వైవిధ్య చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఈ ‘షేర్నీ’

విద్యాబాలన్‌ ఉంటే చాలు అందులో హీరో లేకున్నా ఫర్వాలేదు అనే మాట తరుచూ విమర్శకుల నుంచి వినిపిస్తుంది. ఆమె చేసిన సినిమాలు, సాధించిన విజయాలు చూస్తే ఆ మాట నిజమేననిపిస్తుంది.

Updated : 10 Aug 2022 12:28 IST

‌‌‘పరిణీత’లో సంప్రదాయ యువతి.. ‘పా’లో కుమారుడిని సంరక్షించుకొనే తల్లి.. ‘ది డర్టీ పిక్చర్‌’లో గ్లామరస్‌ డాల్‌.. ‘కహాని’లో భర్తను అన్వేషించే గర్భిణి.. ‘బేగం జాన్‌’లో వేశ్యగృహాన్ని నడిపే మహిళ.. ‘శకుంతల దేవీ’లో గణిత మేధావి.. తాజాగా విడుదలైన ‘షేర్నీ’లో ఫారెస్ట్‌ ఆఫీసర్‌.. ఇవన్నీ విద్యాబాలన్‌ ఎంచుకున్న వైవిధ్యమైన పాత్రలు. సినిమాను తన భుజాలపై మోస్తూ కథను రక్తి కట్టించే సమర్థురాలామె. విద్యాబాలన్‌ సినిమాలు దాదాపుగా బాక్సాఫీసు వద్ద విజయాలు అందుకున్నవే.  భారతీయ చిత్రాల్లో వచ్చే మహిళ పాత్రల శైలిని ఆమె పూర్తిగా మార్చేసింది. కేవలం గ్లామర్‌ బొమ్మగా మిగిలిపోకుండా, ఎంచుకునే ప్రతి పాత్రా కొత్తగా ప్రవర్తిస్తుంది. ఆ పాత్రలు అవసరమైతే ప్రశ్నిస్తాయి.. కన్నీళ్లు పెట్టిస్తాయి.. ఆలోచింపజేస్తాయి.. ఒక్కోసారి వెండితెరకే సెగలు పుట్టిస్తాయి. అలాంటి పవర్‌ఫుల్‌ పాత్రలకు జీవం పోసింది విద్య.  ‘పరిణీత’ నుంచి ‘షేర్నీ’ వరకు ఒక్కో సినిమాతో బాలీవుడ్‌ మూస ధోరణిని బద్దలు కొడుతూ వచ్చిన విద్యాబాలన్‌ తీరును ఓ సారి పరిశీలిద్దాం!

తానే హీరో

విద్యాబాలన్‌ ఉంటే చాలు అందులో హీరో లేకున్నా ఫర్వాలేదు అనే మాట తరుచూ విమర్శకుల నుంచి వినిపిస్తుంది. ఆమె చేసిన సినిమాలు, సాధించిన విజయాలు చూస్తే ఆ మాట నిజమేననిపిస్తుంది. బాలీవుడ్‌ చిత్రాలంటేనే హీరోల చుట్టూ తిరిగే కథలతో తెరకెక్కుతాయి. వ్యాపారమంతా ఆ చిత్ర కథానాయకుడిని బట్టే జరుగుతుంది.  మహిళా ప్రాధాన్య చిత్రాలొచ్చినా వాటిని గట్టెక్కించాలంటే మరో హీరో ఉండాల్సిందే. అలాంటి మూసధోరణికి చెక్‌ పెట్టింది విద్యాబాలన్‌.  ఓ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవ్వాలంటే ఖాన్‌లే ఉండాల్సిన అవసరం లేదని తన సినిమాలతో నిరూపించింది. ‘లగేరహో మున్నాబాయ్‌’ ‌, ‘హే బేబీ’, ‘భూల్‌ భులైయా’ లాంటి కమర్షియల్‌ సినిమాల్లో నటిస్తూనే ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసి విజయాలు అందుకొంది.

 ఆమెకంటూ ప్రత్యేక దారి

హిళల చిత్రాలంటే కేవలం సాధికారత చుట్టూ తిరిగే సమాంతర సినిమాలనే భావన ఇన్నాళ్లూ ఉండేది. ఆ అర్థాన్ని మార్చేసింది  విద్యాబాలన్‌. ‘కహాని’ లాంటి థ్రిల్లర్‌ కథాంశంతో సరికొత్త మహిళా కథా చిత్రాన్ని అందించింది. దీంతో బీటౌన్‌‌లో అలాంటివి మరిన్ని చిత్రాలు వచ్చేందుకు దోహదం చేశాయి ఆమె నటించిన సినిమాలు. ‘డర్టీపిక్చర్’‌, ‘నో వన్‌ కిల్డ్‌ జెస్సికా’, ‘బేగం జాన్’‌, ‘ఇష్కియా’ లాంటి సినిమాలు ఓ ప్రత్యేక దారిని చూపించాయి. 

బొద్దుగా ఉన్నా.. ముద్దుగుమ్మే!

హిందీ చిత్రాల్లో హీరోయిన్లు సన్నగా, నాజూగ్గా ఉండేందుకు పరితపిస్తారు. కడుపులు మాడ్చుకొని సన్నజాజితీగలా మారిపోతారు. సన్నగా కనిపిస్తేనే అందం అనే  భావనకు విద్య చెక్‌ పెట్టింది. బొద్దుగా ఉండటంలో ఎంత సౌకర్యం, మరెంత సొగసు ఉందో తన పాత్రల ద్వారా చూపించింది.  పాత్రకోసం అవసరమైతే బరువు పెంచేందుకు కూడా వెనకాడలేదు ఈ బొద్దుగుమ్మ. అలా బరువు పెరిగిన సినిమాల్లో ‘డర్టీ పిక్చర్‌’ ఒకటి. అందులో తనదైన అందాలతో మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

 అమ్మగా ఆమె

మర్షియల్‌ సినిమాల ఆఫర్లు వరుస కడుతుంటే సాహసాలు చేసేందుకు ఆలోచిస్తారు. కానీ, విద్యాబాలన్‌ అలా కాదు. తల్లి పాత్రలో నటించే అవకాశం వస్తే కాదనకుండా నటించింది. కెరీర్‌ తొలినాళ్లలోనే అమితాబ్‌ బచ్చన్‌కు కన్నతల్లిగా చేసి తానెంత వైవిధ్యమైన నటి అన్నది చూపించింది.  పాత్రల ఎంపికల్లోనూ ఆమె స్టైలే వేరు. ‘కహానీ’లో భర్తను అన్వేషించే గర్భిణిగా చేసింది. ‘పా’లో ఓ వింత వ్యాధితో బాధపడుతున్న బిడ్డకు తల్లిగా చేసి మెప్పించింది. ‘తుమ్హారి సులు’, ‘శకుంతల దేవి’ సినిమాల్లోనూ గృహిణిగా, తల్లిగా  మెరిసింది‌. అమ్మ పాత్రలు వరుస కడుతున్నా వెనకడుగు వేయలేదు. పైగా ఆయా పాత్రలకు హుందాతనాన్ని తీసుకొచ్చింది. ‘షేర్నీ’లో ఇంకో అడుగు ముందుకేసి, పిల్లలులేని మహిళా పోలీస్‌ ఆఫీసర్‌గా సమాజానికి కొన్ని సూటి ప్రశ్నలు సంధించింది. 

అన్ని రకాల చిత్రాలు

విద్యాబాలన్‌ చేయని జోనర్‌ లేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అన్ని రకాల చిత్రాలు చేసిందామె. క్లాస్‌, మాస్ సినిమాలనే తేడా లేకుండా అన్నింట్లోనూ మెరిసింది. ఆమె హీరోయిన్‌గా చేసిన ‘లగేరహో మున్నాభాయ్‌’ సక్సెస్‌ సాధించింది. ‘భూల్‌ భులైయా’ లాంటి సైకలాజికల్‌ థ్రిల్లర్‌లో భయపెట్టిన విద్యాబాలన్‌, ‘హే బేబీ’లో నవ్వులు పూయించింది. ‘బేగం జాన్’‌లో వేశ్యగానూ నటించి విమర్శకుల మెప్పు పొందింది. ఇక ఆమె చేసిన మహిళా ప్రాధాన్య చిత్రాల సంగతి తెలిసిందే. ఏదీ చేసిన తన ముద్ర ఉండేలా చూసుకుంటుంది.

వందకోట్ల క్లబ్‌ రాణి

బాలీవుడ్‌లో వచ్చిన బయోపిక్‌లలో ‘డర్టీపిక్చర్‌’ ఓ సంచలనం. వినోదాన్ని అందించే సినీ పరిశ్రమ వెనక కనిపించని చీకటి కోణాలను అది ఆవిష్కరించింది. సమాజంలో స్త్రీలపై ఉండే వివక్ష, భావనలను ఈ సినిమా ద్వారా చూపించింది. అందులో సిల్క్‌గా ఒదిగిపోయింది విద్యాబాలన్‌. ఆ పాత్ర కోసం బరువు కూడా పెరిగింది.  సీరుద్దిన్‌ షా, ఇమ్రాన్‌ హష్మీ లాంటి నటులు ఉన్నా, విద్యాబాలన్‌ తనదైన నటనతో చిత్రాన్ని మరో మెట్టు ఎక్కిచ్చింది. హావభావలతో సిల్క్‌గా వసూళ్లకు సెగలు పుట్టించింది. ఖాన్‌లే కాదు ఓ హీరోయిన్‌ కూడా సినిమాను వందకోట్ల క్లబ్‌కు చేర్చగలదని నిరూపించింది. 

పెళ్లైతే నటించకూడదా? 

హీరోయిన్లకు పెళ్లైతే చాలు. ఇక వారి కెరీర్‌ ముగిసినట్టేనని పరిశ్రమంతా కోడై కూస్తుంది. ఇది హీరోలకు మాత్రం వర్తించదు. విద్యాబాలన్‌ వివాహం చేసుకున్న తర్వాత కూడా సినిమాలు చేయడం ఆపలేదు. తన పంథాను మార్చుకోకుండా సినిమాలను అందిస్తోంది. అలా వచ్చిన ‘కహానీ2’, ‘శకుంతల దేవీ’, ‘షేర్నీ’ చిత్రాలకు మునపటిలాగే ఆదరణ దక్కింది. మున్ముందు ఇలాంటి సినిమాలతో మరింతగా అలరించాలని కోరుకుందాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని