సినిమాలో ఎంతో రసరమ్యంగా చూపించారు. 1972లో విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోని పది థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది.


సీతా కల్యాణం..!

సీతారాముల పరిణయాన్ని వెండితెర వేదికగా చూపించిన చిత్రం ‘సీతాకల్యాణం’ (Seeta Kalyanam). బాపు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవికుమార్‌, జయప్రద (Jaya Pradha) ప్రధాన పాత్రలు పోషించారు. 1976లో విడుదలైన ఈ చిత్రం ‘సీతా స్వయంవర్‌’, ‘సీతా స్వయంవరం’ పేర్లతో హిందీ, కన్నడలో విడుదలైంది.


శ్రీరామ పట్టాభిషేకం..!

ఎన్టీఆర్‌ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘శ్రీరామ పట్టాభిషేకం’ (Sri Rama Pattabhishekam). ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌ (NTR).. రాముడు, రావణాసురుడి పాత్రల్లో నటించారు. సీతగా సంగీత కనిపించారు. రామాయణంలోని అయోధ్య కాండ, అరణ్య కాండ, కిష్కింధ కాండ, సుందర కాండ, యుద్ధ కాండలను ఈ సినిమాలో చూపించారు. బాలకాండ, ఉత్తర కాండలను ఇందులో టచ్‌ చేయలేదు. 1978లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.


బాల రామాయణం..!

రామాయణం నేపథ్యంతో ఎన్ని సినిమాలొచ్చినా గుణశేఖర్‌ తెరకెక్కించిన ‘బాల రామాయణం’ (Bala Ramayanam) ఎప్పటికీ ప్రత్యేకమే. పూర్తిస్థాయిలో బాల నటులతో తెరకెక్కించడమే ఇందుకు కారణం. జూనియర్‌ ఎన్టీఆర్‌ (NTR).. బాల రాముడిగా నటించిన ఈ సినిమా 1997లో విడుదలైంది. అప్పటి ప్రేక్షకులను ఇది ఎంతగానో అలరించింది. జాతీయ స్థాయిలో ఉత్తమ బాలల చిత్రంగా నిలిచింది. సీతగా స్మితమాధవ్‌, రావణుడిగా స్వాతికుమార్‌, లక్ష్మణుడిగా నారాయణమ్‌ నిఖిల్‌ కీలక పాత్రల్లో కనిపించారు. మాధవపెద్ది సురేశ్‌, వైద్యనాథన్‌ సంగీతం అందించారు. ఇందులో గుణశేఖర్‌.. సీతారాముల కథను పూర్తిగా చూపించారు. సీతారాముల జననం, వివాహం, వనవాసం, రావణాసురుడితో పోరాటం, పట్టాభిషేకం.. ఇలా అన్ని ప్రముఖ ఘట్టాలను ఈ సినిమాలో చూడొచ్చు.


శ్రీరామ రాజ్యం..!

1963లో విడుదలైన ‘లవకుశ’ చిత్రాన్ని బేస్‌ చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘శ్రీరామరాజ్యం’ (Sri Rama Rajyam). బాపు-రమణ ద్వయం దీన్ని తెరకెక్కించారు. పట్టాభిషేకం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను ఇందులో చూపించారు. బాలకృష్ణ, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2011లో విడుదలైంది. నంది, ఫిలింఫేర్‌, సైమా అవార్డులను ఇది సొంతం చేసుకుంది.


ఆదిపురుష్‌..!

భారతీయ సినిమా విశ్వమంతటా ఆదరణ పొందుకున్న వేళ.. ప్రపంచ దేశాలకు రామాయణ గొప్పతనాన్ని చాటి చెప్పాలనే ఉద్దేశంతో తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). ఓంరౌత్‌ దర్శకుడు. రాఘవుడిగా ప్రభాస్‌ (Prabhas), జానకీ మాతగా కృతిసనన్‌ (Kriti Sanon) నటించారు. ఇందులో కేవలం అరణ్య, యుద్ధ కాండలను చూపించనున్నారు. సుందరకాండను అక్కడక్కడా సంక్షిప్తంగా చూపించినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు అంతటా మంచి టాక్‌ అందుకున్నాయి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు ఇది రానుంది. ఇక, ఈ సినిమా నిడివి సుమారు 3 గంటలు.

ఇవి మాత్రమే కాకుండా ‘సీతా రామ జననం’, ‘పాదుకా పట్టాభిషేకం’ వంటి ఎన్నో చిత్రాలు శ్రీరాముడి కథను వెండితెర వేదికగా ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమాలన్నీ ప్రేక్షకుల మన్ననలు అందుకున్నవే. అలాగే, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. మరి, ఆ రాముడి కథతో రానున్న ‘ఆదిపురుష్‌’ ఎలా ఉండనుందో మరి కొన్ని గంటల్లో వెండితెర వేదికగా చూడాలి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని