Vijay Varma: విజయ్‌ వర్మ ఎవరు? మేం ఎవరికీ దుస్తులు డిజైన్‌ చేయాలనుకోవడం లేదు..: ‘ఎంసీఏ’ నటుడు

కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొనడంపై స్పందించారు నటుడు విజయ్‌ వర్మ (Vijay Varma). గతంలో తనకు ఎదురైన ఓ చేదు సంఘటనను ఆయన బయటపెట్టారు.

Published : 17 May 2023 23:14 IST

ముంబయి: కేన్స్‌ (Cannes) ఫిలిం ఫెస్టివల్‌ను ఉద్దేశిస్తూ బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మ (Vijay Varma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్యాషన్‌కు పెట్టింది పేరుగా భావించే ఈ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొనడం కోసం గతంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని అతడు తాజాగా బయటపెట్టారు.

‘‘2013లో విడుదలైన ‘మాన్‌సూన్‌ షూటౌట్‌’ సినిమా ప్రమోషన్‌ నిమిత్తం మొదటిసారి కేన్స్‌ వేడుకల్లో పాల్గొన్నాను. అయితే అక్కడ మెయిన్‌ ఈవెంట్‌తో పాటు మరో రెండు వేడుకల్లో సూట్‌ ధరించాలని చెప్పారు. డిజైనర్ల వద్ద సూట్‌ కొనుగోలు చేసేంత డబ్బు నా వద్ద లేదు. ఏం చేయాలో తెలియక చాలామంది డిజైనర్ల వద్దకు వెళ్లి సూట్‌ డిజైన్‌లో సాయం చేస్తారేమోనని అడిగాను. దానికి వాళ్లు.. ‘‘విజయ్‌ వర్మ ఎవరు? మేం ఎవరికీ దుస్తులు డిజైన్‌ చేయాలనుకోవడం లేదు’’ అని బదులిచ్చారు. నా ఇబ్బందిని అర్థం చేసుకున్న ఫ్రెండ్‌ ఒకరు ZARA నుంచి సూట్‌ గిఫ్ట్‌గా ఇచ్చారు. నాకు తెలిసిన మరో వ్యక్తి రెడ్‌ కార్పెట్‌ ఈవెంట్‌ కోసం సూట్‌ కుట్టించి ఇచ్చాడు’’ అంటూ ఆనాటి క్షణాలను విజయ్‌ గుర్తు చేసుకున్నారు. అలాగే, ఇప్పుడు మరోసారి కేన్స్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు.

ఇక, బాలీవుడ్‌లో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు విజయ్‌ వర్మ. నానీ హీరోగా తెరకెక్కిన ఎంసీఏ చిత్రంలో విలన్‌ పాత్రతో ఆయన తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు. ‘మాన్‌సూన్‌ షూటౌట్‌’తో ఆయనకు గుర్తింపు లభించింది. ‘మిర్జాపూర్‌’, ‘గల్లీబాయ్‌’, ‘డార్లింగ్స్‌’తోపాటు ఇటీవల విడుదలైన ‘దహాడ్‌’లోనూ ఆయన నటించారు. విజయ్‌ గత కొన్ని రోజుల నుంచి తమన్నాతో రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి పార్టీలు, డిన్నర్‌ డేట్‌లకు వెళ్లి రావడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని