డా.హనిమిరెడ్డికి ‘సిలికానాంధ్ర శ్రీకర’ బిరుదు ప్రదానం

ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్ పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో డా.లకిరెడ్డి హనిమిరెడ్డి 80వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం మధ్యాహ్నం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్....

Published : 04 Oct 2022 20:22 IST

కాలిఫోర్నియా: ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్ పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో డా.లకిరెడ్డి హనిమిరెడ్డి 80వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం మధ్యాహ్నం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ డా.టి.వి. నాగేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం  డా.హనిమిరెడ్డి చేస్తోన్న కార్యక్రమాలను, ఆయన వితరణశీలతను కొనియాడారు. ప్రవాస భారతీయులందరికీ ఆయన ఎంతో ఆదర్శప్రాయులన్నారు. ఆయన్ను చూసి ఒక భారతీయుడిగానే కాకుండా, సాటి తెలుగువాడిగా గర్వపడుతున్నానన్నారు. అంతకముందు డా. హనిమిరెడ్డి, విజయలక్ష్మి దంపతులకు సిలికానాంధ్ర వర్సిటీ భవనంలో ఘనంగా స్వాగతం పలికారు. వర్సిటీ అధిపతి డా.కూచిభొట్ల ఆనంద్, చీఫ్ అకడమిక్ ఆఫీసర్ చమర్తి రాజులతో కలిసి డా. టి.వి. నాగేంద్రప్రసాద్.. డా.హనిమిరెడ్డి విగ్రహాన్ని, లోహ ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అయ్యగారి అనఘ వయలిన్ వాద్య కచేరి, ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారులు మాధవపెద్ది మూర్తి చేసిన నృత్యం సభికులను ఎంతగానో అలరించింది. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం హనిమిరెడ్డి దంపతులను ఘనంగా సన్మానించి ఆయనకు సిలికానాంధ్ర శ్రీకర బిరుదును ప్రదానం చేశారు. పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేకంగా తయారుచేయించిన కేకును వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కట్‌ చేయించారు. 

ఆయన వితరణ వల్లే ‘సిలికానాంధ్ర’ భవనం సాధ్యమైంది!

ఈ సందర్భంగా సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ.. సరిగ్గా ఆరేళ్ల క్రితం ఇదే రోజున విశ్వవిద్యాలయ భవనంలోకి ప్రవేశించామని.. హనిమిరెడ్డి దాతృత్వం వల్లే ఆరోజు ఈ భవనం కొనుగోలు సాధ్యమైందని గుర్తు చేసుకున్నారు. కాలిఫోర్నియా నుంచి అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన కాంగ్రెస్‌ మాన్‌ రో ఖన్నా, కాలిఫోర్నియా అసెంబ్లీ సభ్యుడు ఆష్‌ కల్రా, సెనేట్‌ సభ్యుడు డేవ్‌ కార్టజ్‌లు తమ కార్యాలయాల నుంచి శుభాకాంక్షలు చెబుతూ.. డా.హనిమిరెడ్డి దాతృత్వానికి ప్రశంసాపత్రాలు పంపారు. అలాగే, ఈ సభకు హాజరైన ప్రముఖ పారిశ్రామికవేత్త రామ్ రెడ్డి, ప్రముఖ వైద్యులు డా.రఘునాథ్ రెడ్డి, కిరణ్ ప్రభ, కొండిపర్తి దిలీప్ తదితరులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. హనిమిరెడ్డి నుంచి అందరూ సమాజం పట్ల బాధ్యత, వితరణశీలత అలవరచుకోవాలన్నారు. సిలికానాంధ్ర కార్యకర్తలు, హనిమిరెడ్డి కుటుంబసభ్యుల సహకారంతో సేకరించిన చిత్రాలతో, వీడియోలతో ఆయన 80 ఏళ్ళ జీవన యానంలో కీలక మైలురాళ్ళను ప్రదర్శించిన AV అందరినీ అలరించింది.

ఆ మూడు అక్షరాల వల్లే ఇంతగా ఎదిగా!

అనంతరం డా.హనిమిరెడ్డి మాట్లాడుతూ.. తనకు చెప్పడానికి మాటలు రావట్లేదన్నారు. అందరూ తనపై చూపిన ప్రేమ, అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. చదువు అన్న మూడక్షరాలే ఎక్కడో భారతదేశంలోని ఒక పల్లెటూరులో పుట్టిన తనను ఇంతగా ఎదిగే అవకాశం కల్పించిందని, ఆ చదువు అందరికీ అందుబాటులోకి తేవడానికే, తాను ఎన్నో విద్యాసంస్థలకు దానధర్మాలు చేస్తూ తనవంతు సహాయం అందిస్తున్నానంటూ సభకు హాజరైన వారి హర్షాతిరేకాల మధ్య వెల్లడించారు. ఈ సభ విజయవంతానికి కృషిచేసిన సిలికానాంధ్ర కార్యకర్తలు కందుల సాయి, కోట్ని శ్రీరాం, సంగరాజు దిలీప్, పరిమి శివ, సింహాద్రి కిరణ్, ఉద్దరాజు నరేంద్ర, తనారి గిరిలకు డా.హనిమిరెడ్డి, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సభ అనంతరం అతిథులకు విందు భోజనం ఏర్పాటుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని