
Nani: ప్రొడక్షన్ మేనేజర్.. నన్ను చూసి పక్క నుంచి వెళ్లిపోయాడు: నాని
హైదరాబాద్: పవర్ఫుల్ కథాంశంతో తెరకెక్కిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శ్యామ్ సింగరాయ్’(shyam singha roy). రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని(Nani),సాయిపల్లవి, కృతిశెట్టి కీలకపాత్రలు పోషించారు. మరో కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్రబృందం ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికర విశేషాలు పంచుకుంది. ఆ విశేషాలు మీకోసం..
సినిమా విషయంలో మీరు చాలా నమ్మకంగా ఉన్నట్టు ఉన్నారు. అందుకు కారణమేమిటి?
నాని: ఏదైనా కథ నచ్చితేనే మనం సినిమా ఓకే చేస్తాం. అలాగే ‘శ్యామ్ సింగరాయ్’ కథ నా వద్దకు వచ్చినప్పుడు తప్పకుండా ఇది చేయాలి అని ఫిక్స్ అయిపోయాను. సినిమా చేస్తునన్ని రోజులు ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారనిపించింది. సినిమా ఫైనల్ కాపీ చూశాక నా నమ్మకం మరింత పెరిగింది. సినిమా అద్భుతంగా వచ్చింది. సినిమా రిలీజ్ కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని నమ్ముతున్నారా?
నాని: తెలుగు ప్రేక్షకులు సినిమాని ఎంతలా ఆదరిస్తారో ‘అఖండ’, ‘లవ్‌స్టోరీ’ వంటి ఎన్నో చిత్రాలు ఇప్పటికే నిరూపించాయి. మరోసారి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా బాగుంటే తప్పకుండా వాళ్లు హిట్ ఇస్తారు.
ఈ సినిమాలో మీరు బెంగాలీ అమ్మాయిగా నటించారు కదా లుక్ విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా?
సాయిపల్లవి: ఈ సినిమా కోసం సుమారు ఐదారు లుక్ టెస్ట్‌లు చేశారు. చివరికి ఇప్పుడు మీరు చూస్తున్న లుక్స్‌ని ఓకే చేశారు. నేను ఇందులో కొత్తగా కనిపించానంటే ఆ క్రెడిట్ మొత్తం దర్శకుడు రాహుల్‌దే.
నాని-సాయిపల్లవి.. ‘ఎంసీఏ’ తర్వాత ఇద్దరూ కలిసి ఈ సినిమా కోసం చేయడం ఎలా ఉంది?
నాని: ‘ఎంసీఏ’తో సాయిపల్లవి నాకు మంచి స్నేహితురాలైంది. సాయిపల్లవి మా ఇంట్లో మనిషిలా.. కలివిడిగా ఉంటుంది. షూటింగ్ బ్రేక్స్ సమయంలో మా తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడుకునే వాళ్లం. కథ అనుకున్నప్పుడు.. మైథిలీ పాత్రకి సాయిపల్లవినే న్యాయం చేయగలదని అందరికీ అనిపించింది. ఆమె తప్పకుండా ఇది ఒప్పుకుంటుందని నా నమ్మకం. రెండురోజుల తర్వాత దర్శకుడు రాహుల్ ఫోన్ చేసి సాయిపల్లవి ప్రాజెక్ట్ ఓకే చేసిందని చెప్పారు. అది విన్నప్పుడు నేనేమీ ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ముందే ఊహించాను తను ఈ ప్రాజెక్ట్ చేస్తుందని. ఈ షూట్ ఎంతో సరదాగా సాగింది.
ఇంతకీ ఇది ఏ జోనర్ సినిమా?
నాని: పీరియాడికల్, సూపర్ నేచురల్ థ్రిల్లర్ అని చెప్పుకొవచ్చు.
కీర్తి పాత్ర కోసం కృతిశెట్టిని ఎలా ఎంపిక చేశారు?
నాని: కీర్తి పాత్రకు ఎవర్ని తీసుకోవాలి? అనే దానిపై చర్చించుకున్నాం. కీర్తి చాలా విభిన్నమైన రోల్. కాబట్టి కొత్త నటిని తీసుకోవాలనుకున్నాం. అదే సమయంలో ‘ఉప్పెన’ పోస్టర్లు మాత్రమే విడుదలయ్యాయి. అందులో కృతి చాలా అమాయకురాలిగా కనిపించారు. ఈమె సరిపోతుందని భావించి వెంటనే సంప్రదించాం.
కృతిశెట్టి: ‘ఉప్పెన’ విడుదలవ్వక ముందే నాకు రెండో సినిమా ఆఫర్ రావడం ఆనందంగా అనిపించింది. అందులోనూ నానితో సినిమా అనగానే నా ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి.
కథ విన్నప్పుడు మీ మొదటి ఫీలింగ్ ఏమిటి?
నాని: సత్యదేవ్ కథ రాసుకుని రాహుల్‌కి చెప్పారు. రాహుల్ ఆ కథను సినిమా స్క్రిప్ట్లా రీక్రియేట్ చేసి.. నా వద్దకు వచ్చి చెప్పాడు. కథ వింటున్న సమయంలో తర్వాత ఏంటి? అని అడుగుతూనే ఉన్నా.
సాయిపల్లవి మంచి డ్యాన్సర్ కదా. సినిమాలోకి ఆమెను తీసుకున్నాక.. ఆ పాత్రలో ఏమైనా మార్పులు చేశారా?
నాని: పల్లవి.. మంచి పెర్ఫార్మెర్. బెంగాలీ అమ్మాయి పాత్రకు తను నప్పుతుందని భావించాం. అందులోనూ ఆమెకు డ్యాన్స్ కూడా బాగా రావడం మాకు ఇంకొంత ప్లస్ అయ్యింది. పాత్రలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ముందు ఏదైతే అనుకున్నామో అదే తెరకెక్కించాం.
దేవదాసి పాత్రలో నటించడం ఎలా ఉంది?
సాయిపల్లవి: దేవదాసి పాత్రపై ఏమైనా బయోపిక్‌లు వస్తే బాగుండు అని నా స్నేహితురాలితో ఓసారి అన్నాను. అలా అన్న రెండు వారాల తర్వాత నా వద్దకు శ్యామ్ సింగరాయ్ కథ వచ్చింది. కథ చదువుతున్నప్పుడు చేయాలనే భావన కలిగింది. ఓకే చేసేశాను.
శ్యామ్ సింగరాయ్ లుక్ విషయంలో జరిగిన ఏదైనా ఆసక్తికర సంఘటన చెప్పండి!
నాని: శ్యామ్ లుక్ ఇలా ఉంటే బాగుంటుందని నా మైండ్‌లో ఓ లుక్ ఉంది. అలా ఓరోజు ఈ సినిమా షూట్లో పాల్గొని మధ్యాహ్నం 12 గంటల వరకూ వాసు పాత్రకు సంబంధించిన షెడ్యూల్ పూర్తి చేశాను. వెంటనే క్యారవ్యాన్ లోకి వెళ్లి గడ్డం తిసేసి.. బెంగాలీ యువకుడిగా రెడీ అయి గంట తర్వాత బయటకు వచ్చాను. సెట్లో ఎవరికీ ఈ విషయం తెలీదు. నేను బయటకు వచ్చిన వెంటనే మా ప్రొడక్షన్ మేనేజర్ నన్ను చూసి పక్క నుంచి అలా వెళ్లిపోయారు. నేను మాట్లాడిస్తే.. ‘‘సర్.. మీరా. అస్సలు గుర్తు పట్టలేదు. మీరు పర్ఫెక్ట్గా సరిపోయారు’’ అని అన్నారు. అదే గెటప్‌లో ఫొటో దిగి మా అక్కకి పంపితే ఆమె ప్రశంసల వర్షం కురిపించింది.
నానితో షూట్ చేయడం ఎలా ఉంది?
కృతిశెట్టి: నాకు, నా ఫ్యామిలీకి నాని అంటే అభిమానం. ‘ఉప్పెన’ షూట్ చేస్తున్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూడటం ప్రారంభించాను. సినిమాలు చూస్తూ తెలుగు నేర్చుకుంటున్నా. షూట్ సమయంలో నాని నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను.
కోల్కత్తా బ్యాక్‌డ్రాప్ కోసం రూ.6.5 కోట్లు పెట్టి సెట్ వేశారా?
నాని: మా ఆర్ట్ డైరెక్టర్‌కే క్రెడిట్ దక్కుతుంది. ఆయన చాలా అద్భుతంగా సెట్ డిజైన్ చేశారు. రూ.6.5 కోట్ల భారీ సెట్ వేశాం. కొవిడ్, వరదల వల్ల సెట్ దెబ్బతినడంతో మరోసారి సెట్ రీబిల్డ్ చేశాం.
సినిమాలో బెంగాలీ డైలాగ్‌లు ఎక్కువగా ఉంటాయా?
నాని: మెయిన్ డైలాగ్‌లు అన్నీ తెలుగులోనే. అక్కడక్కడా బెంగాలీవి వస్తుంటాయి.