Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి

‘స్వయంవరం’, ‘చిరు నవ్వుతో’, ‘హనమాన్‌ జంక్షన్‌’, ‘కల్యాణ రాముడు’, ‘పెళ్లాం ఊరిళితే’, ‘ఖుషి ఖుషీగా’, ‘చెప్పవే చిరుగాలి’, ‘గోపి.. గోపిక.. గోదావరి’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నటుడు వేణు తొట్టెంపూడి.

Updated : 07 Jul 2022 11:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘స్వయంవరం’, ‘చిరు నవ్వుతో’, ‘హనుమాన్‌ జంక్షన్‌’, ‘కల్యాణ రాముడు’, ‘పెళ్లాం ఊరిళితే’, ‘ఖుషి ఖుషీగా’, ‘చెప్పవే చిరుగాలి’, ‘గోపి.. గోపిక.. గోదావరి’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నటుడు వేణు తొట్టెంపూడి (Venu Thottempudi). తనదైన హాస్యంతో గిలిగింతలు పెట్టే ఆయన గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. సుమారు 9 ఏళ్లకు ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ (RamaRao On Duty) అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. రవితేజ (Raviteja) హీరోగా శరత్‌ మండవ తెరకెక్కించిన చిత్రమిది. ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా వేణు సోషల్‌ మీడియా వేదికగా సినిమా సంగతులు పంచుకున్నారు.

* చాలాకాలం తర్వాత నటించడం ఎలా అనిపించింది?

వేణు: సినిమాలకే నేను తొలి ప్రాధాన్యమిస్తా. కానీ, అనివార్య కారణాల వల్ల కొన్నాళ్లు నటనకు దూరంగా ఉన్నా. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత నటించడం చాలా సంతోషంగా ఉంది. ‘రామారావు ఆన్‌ డ్యూటీ’తోపాటు ‘పారా హుషార్‌’ అనే సినిమాలోనూ కీలక పాత్ర పోషించా.

* ‘రామారావు’తోనే కమ్‌బ్యాక్‌ ఇవ్వడానికి కారణం?

వేణు: ఈ సినిమా దర్శక, నిర్మాతలు నాకు చాలా సార్లు ఫోన్‌ చేసి నటించమని అడిగినా ముందు నేను ఒప్పుకోలేదు. ‘మీరు ఈ చిత్రంలో నటించకపోయినా ఫర్వాలేదు. ఓసారి కలుద్దాం’ అని దర్శకుడు శరత్‌ మండవ మెసేజ్‌ చేశారు. ఓ సారి మీట్‌ అయ్యాం. ఆ ముచ్చట్లలో భాగంగా ‘మీ పాత్రను ఇలా అనుకుంటున్నా. మీకు నమ్మకం ఉంటే చేయండి’ అని ఆయన అన్నారు. నాకూ ఆ క్యారెక్టర్‌ బాగా నచ్చడంతో రెండుమూడు సార్లు శరత్‌తో చర్చించి, నటించేందుకు ఓకే చెప్పా. అంతకుముందు వేరే కథలూ విన్నా. అనుకోకుండా ఇది పట్టాలెక్కింది.

* ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?

వేణు: ఇంతకుముందు నేను పోషించినవన్నీ చాలా సరదా పాత్రలు. ఈ చిత్రంలో సీఐ మురళీగా పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తా. ఇందులో నేను ఎలా నటించానో ప్రేక్షకులే చెప్పాలి.

* రవితేజతో నటించడం గురించి చెప్తారా?

వేణు: ఆయన ఓ పవర్‌ హౌజ్‌. ఎంతో సరదాగా ఉంటాడు. నటనకు సంబంధించి ఏ విషయాన్నైనా ఇట్టే పట్టేస్తాడు. ఎంతో హోమ్‌ వర్క్‌ చేస్తాడు. పనిపై స్పష్టత ఉన్న వ్యక్తి. ఆయనతో నేను కలిసి నటించిన సన్నివేశాలన్నీ మీ అందరినీ మెప్పిస్తాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని