Adipurush: వెండితెర‘రామం’.. తెలుగు సినీ శ్రీరామచంద్రులు వీరే!

ప్రభాస్‌ రాముడిగా నటిస్తోన్న సినిమా ‘ఆదిపురుష్‌’ (Adipurush). జూన్‌ 16న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఎంతమంది హీరోలు రాముడిగా నటించారో చూద్దాం.

Updated : 13 Jun 2023 10:09 IST

ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘జై శ్రీరామ్‌..’ పాటే వినిపిస్తోంది. రింగ్‌టోన్‌ల నుంచి రీల్స్‌ వరకు అంతటా ‘ఆదిపురుష్‌’(Adipurush)కు సంబంధించిన సంగతులే కనిపిస్తున్నాయి. ఇక ఆ సినిమాలో రాముడిగా ప్రభాస్‌ (Prabhas) ఒదిగిపోయిన తీరు ప్రచార చిత్రాల్లో అందరినీ ఆకర్షిస్తోంది. మానవతా విలువలు, సంస్కృతి సంప్రదాయాలకు అర్థం చెప్పిన రాముడి పాత్రలో ఇప్పటి వరకు చాలా మంది హీరోలే నటించారు. మరి ప్రభాస్‌ కంటే ముందు రాముడిగా ఎవరెవరు నటించారో తెలుసా..

ఆద్యుడు ఆయనే..

చలనచిత్ర రంగంలో ఇప్పటివరకు ఎందరో నటులు రాముడిగా కనిపించినా.. తొలిసారి తెరపై రాముడిగా కనిపించింది మాత్రం నటుడు యడవల్లి సూర్యనారాయణనే. 1932లో విడుదలైన ‘పాదుకా పట్టాభిషేకం’ సినిమాలో రాముడిగా కనిపించారు. బాదామి సర్వోత్తం దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండో తెలుగు టాకీ చిత్రంగా తెరకెక్కింది. ఆ తర్వాత ఇదే పేరుతో 1945లో విడుదలైన చిత్రంలో సి.ఎస్.ఆర్.ఆంజనేయులు రాముడిగా నటించారు. 


తొలి సినిమాలోనే తెరపై రాముడిగా..

అక్కినేని నాగేశ్వరరావు 1944లో వచ్చిన ‘శ్రీ సీతారామ జననం’లో రాముడిగా కనిపించారు.ఆయన పూర్తిస్థాయి కథానాయకుడిగా కనిపించిన తొలి సినిమా ఇది. ఇందులో తెరపై రాముడిగా కనిపించి అందరి ప్రశంసలు అందుకున్నారు నాగేశ్వరరావు. ప్రసిద్ధగాయకుడు ఘంటసాలకు కూడా ఇది తొలిచిత్రం  కావడం విశేషం.


తెలుగువారికి రాముడంటే ఎన్టీఆరే!

సినిమాల్లో రాముడు అనగానే టక్కున గుర్తొచ్చే రూపం నందమూరి తారకరామారావు. 1959లో విడుదలైన సంపూర్ణ రామాయణంలో మొదటిసారి రాముడిగా కనిపించిన రామారావు.. ఆ తర్వాత లవకుశ, రామదాసు, శ్రీరామాంజనేయ యుద్ధం సినిమాల్లో రాముడిగా నటించారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కి ఆయనే నిర్మించిన శ్రీరామ పట్టాభిషేకం సినిమాలోనూ రాముడి పాత్రలో  కనిపించారు. ఆయన రాముడి వేషంలో అలా తెరపై కనిపిస్తే థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు స్క్రీన్‌కే హారతులు ఇచ్చేవారంటే ఆయన ఆ పాత్రలో ఎంతగా లీనమయ్యారో చెప్పచ్చు.


రామారావు కోసం రాముడిగా హరనాథ్‌

రామారావు దర్శకత్వం వహించిన ‘సీతారామ కల్యాణం’ సినిమాలో నటుడు హరనాథ్‌ రాముడిగా మారారు. 1961లో విడుదలైన ఈ సినిమాలో రావణుడిగా రామారావు నటించగా రాముడిగా హరనాథ్‌ అలరించారు. ఆ తర్వాత 1968లో విడుదలైన ‘శ్రీరామకథ’ సినిమాలోనూ హరనాథ్ రాముడిగా కనిపించారు.


రాముడుగానూ అలరించిన అందగాడు

తెలుగు సినీరంగంలో అందగాడిగా ముద్రపడిన హీరో శోభన్‌బాబు. ఆయన ఓ సినిమాలో రాముడిగా కనిపించారు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంపూర్ణ రామాయణం’ సినిమాలో శోభన్‌బాబు రాముడిగా నటించారు. 1971లో వచ్చిన ఈ సినిమాలో సీతగా చంద్రకళ నటించగా.. రావణుడి పాత్రలో ఎస్వీ రంగారావు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.


ఒక్కసారైనా రాముడిగా ఒదిగిపోయారు

ప్రముఖ నటుడు కాంతారావు 1968లో వచ్చిన ‘వీరాంజనేయ’లో రాముడిగా కనిపించారు. 1976లో బాపు గారి దర్శకత్వంలో వచ్చిన ‘సీతా కల్యాణం’లో నటుడు రవికుమార్‌ రాముడిగా ఒదిగిపోయారు.


తాతకు తగ్గమనవడిగా..

ఎన్టీఆర్‌ మనవడు జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా రాముడిగా తన నటనతో ఔరా అనిపించాడు. గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాల రామాయణం’లో జూనియర్‌ నటించారు. 1997లో వచ్చిన ఈ సినిమా ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్‌ అవార్డును గెలుచుకుంది. అలాగే రెండు నంది అవార్డులను కూడా సొంతం చేసుకుంది.


రామదాసులో సుమన్‌.. దేవుళ్లులో శ్రీకాంత్..

నిండైన రూపంతో రాముడి పాత్రలో కనిపించారు ప్రముఖ నటుడు సుమన్‌. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ రామదాసు’లో రాముడిగా కనిపించి అలరించారు. అలాగే కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘దేవుళ్లు’లో ఓపాటలో శ్రీకాంత్‌ రాముడిగా కనిపించారు. 


ఆ కృష్ణుడే రాముడిగా..

ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో మెప్పించిన బాలకృష్ణ ఓ సినిమాలో రాముడిగా కనిపించారు. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ రామరాజ్యం’ సినిమాలో నీలమేఘశ్యాముడిగా కనిపించారు. 2011లో వచ్చిన ఈ సినిమాలో సీతగా నయనతార తన నటనతో ఆశ్చర్యపరిచారు. 


ఆదిపురుష్‌గా ఆసక్తి కలిగిస్తున్న ప్రభాస్‌..

ఇక ఇప్పటి వరకు ఎన్నో విభిన్న లుక్స్‌తో అలరించిన ప్రభాస్‌.. ‘ఆదిపురుష్‌’లో మొదటిసారి రాముడిగా కనిపించనున్నారు. ఓంరౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా  రామాయణానికి టెక్నాలజీని జోడించి రూపొందించారు. రాఘవుడిగా ప్రభాస్‌ నటిస్తుండగా, జానకిగా కృతి సనన్‌ (Kriti Sanon) నటిస్తోంది. ఇక రావణుడి పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ (Saif Ali Khan) కనిపించనున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌లో సినీ చరిత్రలోనే తొలిసారిగా 50 అడుగుల ప్రభాస్‌ హాలోగ్రామ్‌ ప్రదర్శించారంటే ఆయన్ని రాముడిగా చూడాలని అభిమానులు ఎంతగా కోరుకుంటున్నారో చెప్పొచ్చు. మరి రాముడిగా ప్రభాస్‌ను త్రీడీలో చూడాలంటే జూన్‌ 16 వరకు ఆగాల్సిందే..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని