Suriya: ఏం సాధించావని నిద్రపోతున్నావ్‌?అని ప్రశ్నించారు: సూర్య గురించి ఈ విషయాలు తెలుసా!

అటు కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌లో విశేష క్రేజ్‌ ఉన్న నటుల్లో సూర్య ఒకరు. నేడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనపై ప్రత్యేక కథనం..

Published : 23 Jul 2023 09:43 IST

తండ్రి హీరో అయినా ఆయనెప్పుడూ షూటింగ్‌ చూసేందుకు వెళ్లలేదు. నటనపై ఆసక్తి చూపలేదు. కానీ, పరిస్థితుల ప్రభావం వల్ల చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టక తప్పలేదు. కెరీర్‌ ప్రారంభంలో నటుడిగా విమర్శలు ఎదుర్కొన్న ఆయన ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడెందరికో ఆదర్శంగా నిలిచారు. ‘నటనకు పెట్టింది పేరు’ అని అనిపించుకున్నారు. ఆయనే.. అటు కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌లో విశేష క్రేజ్‌ ఉన్న సూర్య (Suriya). నేడు పుట్టినరోజు (48వ) సందర్భంగా ఆయన గురించి పలు ఆసక్తికర విషయాలు మీకోసం (#HappyBirthDaySuriya)..

  • సూర్య అసలు పేరు శరవణన్‌. ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఆ పేరును సూర్యగా మార్చారు. మణిరత్నం తెరకెక్కించిన ‘దళపతి’ సినిమాలోని రజనీకాంత్‌ పోషించిన పాత్ర పేరు అది. మరో విశేషమేంటంటే.. సూర్య తొలి సినిమా ‘నేరుక్కు నేర్‌’లోని తొలి షాట్‌కి మణిరత్నమే దర్శకత్వం వహించారు. నిర్మాతగా వ్యవహరించారు. వసంత్‌ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమాలో హీరో విజయ్‌ (Vijay)తో కలిసి నటించారు సూర్య. ఇదే పేరుతో నాలుగు సినిమాల్లో కనిపించారు.
  • తన తండ్రి శివ కుమార్‌ అప్పట్లో హీరో అయినా చిత్ర పరిశ్రమలోకి వచ్చేందుకు సూర్య అంతగా ఆసక్తి చూపేవారు కాదు. కాలేజీ రోజుల్లో జరిగిన ఓ సంఘటనతో నటనవైపు వెళ్లకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఏమైందంటే.. రంగస్థల నాటక సంఘంలో చేరిన సూర్య తనని తాను పరిచయం చేసుకునేందుకు వణుకుతూనే మైక్‌ పట్టుకుని, మాట్లాడడం ప్రారంభించారు. ‘‘హలో! ఐయామ్‌ శరవణన్‌, డూయింగ్‌ మై డూకామ్‌’’ అని చెప్పారు. బీకామ్‌కి బదులు డూకామ్‌ అనడంతో నవ్వులతో ఆడిటోరియమ్‌ ఘొల్లుమంది. నలుగురిలో మాట్లాడాలంటే భయంకావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్టింగ్‌ వైపు వెళ్లకూడదని ఫిక్స్‌ అయ్యారు.
  • సూర్య డిగ్రీ పూర్తి చేసే సమయానికి శివ కుమార్‌ హీరో నుంచి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారారు. ఆర్థిక సమస్యలు తలెత్తడంతో సూర్య ఓ గార్మెంట్‌ కంపెనీలో ఉద్యోగం చేశారు. రెండు నెలలకుగాను రూ.1200 జీతం అందుకున్నారు. తొలి సంపాదనతో వాళ్లమ్మకు చీరకొన్నారు. కొన్నాళ్ల తర్వాత అప్పుచేసి సొంత కంపెనీ పెట్టారు. వ్యాపారం లాభసాటిగా ఉన్నా ఆ రంగంపై ఆసక్తి చూపలేకపోయారు. అప్పు తీర్చేందుకు ఆయన సినిమాని మార్గంగా ఎంచుకున్నారు.
  • సూర్యలో మార్పురావడానికి ప్రధాన కారణం నటుడు రఘువరన్‌. ఓసారి వీరిద్దరు రైలు ప్రయాణం చేశారు. గాఢ నిద్రలో ఉన్న సూర్యని లేపి ‘ఎలా నిద్రపడుతోందిరా నీకు. ఏం సాధించావని? ఇంకా ఎంతకాలం మీ నాన్న పేరు చెబుతూ ఇండస్ట్రీలో బతుకుతావ్‌?’ అని రఘువరన్‌ అన్నారట. ఆ మాటలకు బాధపడిన సూర్య నటనపై శ్రద్ధ పెట్టారు. ప్రపంచంలోని గొప్ప సినిమాలన్నీ చూసి ఏ హావభావాన్ని ఎలా ప్రదర్శించాలో నేర్చుకున్నారు.
  • నటన మెరుగుపడ్డా.. పక్కవారితో మాట్లాడాలంటే ఇబ్బంది పడేవారు సూర్య. ‘పూవెల్లాం కేటుప్పార్‌’ సినిమా చిత్రీకరణ సమయంలో ‘మీ కళ్లు చాలా బాగుంటాయి’ అని హీరోయిన్‌ జ్యోతిక.. సూర్యతో అన్నారట. ‘ఓ అమ్మాయి నుంచి నేను అందుకున్న తొలి కాంప్లిమెంట్‌ అదే’ అని అప్పట్లో పలు ఇంటర్వ్యూల్లో ఆనందం వ్యక్తం చేశారు సూర్య. పలు సినిమాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరు ప్రేమించి, పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు. సూర్య సోదరుడు కార్తి హీరోగా రాణిస్తున్నారు.

  • ఇతర హీరోలకు సంబంధించి సూర్య డబ్బింగ్‌ చెప్పిన ఏకైక చిత్రం ‘గురు’ (Guru). బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తమిళ వెర్షన్‌కు సూర్య గాత్రదానం చేశారు. రానా హీరోగా రూపొందిన ‘ఘాజీ’కి తమిళంలో వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. వ్యాఖ్యాత, గాయకుడు, నిర్మాత.. ఇలా అడుగుపెట్టిన ప్రతి విభాగంలో తనదైన మార్క్‌ చూపించారు.
  • ‘జీరోవా? జీరోవా?’ వంటి లఘు చిత్రాల్లో, ‘స్పిరిట్‌ ఆఫ్‌ చెన్నై’వంటి మ్యూజిక్‌ వీడియోల్లోనూ సూర్య నటించారు. ఆస్కార్‌ అవార్డ్స్‌ కమిటీలోకి ఆహ్వానితుడిగా వెళ్లిన తొలి దక్షిణ భారతీయ నటుడు సూర్య. ఆ సంస్థ యూట్యూబ్‌ ఛానెల్‌లో స్థానం దక్కించుకున్న తొలి భారతీయ సినిమా సూర్య (జై భీమ్‌)దే.
  • సమాజ సేవ చేయడంలో ముందుండే సూర్య ‘అగరం ఫౌండేషన్‌’ స్థాపించి, పేద పిల్లలకి ఉచితంగా ఉన్నత విద్య అందిస్తూ, వారిలో ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందిస్తున్నారు. మార్కుల్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకుండా ఆ పిల్లల నేపథ్యాన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. ఇప్పటి వరకు వేల సంఖ్యలో విద్యార్థులకి సాయమందించారు. ‘జై భీమ్‌’ సినిమా దర్శకుడు టీజే జ్ఞానవేలు నిరుపేద విద్యార్థులకు చేసే సాయాన్ని గుర్తించిన సూర్య ఆయనతో కలిసి అగరం ఫౌండేషన్‌ ప్రారంభించారు.
  • సుమారు 26 ఏళ్ల నట ప్రస్థానంలో సూర్య జాతీయ అవార్డు (సూరారై పోట్రు)సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు. నటులకి సంబంధించిన ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో బెస్ట్‌ యాక్టర్‌, బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌, బెస్ట్‌ యాక్టర్‌ (క్రిటిక్స్‌ ఛాయిస్‌) అనే మూడు విభాగాల్లోనూ పురస్కారం అందుకున్న ఏకైక నటుడు సూర్య. ప్రస్తుతం.. భారీ బడ్జెట్‌ చిత్రం ‘కంగువా’ (Kanguva)తో బిజీగా ఉన్న సూర్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం..

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని