
Samantha: నా ఆశలన్నీ శిథిలమైపోయాయి: సమంత
కాలం నాకోసం ఏది రాసిపెడితే.. దాన్ని ధైర్యంగా స్వీకరిస్తా
హైదరాబాద్: వ్యక్తిగత జీవితంలో తగిలిన ఎదురుదెబ్బలతో 2021 తనకెంతో క్లిష్టంగా గడిచిందని నటి సమంత అన్నారు. భవిష్యత్తుపై ఎలాంటి ఆశల్లేవని తెలిపారు. ఇటీవల ఆమె ఓ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. బాలీవుడ్ నటీనటులు విక్కీ కౌశల్, తాప్సీ పాల్గొన్న ఈ సెలబ్రిటీ చిట్‌చాట్‌లో సమంత.. విడాకులు, ఆ తర్వాత నెట్టింట్లో జరిగిన ట్రోలింగ్‌పై స్పందించారు.
‘‘ఎన్నో ఏళ్లు కష్టపడి నా కెరీర్‌ను నిర్మించుకున్నాను. 2021లో వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న ఇబ్బందుల కారణంగా నా కలలన్నీ శిథిలమైపోయాయి. నేనెంతో కుంగుబాటుకు లోనయ్యాను. ఇక, సోషల్‌మీడియా గురించి చెప్పాలంటే.. నటీనటుల్ని తమ అభిమానులకు చేరువ చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతోంది. కొంతమంది నెటిజన్ల నుంచి ప్రేమాభిమానాలు పొందుతున్నాను. ప్రస్తుతం వాళ్లు నా జీవితంలో భాగమైపోయారు. కానీ.. మరికొంత మంది మాత్రం.. ట్రోల్ చేస్తున్నారు.. అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారు. వారందర్నీ నేను కోరేది ఒక్కటే.. నేను చేసే ప్రతిదాన్ని అంగీకరించాలని డిమాండ్ చేయను. కానీ, మీకు నా అభిప్రాయాలు నచ్చకపోతే దాన్ని చెప్పడానికి ఓ విధానం ఉంటుంది’’ అని సామ్ తెలిపారు.
అనంతరం 2022 ప్లాన్స్‌పై ఆమె స్పందించారు. ‘‘ఈ ఏడాదిలో నా కలలన్నీ చెదిరిపోయాయి. అందుకే వచ్చే ఏడాదిపై ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు. కాలం నాకోసం ఏది రాసిపెడితే దాన్ని ధైర్యంగా స్వీకరిస్తాను’’ అని ఆమె వివరించారు.