Published : 03 Dec 2021 01:36 IST

Akhanda: బోయపాటి- బాలకృష్ణ.. ఒకటికి మించి మరొకటి ‘అఖండ’ విజయం

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2021 డిసెంబరు 2.. థియేటర్లు పూర్వ వైభవం సంతరించుకున్న రోజు. తెలుగు సినిమా ప్రియులు మర్చిపోలేని రోజు. బాలకృష్ణ అభిమానుల ఆనందం అంబరాన్ని తాకిన రోజు. బోయపాటి శ్రీను- బాలకృష్ణ కాంబినేషన్‌కు తిరుగులేదని మరోసారి నిరూపితమైన రోజు. ఇది ‘అఖండ’మైన రోజు.

ఓ వైపు కరోనా భయం.. మరోవైపు ఓటీటీల వినియోగం కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం తగ్గించారు. అలాంటి పరిస్థితుల్లో కొందరి ప్రముఖ హీరోల చిత్రాలు కాస్త ఊరటనిచ్చాయి. కొవిడ్‌ ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌ తర్వాత విడుదలైన కొన్ని సినిమాలు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించగలిగాయి. ఆ ధైర్యంతోనే కథాబలం ఉన్న చిన్న చిత్రాలూ సినిమా హాళ్లలోనే సందడి చేశాయి. ‘ఇలాంటి సమయంలో ఒక అగ్ర హీరో చిత్రం విడుదలైతే మరింత జోష్‌ వస్తుంది. మిగతా చిత్రాల విడుదలా సుగమం అవుతుంది’ అని అటు చిత్ర పరిశ్రమ, ఇటు థియేటర్ల యాజమాన్యాలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాయి. దానికి ‘అఖండ’ చిత్రం నాంది పలికింది. ప్రముఖ నటుడు బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి తెరకెక్కించిన చిత్రమిది. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక. రవీందర్‌ రెడ్డి నిర్మించారు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏ, బీ, సీ..ఇలా సెంటర్‌ ఏదైనా, ఆంధ్రా, సీడెడ్‌, నైజాం... ఏరియా ఏదైనా ప్రభంజనం సృష్టిస్తోంది. థియేటర్లకు కొత్త వెలుగును తీసుకొచ్చింది. అయితే, బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌కు ఇది కొత్తేం కాదు. గతంలోనూ ఈ కాంబో రెండుసార్లు రికార్డు సృష్టించింది.

సింహా గర్జన..

బోయపాటి శ్రీను ‘భద్ర’, ‘తులసి’ చిత్రాలతో మాస్‌ దర్శకుడిగా మంచి గుర్తింపు పొందారు. 2009లో బాలకృష్ణ హీరోగా తన మూడో సినిమా ‘సింహా’ని ప్రకటించారు. ఆ సమయానికి ఈ ఇద్దరి కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది కానీ అంతగా అంచనాలు లేవు! పోస్టర్లు, పాటలు మెల్లమెల్లగా సినిమాపై చర్చించుకునేలా చేశాయి. 2010 ఏప్రిల్‌ 30న సినిమా విడుదలై కనీవినీ ఎరుగని రికార్డులు సృష్టించింది. ‘బాలకృష్ణని ఎలా చూపించాలో, ఆయన స్టామినా ఏంటో బోయపాటి శ్రీనుకి బాగా తెలుసు’ అని అందరితోనూ అనిపించేలా చేసింది. ఈ సినిమాలో శ్రీమన్నారాయణగా, డా. నరసింహగా బాలకృష్ణ అభినయం అద్వితీయం. ఈ చిత్రం 338 కేంద్రాల్లో 50 రోజులు, 92 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమైంది.

తిరుగులేని లెజెండ్‌

‘సింహా’ ఊహించని సంచలనం సృష్టించటంతో ఈ కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా ‘లెజెండ్‌’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాల్ని అందుకుంటూ 2014 మార్చి 28న బాలకృష్ణ  ‘లెజెండ్‌’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జయదేవ్‌ (లెజెండ్‌), కృష్ణ పాత్రల్లో కనిపించి విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ సినిమా 31 కేంద్రాల్లో 100 రోజులు, 2 కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శితమైంది. ఓ థియేటర్‌లో 1000 రోజులు ప్రదర్శితమైన చిత్రంగా సరికొత్త రికార్డు నెలకొల్పింది.

అఖండతో హ్యాట్రిక్‌

రెండు సినిమాలు సూపర్‌హిట్ అందుకుంటే మూడో చిత్రంపై నెలకొనే అంచనాలు అన్నీ ఇన్నీ కాదు. ప్రేక్షకులు ఆశించే ఔట్‌పుట్‌ ఇచ్చేందుకు దర్శకుడు, నటుడూ ఎంతో కసరత్తు చేయాలి. అలా బోయపాటి శ్రీను, బాలకృష్ణ పడిన కష్టమే ఇప్పుడు థియేటర్లలో హంగామా చేస్తున్న ‘అఖండ’ చిత్రం. ఈ సినిమాలోనూ బాలకృష్ణ రెండు విభిన్న పాత్రలు పోషించారు. మురళీకృష్ణగా, శివుడుగా నటనలో విజృంభించారు. సగటు సినీ ప్రేక్షకుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరి మన్ననలు పొందుతున్నారు.

మూడు చిత్రాల్లోనూ..

ఈ మూడు చిత్రాల్లోనూ బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. ప్రతి సినిమాలోనూ విలన్‌ పాత్రలు చాలా కీలకంగా నిలిచాయి. బాలకృష్ణ చెప్పిన సంభాషణలు అద్భుతమనిపించాయి.

Read latest Cinema News and Telugu News
Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని