
50 రోజులు పూర్తి చేసుకున్న‘ఘంటసాల స్వర రాగ మహాయాగం’
సింగపూర్: అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ‘ఘంటసాల స్వర రాగ మహాయాగం’ కార్యక్రమం 50వ రోజుకు చేరుకుంది. 2021 డిసెంబర్ 4వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోంది. భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, హాంకాంగ్, ఖతార్, బహరైన్, ఒమన్, అమెరికా మొదలైన దేశాల నుంచి గాయనీగాయకులు పాల్గొని ఘంటసాల వారి గీతాలను ఆలపించారు.
50వ రోజు సందర్భంగా శిరోమణి డా.వంశీ రామరాజు ఘంటసాల మందిరంలో దీపారాధన చేసి కార్యక్రమం ప్రారంభించారు. విజయనగరం నుంచి లలితా అలమేలు మంగ, జడ్చర్ల నుంచి శైలజామూర్తి ఘంటసాల వారి చక్కటి వైవిధ్యభరితమైన పాటలను ఎన్నుకుని ఆలపించారు. రాధిక మంగిపూడి వ్యాఖ్యాతగా, సింగపూర్ నుంచి కవుటూరు రత్నకుమార్ అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.
శుభోదయం మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ కార్యక్రమాన్ని వివిధ దేశాలలోని తెలుగువారందరూ వీక్షించి ఆనందించారు. ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్, శుభోదయం గ్రూప్స్ సంయుక్త ఆధ్వర్యంలో ‘ఘంటసాల స్వరరాగ మహాయాగం’ జరుగుతోంది.