Shah Rukh Khan: అలా అయితే, తెలుగు రాష్ట్రాలకు వస్తా.. షారుఖ్‌ఖాన్‌ కండీషన్‌

Shah Rukh Khan: ‘పఠాన్‌’విడుదల సందర్భంగా షారుఖ్‌ఖాన్‌ ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు.

Published : 22 Jan 2023 01:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: షారుఖ్‌ఖాన్‌ కథానాయకుడిగా సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పఠాన్’. దీపిక పదుకొణె కథానాయిక. జనవరి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ట్విటర్‌ వేదికగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు షారుఖ్‌ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ అభిమాని ‘సినిమా విడుదల రోజున తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్‌కు వస్తారా’ అని అడిగాడు. దీనికి షారుఖ్‌ స్పందిస్తూ ‘రామ్‌చరణ్‌ తీసుకెళ్తే, తప్పకుండా వస్తా’ అని సమాధానం ఇచ్చారు. విడుదలకు ముందు మీ సినిమాపై ఎలాంటి స్పందన వస్తోంది అడగ్గా, ‘చాలా బాగుంది. మా కష్టాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు’ అని పేర్కొన్నారు.

దాదాపు ఐదేళ్ల తర్వాత షారుఖ్‌ నటించిన సినిమా కావడంతో ‘పఠాన్‌’పై మంచి అంచనాలు ఉన్నాయి. అభిమానులను అలరించేలా పూర్తి యాక్షన్‌ మూవీగా సిద్ధార్థ్‌ ఆనంద్‌ దీన్ని తెరకెక్కించినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో ఈ చిత్రం రికార్డులు సృష్టిస్తోంది. హిందీ, తెలుగు వెర్షన్స్‌ సినిమా టికెట్లు చాలా వరకూ బుకింగ్‌ అయ్యాయి. వీటి ద్వారానే రూ.14.66 కోట్లు వసూలైనట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎన్‌సీఆర్‌ ప్రాంతం నుంచి రూ.1.79కోట్లు, ముంబయి నుంచి రూ.1.74కోట్లు రాగా, బెంగళూరు, హైదరాబాద్‌, కోల్‌కతా నగరాల్లోనూ బుకింగ్స్‌ బాగున్నాయట. గతేడాది అడ్వాన్స్‌ బుకింగ్స్‌ విషయంలో అయాన్‌ ముఖర్జీ బ్రహ్మాస్త్ర రూ.19.66కోట్ల రికార్డు సృష్టించింది. సినిమా విడుదలకు మరో ఐదు రోజులు ఉండటంతో ‘పఠాన్‌’ ఆ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని