Vijay Devarakonda: క్లాస్‌ థియేటర్‌ కాస్త మాస్‌ థియేటర్‌గా మారిన వేళ..!

ఏదైనా కొత్త సినిమా రిలీజైనప్పుడు.. సినీ ప్రియులు రావడం.. ఎలాంటి హంగామా లేకుండా సినిమా చూసి వెళ్లిపోవడం.. ఇలాంటి దృశ్యాలు మనం ఎక్కువగా సినీపోల్స్‌...

Published : 24 Jul 2022 02:14 IST

హైదరాబాద్‌: ఏదైనా కొత్త సినిమా రిలీజైనప్పుడు.. సినీ ప్రియులు రావడం.. ఎలాంటి హంగామా లేకుండా సినిమా చూసి వెళ్లిపోవడం వంటి దృశ్యాలు మనం ఎక్కువగా మల్టీప్లెక్సుల్లో చూస్తుంటాం. ఎంతటి పెద్ద సినిమా అయినా అరుపులూ కేకలు లాంటివి వినిపించడం అరుదు. అలాంటి ఓ క్లాస్‌ థియేటర్‌ అనుకోకుండా మాస్‌ థియేటర్‌గా మారిపోయింది. అభిమానుల కేరింతలతో దద్దరిల్లిపోయింది. అదీ రౌడీ విజయ్‌ దేవరకొండ కోసం. ఆ రేంజ్‌లో వెల్‌కమ్‌ ఇచ్చారు మరి. తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా ప్రాంతంలో ఇలా జరగడం పెద్ద విషయం కాదు. కానీ ఇదంతా జరిగింది ముంబయిలో!. అభిమానుల నుంచి ఈ రేంజ్‌ క్రేజ్‌ రావడంపై విజయ్‌ సైతం ఆశ్చర్యం వ్యక్తంచేశాడు.

టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘లైగర్‌’ (Liger). పూరీ జగన్నాథ్‌ దర్శకుడు. కరణ్‌ జోహార్‌, ఛార్మి నిర్మాతలు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం ఈ సినిమా ట్రైలర్‌ విడుదల జరిగింది. ముంబయిలోని ఓ ప్రముఖ ప్రాంతంలో గల సినీపోలిస్‌లో నిర్వహించిన ఈ ట్రైలర్‌ విడుదలలో విలేకర్లు, అభిమానులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్‌ పూర్తైన వెంటనే విజయ్‌, ఇతర టీమ్‌ అక్కడి నుంచి బయలుదేరగా అభిమానులు వారిని చుట్టుముట్టారు. ‘రౌడీ, రౌడీ’ అంటూ నినాదాలు చేశారు. విజయ్‌తో ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు.

తాజాగా ఈ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ పూరీ కనెక్ట్స్‌ సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ.. ‘‘ముంబయి సినీ పోలిస్‌లో మాస్‌ థియేటర్‌లో ఉన్న అనుభూతిని అందించిన వేళ..’’ అని పేర్కొంది. దానిపై విజయ్‌ స్పందిస్తూ.. ‘‘ముంబయినీ నా నివాసంగా ఫీలైన క్షణాలివే’’ అని తెలిపారు. ‘‘నా జీవితంలో ఏం జరుగుతోంది.. అసలు నేనిక్కడి దాకా ఎలా రాగలిగాను? అని ఇప్పటికే ఎన్నోసార్లు ఆశ్చర్యపోయాను. అలాంటి మరొక సందర్భమే ఇది. ముంబయి.. నువ్వు అందించిన ప్రేమ, ఆనందం నా హృదయాన్ని తాకింది’’ అని విజయ్‌ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని