Dayaa Review: రివ్యూ: దయా.. జేడీ చక్రవర్తి నటించిన వెబ్‌సిరీస్‌ ఎలా ఉందంటే?

జేడీ చక్రవర్తి నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ‘దయా’. పవన్‌ సాధినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌ శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందంటే?

Updated : 06 Aug 2023 11:04 IST

Dayaa Review: వెబ్‌సిరీస్‌: దయా; తారాగణం: జేడీ చక్రవర్తి, రమ్య నంబీశన్‌, ఈషారెబ్బా, విష్ణుప్రియ, జోష్‌ రవి, పృథ్వీరాజ్‌, గాయత్రి గుప్త తదితరులు; మ్యూజిక్‌: శ్రవణ్‌ భరద్వాజ్; సినిమాటోగ్రఫీ: వివేక్ కాలెపు; ఎడిటింగ్‌: విప్లవ్‌; నిర్మాతలు: మహేంద్ర సోనీ, శ్రీకాంత్ మెహతా; రచన, దర్శకత్వం: పవన్ సాధినేని; ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: డిస్నీ+ హాట్‌స్టార్‌ (04-08-2023).

ఒకప్పటి హీరో జేడీ చక్రవర్తి (J D Chakravarthy) ప్రధాన పాత్రలో దర్శకుడు పవన్‌ సాధినేని (Pavan Sadineni) తెరకెక్కించిన వెబ్‌సిరీస్‌ ‘దయా’ (Dayaa). నటి రమ్య, ఇషారెబ్బా (Eesha Rebba), విష్ణుప్రియ (Vishnu Priya Bhimeneni) తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్‌ శుక్రవారం ఓటీటీ (ott) ‘డిస్నీ+హాట్‌స్టార్‌’ (disney+ hotstar)లో విడుదలైంది. మరి, ‘దయా’ నేపథ్యమేంటి? డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌పై జేడీ చక్రవర్తి తొలి ప్రయత్నం ఫలించిందా? తెలుసుకుందాం (Dayaa Review)..

కథేంటంటే: కాకినాడ హార్బర్‌లో దయాకర్‌ అలియాస్‌ దయా (జేడీ చక్రవర్తి) ఫ్రీజర్‌ వ్యాన్‌ (చేపలు రవాణా చేసే వాహనం) డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అతడి భార్య అలివేలు (ఇషారెబ్బా) నిండు గర్భిణి. ఓ రోజు.. హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని భార్య ఫోన్‌ చేసినా పట్టించుకోకుండా డబ్బులెక్కువ వస్తున్నాయనే ఆశతో కిరాయిని ఒప్పుకొంటాడు దయా. లోడ్‌ని దించే సమయంలో వాహనంలో మృతదేహం చూసి షాక్‌ అవుతాడు. ఆ డెడ్‌బాడీ ఎవరిది? ఫ్రీజర్‌లోకి ఎలా వచ్చింది? ఆ శవాన్ని దయా ఏం చేశాడు? ప్రముఖ జర్నలిస్ట్‌ కవిత (రమ్య) హైదరాబాద్‌ హెడ్‌ ఆఫీస్‌ నుంచి కాకినాడకు ఎందుకెళ్లింది? స్థానిక ఎమ్మెల్యే పరశురామ రాజు (పృథ్వీరాజ్‌)ను కలవడానికి కారణమేంటి? కవిత భర్త కౌశిక్‌ (కమల్‌ కామరాజు) విడాకులు ఎందుకు కోరుకున్నాడు? షబానా (విష్ణుప్రియ)కు, కవితకు మధ్య ఉన్న సంబంధమేంటి? జోష్‌ రవి పాత్రేంటి? వంటి ప్రశ్నలన్నింటకీ సమాధానం తెలియాలంటే ‘దయా’ సిరీస్‌ చూడాల్సిందే (Dayaa Review).

ఎలా ఉందంటే: ‘దయా’లో ‘సత్య’ (సినిమా) ఉంటాడు’ అని జేడీ చక్రవర్తి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ఈ సిరీస్‌ ‘సత్య’ ఫ్లేవర్‌ని కలిగి ఉంటుంది. జోష్‌ రవి ఎంట్రీతో సిరీస్‌ని సరదాగా ప్రారంభించినా ముందుకెళ్లే కొద్దీ దర్శకుడు సీరియస్‌నెస్‌ పెంచారు. ఫ్రీజర్‌ వ్యాన్‌ డ్రైవర్‌గా జేడీ చక్రవర్తి పరిచయం ఆకట్టుకుంటుంది. లేట్‌ చేయకుండా ప్రేక్షకులను దయా ప్రపంచంలోకి తీసుకెళ్తారు దర్శకుడు. ఫ్రీజర్‌ వ్యాన్‌లో డెడ్‌బాడీ కనిపించడం నుంచి చివరి వరకు ప్రేక్షకులను కట్టిపడేసేలా చేశారు. 8 ఎపిసోడ్లలో సాగుతుందీ కథ. దయా కుటుంబ నేపథ్యం, అతడు సమస్యల్లో పడటం, దాన్నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం, కవిత ప్రొఫెషనలిజం, ఆమె వ్యక్తిగతం.. ఇలా పలు లేయర్స్‌తో తొలి నాలుగు ఎపిసోడ్లను ఆసక్తిగా తీర్చిదిద్దారు. కవిత, కౌశిక్‌ల మధ్య సాగే సన్నివేశాల్లో కొత్తదనం ఉండదు. ఒకానొక సమయంలో.. దయా సమస్య నుంచి బయటపడబోతున్నాడని ప్రేక్షకుడు అనుకునేలోపు కథ పెద్ద మలుపు తిరుగుతుంది. సినిమాకు దీటుగా అక్కడ హీరో ఎలివేషన్‌ ఉంటుంది (Dayaa Review).

ఐదో ఎపిసోడ్‌ నుంచి స్టోరీ మరింత వేగంగా పరుగుపెడుతుంది. దయా, అలివేలు గతమేంటో తెలుసుకోవాలనే ఉత్సుకత పెరుగుతుంది. దయానే మర్డర్‌ చేసి, శవాన్ని ఫ్రీజర్‌లో పెట్టాడా? అనే సందేహం వచ్చేలా పాత్రను మలిచిన తీరు మెప్పిస్తుంది. ప్రస్తుత కథను నడిస్తూనే అక్కడక్కడా ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌ని చూపించడంతో స్పష్టత లోపించినట్టైంది. మరోవైపు, కవిత- ఎమ్మెల్యే పరశురామ రాజు మధ్య చర్చలు ఉత్కంఠగా సాగుతాయి. పదవిని అడ్డుపెట్టుకుని కొందరు రాజకీయ నాయకులు ఎంతకైనా తెగిస్తారనే విషయాన్ని పరశురామ రాజు పాత్ర చూపిస్తుంది. ‘వెబ్‌సిరీస్‌లు కాబట్టి అవసరం లేకపోయినా శృంగార సన్నివేశాలు, బూతులు పెడుతున్నారు’ అనే మాటలు తరచూ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోనూ అక్కడక్కడా అలాంటివి ఉన్నాయి. తనకెదురైన ప్రతి మహిళపై కన్నేసే వ్యక్తిగా ఎమ్మెల్యే పాత్రను తీర్చిదిద్దారు. ఆ మోతాదు తగ్గించి రాజకీయ బలాన్ని చూపించి ఉంటే బాగుండేది. దయా పాత్రకు కవిత, ఎమ్మెల్యే పాత్రలకు ఉన్న లింక్‌  సర్‌ప్రైజ్‌ చేస్తుంది. ‘సూర్యుడు అస్తమిస్తే యుద్ధం పూర్తయిందనికాదు..’ అనే డైలాగ్‌తో ఈ సిరీస్‌కు సీజన్‌ 2 ఉంటుందని హింట్‌ ఇచ్చారు (Dayaa Review). మరి, దయా గతం తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.

ఎవరెలా చేశారంటే: జేడీ చక్రవర్తి నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తారు. రెండు విభిన్న కోణాలున్న దయాకర్‌ పాత్రకు ప్రాణం పోశారు. తొలి నాలుగు ఎపిసోడ్లలో వినికిడి సమస్యతో అమాయకంగా కనిపిస్తూ.. మిగిలిన నాలుగు ఎపిసోడ్లలో సీరియస్‌ రోల్‌తో మెప్పిస్తారు. అలివేలు పాత్ర నిడివి తక్కువే అయినా.. ఇషారెబ్బా ఆకట్టుకుంటుంది. జర్నలిస్ట్‌ పాత్రకు రమ్య న్యాయం చేశారు. జోష్‌ రవికి నటనకు స్కోప్‌ ఉన్న పాత్ర దక్కింది. విష్ణుప్రియ, కమల్‌కామరాజు, పృథ్వీరాజ్‌ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. శ్రవణ్‌ భరద్వాజ్‌ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్లాయి. విజువల్స్‌ ఆకట్టుకుంటాయి. రొమాంటిక్‌ కామెడీ సినిమాలు ‘సావిత్రి’, ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’తో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు పవన్‌ సాధినేని ‘సేనాపతి’తో రూటు మార్చారు. ‘దయా’తో క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్‌ని మరోసారి టచ్‌ చేసి, విజయం అందుకున్నారు (Dayaa Review).

  • బ‌లాలు
  • + కథ
  • + ఐదో ఎపిసోడ్‌ ట్విస్ట్‌
  • + జేడీ చక్రవర్తి యాక్టింగ్‌
  • బ‌ల‌హీన‌త‌లు
  • - కవిత, కౌశిక్‌ పాత్రల మధ్య డ్రామా
  • -  ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌లో స్పష్టత లోపించడం
  • చివ‌రిగా: ఈ ‘దయా’ ప్రయాణం ఆసక్తికరం (Dayaa Review).
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని