యూరప్‌లోని పలు నగరాల్లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

తెదేపా అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్ని ప్రవాసాంధ్రులు ఘనంగా జరుపుకొన్నారు. ఎన్నారై తెదేపా -యూరప్‌......

Published : 19 Apr 2022 22:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెదేపా అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్ని ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. ఎన్నారై తెదేపా-యూరప్‌ టీం కిశోర్‌ చలసాని ఆధ్వర్యంలో సామ్రాట్‌ జలమడుగు, శ్రీనివాస్‌ గోగినేని, శ్యామ్‌ సుందర్‌రావు ఊట్ల సమన్వయంతో పలు నగరాల్లో వైభవంగా నిర్వహించారు. చిన్న పిల్లలు, మహిళలతో కలిసి కేకు కోసి తమ అభిమాన నాయకుడి పట్ల ప్రేమను చాటుకున్నారు. ఉమ్మడి ఏపీలో ఐటీ రంగాన్ని ప్రోత్సహించి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి పలు అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టిన చంద్రబాబు ఎంతో మంది యువత ఉన్నతికి కారణమయ్యారనీ.. తమ కాళ్లమీద తాము నిలబడేలా చేసిన గొప్ప దూరదృష్టి కలిగిన నాయకుడు అంటూ పలువురు కొనియడారు. హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీని నిర్మించారనీ.. రాష్ట్రపతిగా దళిత వర్గానికి చెందిన నారాయణ్‌ని ఎంపిక చేయడంలోనూ; దక్షిణాది నుంచి దేవెగౌడ ప్రధాని కావడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. బీసీలకు 33శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లు చిత్తశుద్ధితో అమలు చేసిన నాయకుడని ప్రశంసించారు. చంద్రబాబు హయాంలో తీసుకొచ్చిన పలు విప్లవాత్మక సంస్కరణలను ఈ సందర్భంగా తెదేపా ఎన్నారై నేతలు గుర్తు చేసుకున్నారు.

2024లో మళ్లీ చంద్రబాబు సీఎం అవుతారనీ, అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం పూర్తి చేసేదీ ఆయనేనన్నారు. తెలుగు ప్రజల కీర్తిని తెలుగుజాతి ఘనతను నలుదిక్కులా చాటిన చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ నినదించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు అతిథులు ఉమ్మడి ఏపీని, నవ్యాంధ్రను చంద్రబాబు ఏరకంగా అభివృద్ధి చేశారు? దేశ విదేశాలకు తిరిగి ఐటీ కంపెనీల అధినేతల్ని ఒప్పించి రాష్ట్రానికి ఏరకంగా పెట్టుబడులు తెచ్చారనే అంశాల్ని వివరించారు. ఈ కార్యక్రమంలో రమ్య రెడ్డి, జగదీశ్‌ మేడిశెట్టి, ధనుంజయ్‌ గుజ్జల తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని