Ponniyin Selvan: ‘పొన్నియిన్‌ సెల్వన్‌’.. ఈ కథను మలుపుతిప్పే మహిళలు వీరే

‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan) చిత్రంలో కీలకంగా కనిపించిన స్త్రీ పాత్రలు ఏమిటంటే..!  

Published : 28 Apr 2023 09:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఒక మహిళ తలచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి’, అదే విధంగా ‘ఒక మహిళ తలచుకుంటే ఏదైనా సాధించగలదు’.. ఇలాంటి వాదనలను ఎంతోకాలం నుంచి వింటూనే ఉన్నాం. వాటికి అద్దంపట్టేలా చరిత్రలో ఎన్నో కథలున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటే ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan). మణిరత్నం (Maniratnam) తెరకెక్కించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రాన్ని చూస్తే సినీ ప్రియులకు ఇవే గుర్తుకు వస్తాయి. కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవలకు తెరపై ప్రాణం పోసిన మణిరత్నం చిత్రంలోని ప్రధాన నటీమణులెవరంటే..?

ఆమె పగే దీనికి మూలం..!

‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan) ప్రపంచంలో ప్రధాన పాత్రధారి నందిని. చోళ సామ్రాజ్యంలో ఉండే ఓ అనాథ యువతిగా కనిపించిన ఆమె.. యువరాజుని ప్రేమించడం.. ఆ రాజ్యాన్ని వదిలివెళ్లిపోవడం.. కట్‌ చేస్తే కొన్నేళ్ల తర్వాత ఆ యువరాజుపైనే పగ తీర్చుకోవడానికి తిరిగి చోళ రాజ్యంలోకి అడుగుపెట్టడం.. ఇలా పగతో రగిలిపోయే ప్రతినాయిక ఛాయలున్న పాత్ర ఆమెది. చోళ ఆర్థిక మంత్రి పెద్ద పళవేట్టురాయర్‌కు భార్యగా తిరిగి వచ్చిన ఆమె.. తన అందంతో ఎలాంటి వారినైనా పాదాక్రాంతం చేసుకుంటుంది. కథలో ఎంతో కీలకమైన ఈ పాత్రను నటి ఐశ్వర్యా రాయ్‌ బచ్చన్‌ (Aishwarya Rai) పోషించారు. నందిని పాత్రలో తన అందం, అభినయంతో ఆమె అదరగొట్టేశారు.


కుట్రను తిప్పికొట్టే బుర్ర..!

చోళ సామ్రాజ్యం (Ponniyin Selvan)లో మరో కీలకమైన స్త్రీ కుందవై (Kundavai). సుందర చోళుడు కుమార్తె, చోళ రాజ్య యువరాణిగా రాజ్య సంక్షేమం కోసం కుందవై తెలివిగా వ్యవహరిస్తుంటుంది. రాజనీతిజ్ఞత కలది. చోళుల కాలం నాటి రాజకీయలు, రాజనీతి తంత్రంపై ఆమెకున్న పట్టు మరొకరికి లేదు. మధురాంతకుడిని రాజును చేయడం కోసం పెద్ద పళవేట్టురాయర్‌ పన్నే కుట్రలను తెలివిగా తిప్పికొట్టిన బుర్ర ఆమెది. కథలో ముఖ్యమైన ఈ పాత్రను నటి త్రిష (Trisha) పోషించారు. విభిన్నమైన హెయిర్‌స్టైల్‌, ఆహార్యంతో యువరాణిగా ఆమె మెప్పించారు.


సాయం చేసే గుణం..!

చోళ రాజ్య యువరాజు అరుణ్‌మొళి వర్మన్‌ను ప్రేమించి.. అతడి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శత్రువులతో పోరాడే స్త్రీ పూంగుళలి అలియాస్‌ సముద్ర కుమారి. ఈ పడవ నడిపే యువతి పాత్రలో నటి ఐశ్వర్యా లక్ష్మీ (Aishwarya Lakshmi) నటించారు. స్క్రీన్‌పై కనిపించేది కాసేపే అయినప్పటికీ తన నటనతో ఆమె ప్రశంసలు అందుకున్నారు.


ప్రేయుడి కోసం వేచి చూస్తూ..!

యువరాజు అరుణ్‌మొళి వర్మన్‌ను ప్రేమించి.. అతడి రాక కోసం వేచి చూసే అమ్మాయి వానతి (Vaanathi). కొడంబలూర్‌ యువరాణిగా, అరుణ్‌మొళి సోదరి కుందవై స్నేహితురాలిగా ఉంటూ ఆద్యంతం అలరించే ఈ పాత్రలో నటి శోభితా ధూళిపాళ్ల నటించారు. ‘రాచ్చస మావయా’ అనే పాటలో కృష్ణుడి గెటప్‌లో ఆమె కార్తితో కలిసి డ్యాన్స్‌ చేసి మెప్పించారు. ‘పొన్నియిన్‌ సెల్వన్‌-1’లో ప్రేక్షకులను అలరించిన ఈ నాలుగు మహిళా ప్రాధాన్య పాత్రలు ‘పొన్నియిన్‌ సెల్వన్‌ -2’లో ఏవిధంగా ఉండనున్నాయో చూడాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు