Family Star Movie: ‘ఫ్యామిలీ స్టార్‌’పై దుష్ప్రచారం.. సైబర్‌క్రైమ్‌కు ఫిర్యాదు!

Family Star Movie: ఫ్యామిలీస్టార్‌ మూవీపై సోషల్‌మీడియా జరుగుతున్న నెగెటివ్‌ ప్రచారాన్ని ఖండిస్తూ చిత్ర బృందం సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Updated : 08 Apr 2024 08:17 IST

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్‌’ (The Family Star). మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలో ‘ఫ్యామిలీస్టార్‌’ గురించి దుష్ప్రచారం చేస్తున్న వారిపై విజయ్‌ దేవరకొండ టీమ్‌ మాదాపూర్ పీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ వింగ్‌లో ఫిర్యాదు చేసింది. ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో నెగిటివ్‌ కామెంట్స్‌ చేస్తున్నారని విజయ్‌ టీమ్‌ తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టుల ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరింది. పోస్టులకు సంబంధించిన స్క్రీన్‌ షాట్లను చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పోలీసులకు ఇచ్చింది.

నెగెటివ్‌ ప్రచారం ఇండస్ట్రీకి మంచిది కాదు: దిల్‌రాజు

‘ఫ్యామిలీస్టార్‌’పై ప్రేక్షకుల స్పందన ఒకలా ఉంటే, సోషల్‌మీడియాలో మరోలా ట్రోల్‌ చేస్తున్నారంటూ చిత్ర నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ఆవేదన వ్యక్తం చేశారు. నెగెటివ్‌ ప్రచారం ఇండస్ట్రీకి మంచిది కాదని, సినిమా విజయం సాధించాలంటే అందరూ ఆమోదించాల్సిందే కానీ, మంచి సినిమాకు ప్రేక్షకులు రాకుండా అడ్డుకోవడం బాగోలేదన్నారు.

‘‘సినిమా చూసిన కుటుంబ ప్రేక్షకులు బాగుందని అంటున్నారు. అందరూ మూవీని ఆస్వాదిస్తున్నారు. ఒక మంచి సినిమా తీశాం. మీరు థియేటర్‌కు వచ్చి చూడండి. నచ్చితే నలుగురికి చెప్పండి. నచ్చకపోతే, మీ అభిప్రాయాన్ని నేనూ గౌరవిస్తా. చాలా మంది మూవీ తమకు నచ్చిందని ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్నారు. మరికొందరేమో సినిమాకు ఎందుకలా నెగెటివ్‌ ప్రచారం చేస్తున్నారని అడుగుతున్నారు. రిలీజ్‌ కాకముందు నుంచే ఇలాంటి ప్రచారం మొదలు పెట్టారని చెబుతున్నారు. మేం ఎలాంటి మూవీ తీశామో చూస్తే మీకే అర్థమవుతుంది. కేరళలో సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు రివ్యూలు, రేటింగ్‌లు ఇవ్వకూడదంటూ కోర్టు తీర్పు ఇచ్చిందట. అలాంటిదేదో వస్తే కానీ ఇండస్ట్రీ బాగుపడదు. నెగెటివ్‌ రివ్యూల వల్ల ఎవరెవరిపై ప్రభావం చూపుతుందో ఎవరూ చూడటం లేదు. నెగెటివ్‌ ప్రచారం వల్ల కష్టపడి సినిమా తీసిన నిర్మాతలు నష్టపోతున్నారు. రాబోయే రోజుల్లో ఇది మరింత నష్టం చేకూరుస్తుంది. ఇక సినిమాలు తీయాలన్న ఆలోచన కూడా రాదు. దానివల్ల చాలా మార్పులు వస్తాయి. ఒకవేళ సినిమా బాగోలేకపోతే అది మీ అభిప్రాయం. దాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా ఎత్తి చూపుతూ ప్రేక్షకులపై రుద్దడం సరికాదు’’ అని దిల్‌రాజు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని