Vishwak Sen: దయచేసి ఆ పోస్టులు డిలీట్‌ చేయండి: విశ్వక్‌సేన్‌

కెరీర్‌ ఆరంభం నుంచి మాస్‌ కథా చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించి మాస్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు నటుడు విశ్వక్‌ సేన్‌. మొదటిసారి ఆయన నటించిన క్లాస్‌ ఫ్యామిలీ...

Updated : 09 May 2022 12:16 IST

వీడియో రిలీజ్‌ చేసిన నటుడు

హైదరాబాద్‌: కెరీర్‌ ఆరంభం నుంచి మాస్‌ కథా చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించి పేరు తెచ్చుకున్నారు నటుడు విశ్వక్‌ సేన్‌. మొదటిసారి ఆయన నటించిన క్లాస్‌ ఓరియెంటెడ్‌ చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. విద్యాసాగర్‌ చింతా దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్‌ని సొంతం చేసుకుంది. 33 ఏళ్ల వ్యక్తి పెళ్లి కోసం పడే పాట్లను చూపించిన ఈ కుటుంబకథా చిత్రంలో విశ్వక్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఇదిలా ఉండగా, ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి తాజాగా పలు చోట్ల వార్తలు దర్శనమిస్తున్నాయి. ఓ ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ సినిమా త్వరలోనే ప్రసారం కానుందంటూ తేదీతో సహా.. నెట్టింట పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.

వీటిపై విశ్వక్‌ స్పందించారు. తమ చిత్రానికి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోని రిలీజ్‌ చేశారు. ‘‘మా చిత్రాన్ని చాలా పెద్ద హిట్‌ చేసినందుకు, ఇకపై మరిన్ని మంచి చిత్రాలు తీసేలా మాకు ధైర్యాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా సినిమా ఓటీటీ రిలీజ్‌ గురించి సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఓటీటీలో ఎప్పుడు రిలీజ్‌ కానుందో డేట్‌తో సహా చెప్పేస్తున్నారు. నిజం చెప్పాలంటే, మేమే ఇంకా ఓటీటీ రిలీజ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నాక్కూడా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ తెలియదు. మేము ఫిక్స్‌ అయిన వెంటనే అధికారికంగా ప్రకటిస్తాం. ప్రస్తుతానికి సినిమా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. కాబట్టి సోషల్‌మీడియాలో ఓటీటీ రిలీజ్‌పై పోస్టులు పెట్టే వాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే.. థియేటర్‌లో సినిమా చూస్తే వచ్చే అనుభవం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. దాన్ని మిస్‌ కాకండి. మీరు ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తే థియేటర్‌లో సినిమా చూడాలనుకునేవారు కూడా ఓటీటీ రిలీజ్‌ని దృష్టిలో ఉంచుకుని కొన్నిసార్లు సినిమాహాళ్లకు రారు. కాబట్టి, మీరు పెట్టిన పోస్టుల్ని దయచేసి డిలీట్‌ చేసేయండి. రూమర్స్‌ వ్యాప్తి చేయకండి’’ అని విశ్వక్‌ వివరించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని