Narappa: వివాదంపై సురేశ్‌బాబు స్పష్టత

అగ్రకథానాయకుడు వెంకటేశ్‌ నటించిన ‘నారప్ప’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడంపై గత కొన్నిరోజుల నుంచి వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. సినిమాలన్నీ ఓటీటీ బాటపట్టడంతో దాన్నే నమ్ముకుని జీవిస్తున్న ఎంతోమంది ఎగ్జిబిటర్లు....

Published : 18 Jul 2021 01:29 IST

ప్రజల్ని థియేటర్లకు రమ్మనడం ఎంతవరకూ న్యాయం?

హైదరాబాద్‌: అగ్రకథానాయకుడు వెంకటేశ్‌ నటించిన ‘నారప్ప’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడంపై గత కొన్నిరోజుల నుంచి వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. సినిమాలన్నీ ఓటీటీ బాటపట్టడంతో దాన్నే నమ్ముకుని జీవిస్తున్న ఎంతోమంది ఎగ్జిబిటర్లు, థియేటర్‌ యజమానులు నష్టపోతున్నారని.. భవిష్యత్తులో థియేటర్లు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని సినీ ఎగ్జిబిటర్లు ఎంతో కాలం నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే విడుదల విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ ‘నారప్ప’ ఓటీటీలోనే వస్తుందని చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. దీంతో సినీ ఎగ్జిబిటర్లు కొంతమంది సురేశ్‌బాబుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘నారప్ప’ విడుదల విషయంలో నెలకొన్న వివాదంపై తాజాగా సురేశ్‌ బాబు స్పందించారు.

‘సొంత బ్యానర్‌ సురేశ్‌ ప్రొడెక్షన్‌లో నిర్మించే సినిమాలు నా నిర్ణయం మేరకే విడుదలవుతాయి. కానీ, ‘నారప్ప’ సినిమా నిర్మాణంలో మేము కేవలం భాగస్వాములం మాత్రమే. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకునే నిర్మాత ఎస్‌.థామస్‌ ఈ చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రేక్షకులకు చేరువ చేయాలని నిర్ణయించుకున్నారు. కరోనా మూడో వేవ్‌ దృష్ట్యా ఎవరూ నష్టపోకూడదనే ఈ నిర్ణయాన్ని స్వాగతించాం. ఎగ్జిబిటర్లకు నాపై అసంతృప్తి ఉండటంలో న్యాయం ఉంది. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన కుటుంబసభ్యుల్నే థియేటర్‌కు పంపించడం లేదు. అలాంటిది ప్రేక్షకుల్ని థియేటర్లకు రమ్మని అడగడం న్యాయమా? తన సినిమాని ఎలాగైనా ప్రజలకు చేరువ చేసేందుకు నిర్మాత కష్టపడతాడు. భవిష్యత్తు ఓటీటీదే కావొచ్చు కానీ థియేటర్లు కూడా ఉంటాయి’ అని సురేశ్‌ బాబు స్పష్టత నిచ్చారు.

వెంకటేశ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘నారప్ప’. కుల వ్యవస్థ, భూవివాదం అనే సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించారు. వెంకటేశ్‌కు జోడీగా ప్రియమణి నటించారు. కోలీవుడ్‌లో సూపర్‌హిట్ అందుకున్న ‘అసురన్‌’ రీమేక్‌ ఈసినిమా తెరకెక్కింది. జులై 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని