Remix Songs: ఆ‘పాత’ మధుర గీతాలు కొత్తగా.. అప్పుడలా.. ఇప్పుడిలా!
కల్యాణ్‌రామ్ తాజా చిత్రం ‘అమిగోస్’లోని ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ రాదే వెన్నెలమ్మ’ రీమిక్స్ గీతం శ్రోతల్ని అలరిస్తోంది. ఇంతకుముందు, నందమూరి హీరోల్లో ఎవరెవరు ఏయే రీమిక్స్‌లో నటించారంటే?
ఇంటర్నెట్ డెస్క్: సినీ పరిశ్రమలో రీమిక్స్ ట్రెండ్ ఎప్పటి నుంచో నడుస్తోంది. ఈ పద్ధతిలో అలనాటి సూపర్‌హిట్ పాట ఈనాటి సాంకేతికత సొబగులు అద్దుకుని కొంగొత్తగా వినిపిస్తుంది. ఇదంతా ఇప్పుడెందుకు అంటారా? మంచి రీమిక్స్ సాంగ్ ఉన్న ‘అమిగోస్’ చిత్రం ఈ నెల 10న విడుదలకాబోతుంది. 1992లో నందమూరి బాలకృష్ణ నటించిన గీతం.. కల్యాణ్‌రామ్ వెర్షన్‌లో ఎలా ఉంటుందో వెండితెరపై చూసేముందు ఆ కుటుంబ హీరోల్లో ఎవరెవరు ఏయే మధుర గీతాల రీమిక్స్‌లో కనిపించారో చూద్దాం..
ఎన్నో రాత్రులొస్తాయిగానీ..
బాలకృష్ణ (Balakrishna) హీరోగా 1992లో వచ్చిన ‘ధర్మక్షేత్రం’ (Dharma Kshetram) సినిమాలోని ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ రాదే వెన్నెలమ్మ’ (enno ratrulosthayi) పాట ఆనాటి నుంచి నేటి వరకు శ్రోతల్ని అలరిస్తూనే ఉంది. మరి, అలాంటప్పుడు అదే పాటను కొత్త సినిమాలో పెట్టడం ఎందుకంటారా? వాస్తవానికి విశేష ఆదరణ పొందిన పాటలను రీమిక్స్ చేయడం సాహసం. అందుకే చాలామంది ఫిల్మ్‌మేకర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, యాక్టర్స్ వాటిని టచ్ చేయరు. కానీ, కొన్ని సందర్భాల్లో రీమిక్స్ తప్పనిసరి అనుకుని ముందుకెళ్తుంటారు. కొత్త చిత్రం ‘అమిగోస్’ (Amigos)లో తన బాబాయ్ పాటను ఎందుకు రీమిక్స్ చేయాల్సి వచ్చిందో కల్యాణ్‌రామ్ చెబుతూ.. ‘‘ఈ సినిమా ద్వితీయార్థంలో కథ చాలా ఆసక్తిగా సాగుతున్నప్పుడు ఏదైనా కొత్త పాట వస్తే ప్రేక్షకులు నిరాశపడతారు. అలా జరగకుండా ఉండాలంటే ఏదైనా కొత్తగా చెయ్యాలని అనుకున్నాం. అందుకే ఆ రీమిక్స్ పెట్టాం. దాన్ని తెరపై చూసినప్పుడు అందరూ సర్‌ప్రైజ్ అవుతారు’’ అని తెలిపారు. బాలకృష్ణ- దివ్యభారతిలపై చిత్రీకరించిన ఆ పాత పాటకు ఇళయరాజా స్వరాలు సమకూర్చగా.. కల్యాణ్‌రామ్ (Kalyan Ram)- ఆషికా రంగనాథ్(Ashika Ranganath)లపై చిత్రీకరించిన కొత్త పాటలో జిబ్రాన్ కొన్ని మార్పులు చేశారు.
అరే ఓ సాంబా..
‘ఎన్నో రాత్రులొస్తాయి..’ కంటే ముందు ‘అరే ఓ సాంబా’ (Are O Sambha) అనే పాటను రీమిక్స్ చేయించి తన ‘పటాస్’ (Pataas) సినిమాలోకి తీసుకున్నారు కల్యాణ్‌రామ్. బాలకృష్ణ, విజయశాంతి జంటగా 1992లో తెరకెక్కిన ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ (Rowdy Inspector) చిత్రంలోని గీతమిది. బప్పీ లహిరి సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ పాట అప్పటి శ్రోతల్ని ఉర్రూతలూగించింది. ఆ స్థాయిని అందుకునేలా రీమిక్స్ చేశారు సంగీత దర్శకుడు సాయి కార్తీక్. కొత్త పాటలో బాలకృష్ణ ఫొటోలను ప్రదర్శించడంతో నందమూరి అభిమానులంతా థియేటర్లలో (2015) ఓ రేంజ్‌లో హంగామా చేశారు. అందులోని కల్యాణ్‌రామ్ లుక్స్, కథానాయిక శ్రుతి సోధి అందం ప్రేక్షకులను అలరించాయి.
కంటిచూపు చెబుతోంది..
బాలకృష్ణ హిట్ పాటలను కల్యాణ్‌రామ్, ఇతర హీరోలు రీమిక్స్ చేయగా.. ఆయన తన తండ్రి ఎన్టీఆర్ గీతాల రీమిక్స్‌లో నటించారు. శంకర్- జైకిషన్ స్వరాలందించిన ‘జీవితచక్రం’ (1971)లోని ‘కంటిచూపు చెబుతోంది’ పాటకు అప్పట్లో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఎన్టీఆర్, వాణిశ్రీల హావభావాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘పైసా వసూల్’ (Paisa Vasool) చిత్రం కోసం సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఆ పాటకు కొత్తదనాన్ని తీసుకొచ్చారు. బాలకృష్ణ, ముస్కాన్ సేతిలపై ఆ పాటను చిత్రీకరించారు.
నేడే ఈనాడే..
ఎన్టీఆర్ (NT Ramarao), కె. ఆర్. విజయ (KR Vijaya) జంటగా 1969లో వచ్చిన ‘భలే తమ్ముడు’ (Bhale Thammudu) లోని ‘నేడే ఈనాడే’ గీతాన్ని ‘అల్లరి పిడుగు’ (Allari Pidugu) కోసం రీమిక్స్ చేశారు. ఇందులో బాలకృష్ణ, కత్రినా కైఫ్ (Katrina Kaif) నటించారు. నాటి గీతానికి టి. వి. రాజు స్వరాలు సమకూర్చగా నేటి పాటకు మణిశర్మ సొబగులు అద్దారు.
ఓలమ్మీ తిక్కరేగిందా..
1977లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘యమగోల’ (Yamagola)లోని విజయవంతమైన గీతాల్లో ‘ఓలమ్మీ తిక్కరేగిందా..’ ఒకటి. చక్రవర్తి సంగీతం అందించారు. ఆ పాటలోని ఎన్టీఆర్, జయప్రద (Jayaprada) స్టెప్పులు ఎంతగా ఆకట్టుకున్నాయో.. ‘యమదొంగ’ (Yamadonga)లోని రీమిక్స్‌లో జూనియర్ ఎన్టీఆర్, మమతా మోహన్‌దాస్ డ్యాన్స్ అంతగా అలరించింది. నేటి ట్రెండ్‌కు తగ్గట్టు ఎం. ఎం. కీరవాణి ఆ పాటలో కొన్ని మార్పులు చేశారు.
నారా రోహిత్ ఇలా..
ఇదే ఫ్యామిలీకి చెందిన నారా రోహిత్ (Nara Rohit) కూడా ఎన్టీఆర్ పాటల రీమిక్స్‌లో నటించారు. 1979లో వచ్చిన ‘వేటగాడు’లోని ‘పుట్టింటోళ్లు తరిమేశారు’ ప్రత్యేక గీతాన్ని రోహిత్ తన ‘ఒక్కడినే’ (Okkadine) చిత్రంలోకి తీసుకున్నారు. అప్పటి పాటకు చక్రవర్తి సంగీతం అందిస్తే ఇప్పటి సాంగ్‌కు కార్తీక్ సంగీత సారథ్యం వహించారు.
* ‘భలే తమ్ముడు’(1969)లోని ‘ఎంతవారుగాని’ పాటను రోహిత్ తన ‘రౌడీఫెలో’ సినిమా కోసం తీసుకున్నారు. టి. వి. రాజు సంగీతం అందించిన ఆ గీతానికి సన్నీ ఎం. ఆర్ కొత్తగా వినిపించారు. నాటి పాటల్లోని హీరోల మ్యానరిజాన్ని నేటి హీరోలు అనుకరిస్తుంటారు కాబట్టి రీమిక్స్ గీతాలు ఎప్పుడూ సినిమాకు ప్రత్యేక ఆకర్షణే. ఒకే ఫ్యామిలీకి చెందిన నటుల రీమిక్స్ గీతాలకు ఎంతటి స్పందన వస్తుందో ఓ స్టార్ హీరో గీతం రీమిక్స్‌లో యంగ్ హీరో నటించినా ఆడియెన్స్‌కు ఆసక్తే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Andhra News: ఈ-ఆటోల తరలింపు ఎలా?.. తల పట్టుకున్న అధికారులు
-
Crime News
Vizag: విశాఖ రైల్వే స్టేషన్లో 18 నెలల చిన్నారి కిడ్నాప్
-
Politics News
TDP: లోకేశ్‌కు చిన్న హాని జరిగినా జగన్‌దే బాధ్యత
-
Crime News
Crime News: ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Crime News
Crime News: క్రికెట్లో వాగ్వాదం.. బ్యాటుతో కొట్టి చంపిన బాలుడు
-
Movies News
నయన చిత్రం.. ప్రతీకార నేపథ్యం