Vennira Aadai Nirmala: మా ఇంటికి హీరో తాగొచ్చి.. రాద్ధాంతం చేశాడు: సీనియర్‌ నటి

అలనాటి నటి నిర్మల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. ఓ హీరో ఇబ్బంది పెట్టాడని తెలిపారు.

Published : 21 Mar 2023 11:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 1965లో వచ్చిన ‘వెన్నిరాడై’ (తమిళ్‌)తో తెరంగేట్రం చేసి.. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు నటి నిర్మల (Vennira Aadai Nirmala). తమిళ్‌, తెలుగు, మలయాళం, కన్నడ కలిపి 400కిపైగా చిత్రాల్లో నటించిన ఆమె ఇటీవలో ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అలనాటి అగ్ర హీరోలు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ తదితరులతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్న ఆమె.. ఓ కథానాయకుడు చేసిన గొడవనూ గుర్తుచేసుకున్నారు. ఆ హీరో పేరు చెప్పకుండా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఇలా వివరించారు.

‘‘అప్పట్లో నేను నటించిన ఓ సినిమా చిత్రీకరణ పూర్తైన తర్వాత ఇంటికి చేరుకున్నా. ఆ చిత్ర హీరో మద్యం సేవించి.. మా ఇంట్లోకి వచ్చే ప్రయత్నం చేశాడు. తలుపులు వేసి ఉండడంతో వాటిని తెరవాలంటూ గట్టిగా అరిచాడు. ప్లీజ్‌.. నేనేం చేయను. ఇక్కడ నిద్రపోయి వెళ్లిపోతానంటూ రాద్ధాంతం చేశాడు. జరిగిన విషయాన్ని మరుసటి ఉదయం ఆ సినిమా దర్శక- నిర్మాతలకు చెప్పా. వారు నాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇలాంటివి నాకు నచ్చవని బదులిచ్చి, ఆ చిత్రం నుంచి వైదొలిగా’’ అని నిర్మల తెలిపారు.

‘భక్త ప్రహ్లాద’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ తమిళ నటి ‘అవే కళ్లు’, ‘మూగనోము’, ‘బాల నాగమ్మ’ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు. కొన్నాళ్ల విరామం అనంతరం ‘శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి’లో నటించారు. ఆ తర్వాత, ‘అధిపతి’, ‘కలిసుందాం రా’, ‘జయం మనదేరా’, ‘నిన్నే ప్రేమిస్తా’, ‘స్నేహం కోసం’, ‘అర్జున్‌’, ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ తదితర హిట్‌ సినిమాల్లో కీలక పాత్రలు పోషించి విశేషంగా అలరించారు. నిర్మల చివరిగా 2010లో వచ్చిన ‘రగడ’ చిత్రంలో కనిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని