Pawan Kalyan and Prabhas: ఇటు పవన్‌కల్యాణ్‌.. అటు ప్రభాస్‌.. తగ్గేదే లే!

ప్రస్తుతం ఎక్కువ సినిమాల్లో నటిస్తున్న టాలీవుడ్‌ అగ్ర హీరోలు.. పవన్‌ కల్యాణ్‌, ప్రభాస్‌. ఏ కథానాయకుడు ఎన్ని చిత్రాల్లో నటిస్తున్నారంటే?

Updated : 23 Apr 2023 16:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎప్పుడూలేనిది అగ్ర హీరోలు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), ప్రభాస్‌ (Prabhas) వరుస చిత్రాలు ప్రకటించడమే కాకుండా విరామమే లేకుండా షూటింగ్స్‌లో పాల్గొంటూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. అభిమానుల్ని వెంటవెంటనే అలరించేందుకు ఎంతో కష్టపడుతున్నారు. ఎవరి ప్రాజెక్టుల్లో వారు పోటాపోటీగా నటిస్తూ ‘తగ్గేదే లే’ అనిపిస్తున్నారు. ఎవరెన్ని సినిమాలతో బిజీగా ఉన్నారో మీకు తెలుసా..?

రీ ఎంట్రీలో పవన్‌ జోరు..

అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆయన అభిమానులకు మరింత నిరాశ ఎదురైనట్టైంది. ‘ఇక పవన్‌ నటనకు గుడ్‌బై చెబుతారేమో!’ అని అంతా అనుకున్నారు. రాజకీయ రంగ ప్రవేశంతో కొన్నాళ్ల విరామం తీసుకున్న అనంతరం ‘వకీల్‌సాబ్‌’ (Vakeelsab)తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్‌ మంచి విజయాన్ని అందుకున్నారు. అదే ఉత్సాహంలో ‘భీమ్లానాయక్‌’ (Bheemla Nayak)లో నటించి, అలరించారు. ప్రస్తుతం ఆయన నాలుగు సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. 

క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) ఇప్పటికే విడుదలకావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడింది. చరిత్రాత్మక నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో పవన్‌ మునుపెన్నడూ చూడని లుక్‌లో కనిపించనున్నారు. వీరోచితమైన ఆ పాత్రలో ఒదిగిపోయేందుకు ఆయన యుద్ధ విన్యాసాల్లో శిక్షణ తీసుకున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ కథానాయిక. బాలీవుడ్‌ నటులు నర్గిస్‌ ఫక్రి, బాబీ దేవోల్‌ కీలక పాత్రలు పోషించారు. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ‘గబ్బర్‌ సింగ్‌’ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత దర్శకుడు హరీశ్‌ శంకర్‌తో పవన్‌ కొన్నాళ్ల క్రితమే ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎప్పుడో పట్టాలెక్కాల్సిన ఆ సినిమా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ ఎట్టకేలకు ఇటీవల ప్రారంభమైంది. ఆ మూవీకి తొలుత ఖరారు చేసిన ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ పేరును ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (Ustaad Bhagat Singh)గా మార్చారు. ఈ సినిమా కోసం పవన్‌ మరోసారి ఖాకీ ధరించారు. ఓ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయింది. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ఖరారుకాలేదు.

ఇక సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న ‘PKSDT’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రీకరణలోనూ పవన్‌ పాల్గొన్నారు. తమిళ్‌ హిట్‌ మూవీ ‘వినోదాయ సీతం’ రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పవన్‌ మేనల్లుడు, హీరో సాయిధరమ్‌ తేజ్‌ కూడా నటిస్తున్నారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లు. ఈ మల్టీస్టారర్‌ ఈ ఏడాది జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సాహో’తో యావత్‌ సినీ ప్రియుల్ని ఆకర్షించిన దర్శకుడు సుజీత్‌తో పవన్‌ ‘ఓజీ’ (ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌) (OG) సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ ముంబయిలో జరుగుతోంది. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. మరికొందరు దర్శకులు పవన్‌తో సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నారు. కానీ, రాబోయే ఎన్నికల దృష్ట్యా ఆయన ప్రస్తుతం కమిట్‌ అయిన చిత్రాల్ని పూర్తి చేసే ఆలోచనలోనే ఉన్నారు. 

ఇదీ ప్రభాస్‌ తీరు..

పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’ (Radhe Shyam)తో అభిమానుల్ని నిరాశపరిచిన ఆయన ఆ లోటును భర్తీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ‘ఆదిపురుష్‌’ (Adipurush), ‘సలార్‌’ (Salaar), ‘ప్రాజెక్ట్‌ కె’ (Project K).. ఇలా వరుస పాన్‌ ఇండియా స్థాయి చిత్రాలే కాకుండా మధ్యలో ఓ చిన్న చిత్రంలోనూ నటిస్తున్నారు. ప్రభాస్‌ హీరోగా బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన ‘ఆదిపురుష్‌’ చిత్రీకరణ పూర్తయింది. విజువల్స్‌ను మరింత మెరుగ్గా చూపించేందుకు చిత్ర బృందం.. ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమాని వాయిదా వేసింది. ఈ ఏడాది జూన్‌ 16న రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. అంతకంటే ముందే.. ఈ సినిమా జూన్‌ 13న ప్రతిష్ఠాత్మక ‘ట్రిబెకా ఫెస్టివల్‌’లో ప్రదర్శితంకానుంది. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్‌.. రాఘవగా, కృతిసనన్‌.. జానకిగా, సైఫ్‌ అలీఖాన్‌.. లంకేశ్‌గా నటించారు. ‘కేజీయఫ్‌’ ఫేం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తున్న ‘సలార్‌’ ఈ ఏడాది సెప్టెంబరు 28న విడుదలవుతుంది. శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. రెండు భాగాలు ఈ మూవీని తీసుకొస్తున్నారు.

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌)..  2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్‌కానుంది. సైన్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో దీపికా పదుకొణె కథానాయిక. అమితాబ్‌ బచ్చన్‌, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి ఏ చిన్న అప్‌డేట్‌ వచ్చినా అది సంచలనం అవుతోంది. వీటిల్లోని పవర్‌ఫుల్‌ రోల్స్‌ నుంచి కాస్త రిలాక్స్‌ అయ్యేందుకేమో.. మారుతి డైరెక్షన్‌లో వినోదాత్మక క్యారెక్టర్‌ ప్లే చేస్తున్నారు ప్రభాస్‌. ఎలాంటి అప్‌డేట్స్‌ ఇవ్వకుండా చిత్ర బృందం శరవేగంగా చిత్రీకరణ సాగిస్తోంది. అందులో ప్రభాస్‌ సరసన మాళవిక మోహనన్‌, రిద్ది కుమార్‌ తదితరులు నటిస్తున్నారు. ‘అర్జున్‌ రెడ్డి’ ఫేం సందీప్‌ వంగా రెడ్డితో ప్రభాస్‌ ప్రకటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘స్పిరిట్‌’ (Spirit) త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అందులో ప్రభాస్‌ పోలీసు అధికారిగా కనిపిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు