Tamil movies: ఈ ఏడాది ఆసక్తి రేకెత్తిస్తోన్న కోలీవుడ్ చిత్రాలివీ!
ఈ ఏడాది విడుదలకానున్న కోలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులేంటో తెలుసా? ఏ దర్శకుడు ఏ హీరోతో సినిమా చేస్తున్నారంటే..?
Tamil movies: భారతీయ సినీ పరిశ్రమలో ఈ ఏడాది పలు ఆసక్తికర ప్రాజెక్టులు ప్రేక్షకులను అలరించనున్నాయి. ముఖ్యంగా తమిళం నుంచి కొన్ని క్రేజీ ప్రాజెక్టులు రాబోతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాలు విడులవుతుండడంతో ఆసక్తి నెలకొంది. మరి ఆ సినిమాలేంటి? వాటి కథేంటో చూసేయండి..
విజయ్ క్రేజీ మూవీ ‘లియో’
ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌ల్లో ‘లియో’ (lio) ఒకటి. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న రెండో చిత్రమిది. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ టీజర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. సంజయ్ దత్, అర్జున్, త్రిష, గౌతమ్ మేనన్, ప్రియా ఆనంద్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, సాండీ మాస్టర్‌లు కీలక పాత్రలు పోషిస్తుండడంతో సినీ ప్రియుల్లో ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కశ్మీర్‌లో జరుగుతోంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ‘లియో’ను తెరకెక్కించనున్నట్లు కోలీవుడ్ టాక్. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసి, ఈ ఏడాది అక్టోబరు 19న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్ 2’
మణిరత్నం కలల ప్రాజెక్టు ‘పొన్నియిన్ సెల్వన్’ (ponniyin selvan) మొదటి భాగం గతేడాది విడుదలై, బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినీ అభిమానులందరూ రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న రెండో భాగం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. తొలి భాగంలో విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, కార్తి, త్రిష, జయం రవిల పాత్రలకు సంబంధించిన పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నారు మణిరత్నం. రెండో భాగంలో చోళుల రాజ్యంలో చోటు చేసుకున్న రాజకీయ ఎత్తులు, పై ఎత్తులను చూపించనున్నారు. తొలి భాగంతో పోలిస్తే, మలిభాగంలో నాటకీయతకు మరింత పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. ఆదిత్య కరికాలన్- నందినిల మధ్య ఏం జరిగింది? కుట్రలు, కుతంత్రాలను దాటుకుని, అరుళ్‌మోళి వర్మన్ ఎలా రాజు అయ్యాడు? ఇందుకు వల్లవరాయ వందియన్, కుందవై ఏం చేశారు? తెలియాలంటే పార్ట్-2 చూడాల్సిందే. రెండో భాగంలో మరికొన్ని కొత్త పాత్రలు కూడా మణిరత్నం పరిచయం చేస్తారని అంటున్నారు.
తలైవా హిట్ ఇచ్చేనా?
అగ్ర కథానాయకుడు రజనీకాంత్ (Rajinikanth) బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి చాలా రోజులవుతోంది. గతంలో వచ్చిన ‘దర్బార్’, ‘అన్నాత్తే’ ప్రేక్షకులు ఆశించినంతగా మెప్పించలేకపోయాయి. ఈ క్రమంలో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న నెల్సన్ దిలీప్‌కుమార్‌తో రజనీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘జైలర్’ (jailer) అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. డార్క్ కామెడీ థ్రిల్లర్ జానర్‌లో ఈ మూవీని తీర్చిదిద్దుతున్నట్లు టాక్. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, సునీల్, జాకీష్రాఫ్, రమ్యకృష్ణ, యోగిబాబు తదితరులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. శివ కార్తికేయన్ అతిథి పాత్రలో తళుక్కున మెరవనున్నారట.
‘భారతీయుడు’ మళ్లీ వస్తున్నాడు!
దాదాపు పాతికేళ్ల కిందట కమల్‌హాసన్- శంకర్ కాంబినేషన్ వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఇండియన్’. ఆ సినిమాకు కొనసాగింపుగా ఇప్పుడు ‘ఇండియన్ 2’ (indian 2) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తయింది. ఇటీవల మరో కీలక షెడ్యూల్‌ను తిరుపతిలో మొదలు పెట్టారు. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి, దసరా కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సుదీప్, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇంకొన్ని..
ఇవే కాదు, మరికొన్ని సినిమాలు తమిళ చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. కార్తి కథానాయకుడిగా నటిస్తున్న ‘జపాన్’, ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’, శింబు ‘పాతు తాళ’, శివకార్తికేయన్ ‘అయాలాన్’, ‘మావీరన్’ చిత్రాలున్నాయి. మరి, వీటిలో ఏయే చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తాయో చూడాలి!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్
-
IND vs AUS: టీమ్ఇండియా ఆలౌట్.. మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం
-
Cheetah : భారత్‌కు ఉత్తర ఆఫ్రికా దేశాల చీతాలు.. పరిశీలిస్తున్న అధికారులు!