Trisha:మిస్‌ చెన్నై.. ‘నాయకి’గా మారి 

అగ్ర కథానాకులకైనా.. యంగ్‌ హీరోలకైనా ఆమె సరైన ‘జోడి’. ‘వర్షం’ వస్తుందంటే చాలు ఆమె చేసిన సందడి గుర్తుకొస్తుంది. వెండితెర ‘పౌర్ణమి’ తను. అభిమానులంటే ‘ఆకాశమంత’ ప్రేమ తనకి. ఆ ‘నాయకి’ ఇంకెవరు త్రిషనే.

Updated : 04 May 2021 16:05 IST

అగ్ర కథానాయకులకైనా.. యంగ్‌ హీరోలకైనా ఆమె సరైన ‘జోడి’. ‘వర్షం’ వస్తుందంటే చాలు ఆమె చేసిన సందడి గుర్తుకొస్తుంది. వెండితెర ‘పౌర్ణమి’ తను. నాన్నంటే ‘ఆకాశమంత’ ప్రేమ తనకి. ఆ ‘నాయకి’ ఇంకెవరు త్రిషనే. నేడు త్రిష పుట్టిన రోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం... 

సినిమాల్లోకి రాకముందు..

కృష్ణన్‌, ఉమ దంపతులకు 1983 మే 4న చెన్నైలో జన్మించింది త్రిష. బ్యాచిలర్‌ ఆఫ్ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (బీబీఏ) చదువుకుంది. మోడలింగ్‌పై ఉన్న ఆసక్తితో పలు టెలివిజన్‌ కమర్షియల్‌ యాడ్స్‌లో మెరిసింది. 1999లో ‘మిస్‌ చెన్నై’ కిరీటం అందుకుంది. 2001లో ‘మిస్‌ ఇండియా బ్యూటిఫుల్ స్మైల్‌’ టైటిల్‌ గెలుచుకుంది. చిన్నతనంలో సైకాలజిస్టు అవ్వాలనుకున్న త్రిష వయసు పెరిగేకొద్దీ తన ఆలోచన మార్చుకుని నటనవైపు దృష్టి పెట్టింది. అలా ఓ ఆల్బమ్‌లో కనిపించి సినిమా అవకాశం అందుకుంది.

సహాయ నటిగా..

ప్రశాంత్‌, సిమ్రన్‌ జంటగా తెరకెక్కిన ‘జోడి’ చిత్రంతో తెరంగ్రేటం చేసింది త్రిష. ఇందులో సిమ్రన్‌ స్నేహితురాలి పాత్ర పోషించింది. ఆ తర్వాత పలు తమిళ చిత్రాల్లో నటించి, ‘నీ మనసు నాకు తెలుసు’ చిత్రంతో కథానాయికగా టాలీవుడ్‌కి పరిచయమైంది. ప్రభాస్‌ హీరోగా వచ్చిన ‘వర్షం’ చిత్రం త్రిష కెరీర్‌ గ్రాఫ్‌ని అమాంతం పెంచేసింది. ఈ సినిమా విజయంతో వరుస అవకాశాలు అందుకుని అనతి కాలంలోనే అగ్ర నాయికల జాబితాలో నిలిచింది. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘అతడు’, ‘అల్లరి బుల్లోడు’, ‘పౌర్ణమి’, ‘సైనికుడు’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘కృష్ణ’, ‘బుజ్జిగాడు’ తదితర చిత్రాల్లోని పాత్రలు త్రిషకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇలా టాలీవుడ్‌లో హవా కొనసాగించిన త్రిష గత కొన్నాళ్లుగా తెలుగు చిత్రాలకు దూరంగా ఉంటోంది. చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘ఆచార్య’లో నాయికగా ఎంపికైన తర్వాత నటించనని ఈ సినిమా నుంచి వైదొలిగింది. ప్రస్తుతం తమిళ, మలయాళ చిత్రాలతో బిజీగా ఉంది.

వాటిని అధిగమించి..

నటిగా కెరీర్ ఆరంభించి ఇన్నేళ్లవుతున్నా అవకాశాలు అందుకోవడంలో త్రిష ముందు వరుసలోనే ఉంటుంది. ఏ పాత్ర ఎంపిక చేసుకున్నా దానికి 100 శాతం న్యాయం చేసేందుకు శ్రమించే తత్వమే ఆమెని ఈ స్థాయికి తీసుకొచ్చింది. నటిగా సంతోష జీవితాన్ని గడిపే త్రిష వ్యక్తిగతంగా బాధ పడిన సందర్భాలూ ఉన్నాయి. తను ఎంతగానో ప్రేమించే వాళ్ల నాన్న అకాల మరణం త్రిషకి తీరని లోటుని మిగిల్చింది. ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం అయ్యాక పెళ్లికి నో చెప్పిందని అప్పట్లో త్రిష గురించి రకారకాలుగా ప్రచారం సాగింది. ‘అది నా వ్యక్తిగతం అనుకుని’ వీటన్నింటినీ అధిగమించి సినిమాలపైనే దృష్టి పెట్టి మళ్లీ తన సత్తా చాటుతోంది. ఇప్పటికీ తన వివాహం గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఎప్పటికైనా ప్రేమ వివాహానికే నా ఓటు అని చెప్పే త్రిష ఆ శుభవార్త ఎప్పుడో వినిపిస్తుందో చూడాలి. నటిగానే కాకుండా వివిధ కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా, పెటా రాయబారిగా తనదైన ముద్ర వేసిన త్రిషకి వాళ్ల అమ్మే స్ఫూర్తి.

మా అమ్మే స్ఫూర్తి..

సెట్స్‌కి వెళ్లి నటించడం మాత్రమే నా పని. దాని వెనక ఉన్న కష్టమంతా మా అమ్మే చూసుకుంటుంది. కథ దగ్గర నుంచి నా పాత్ర వరకు అన్నింటిని తనతోనే చర్చిస్తా. అటు వ్యక్తిగతంగా, ఇటు వృత్తిపరంగా అమ్మ అన్ని విషయాల్ని చక్కబెడుతుంది. అందుకే ఎప్పటికీ మా అమ్మే నాకు స్ఫూర్తి అని చెప్తుంటుంది త్రిష.

వాళ్ల నుంచి నేర్చుకోవాలి..

తెలుగులో సీనియర్‌ హీరోల నుంచి కొత్త కథానాయకుల వరకు అందరితోనూ నటించే అవకాశం రావడం గొప్పగా ఉంటుంది. త్వరగా సినిమాల్లోకి రావడమే ఇందుకు ఓ కారణంగా భావిస్తాను. స్టార్‌డమ్‌ని పట్టించుకోను. కమల్‌ హాసన్‌, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌, బాలకృష్ణ తదితర అగ్ర కథానాయకులంతా ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు. అహం లేకుండా పనిచేస్తారు. వాళ్ల నుంచి అది నేర్చుకోవాలి అని అంటుంటుంది.

ఫోన్‌కి ఎడిక్ట్‌ అవుతా..

నాకు ఫోన్‌ వాడటం అంటే పిచ్చి. ఖాళీ సమయం దొరికితే చాలు ఫోన్‌ తెరపై వేళ్లు కదలాల్సిందే. అలా అని కాల్స్‌ ఎక్కువగా మాట్లాడను. సందేశాలు పంపించేందుకు, ఆటలు ఆడేందుకు, తాజా వార్తలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తా. వెంకటేశ్‌, ప్రకాశ్‌ రాజ్‌ నా ఫోన్‌ పిచ్చి తెలిసి నన్ను ఏడిపిస్తుంటారని ఓ సందర్భంలో పంచుకుంది.

ముద్దు పేర్లు: ట్రాష్, ట్రిష్, హనీ

నచ్చే ప్రదేశాలు: గోవా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా

ఖాళీ సమయంలో:  స్నేహితులతో ముచ్చట్లు, వీధుల్లో షికార్లు, విదేశీ ప్రయాణాలు

ఇష్టమైన నాయికలు: సిమ్రన్‌, ఏంజలినా జోలి,జూలియా రాబర్ట్స్‌

మెచ్చే కథానాయకులు: కమల్‌ హాసన్‌, ఆమీర్‌ ఖాన్‌, వెంకటేశ్‌

నచ్చిన సినిమాలు: నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఆకాశమంత

దర్శకులు: మణిరత్నం, ప్రభుదేవా, శ్రీ రాఘవ

త్రిష గురించి చాలామందికి తెలియనవి: 

* ఓసారి ఆస్ట్రేలియా వెళ్లినపుడు 1400 అడుగుల ఎత్తు నుంచి స్కై డ్రైవ్‌ చేసింది త్రిష.

* అందరూ ఇష్టపడే పలు రకాల ఖరీదైన కుక్కలకన్నా.. సాధారణ కుక్కల్ని పెంచడమే తనకిష్టం.

* తన స్కూల్‌ యూనిఫామ్‌ ఇప్పటికీ త్రిష దగ్గర ఉంది. పాఠశాల రోజుల్లో స్నేహితుల ఇచ్చిన గ్రీటింగ్‌ కార్డుల్ని భద్రంగా దాచుకుంది.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని