‘నవ కవితా కదంబం’ను ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు

సింగపూర్ ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ ప్రధాన కార్యనిర్వాహకవర్గ సభ్యురాలు, రచయిత్రి రాధిక మంగిపూడి రచించిన నూతన

Published : 15 Sep 2022 18:37 IST

సింగపూర్‌: సింగపూర్ ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ ప్రధాన కార్యనిర్వాహకవర్గ సభ్యురాలు, రచయిత్రి రాధిక మంగిపూడి రచించిన నూతన కవితా సంపుటి ‘నవ కవితా కదంబం’ను మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. వంశీ ఆర్ట్ థియేటర్స్ స్వర్ణోత్సవ వేడుకల సభలో, హైదరాబాద్ రవీంద్రభారతి వేదికగా ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సభలో గౌరవ అతిథులుగా పాల్గొన్న అలనాటి సినీనటి జమున, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.వి. రమణ, మాజీ కేంద్ర మంత్రి టి.సుబ్బరామిరెడ్డి, దర్శకులు రేలంగి నరసింహారావు, మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డా.ఎ గురవారెడ్డి, పలు విదేశీ తెలుగు సంస్థల ప్రతినిధులు రాధికను అభినందించి ఆశీస్సులు అందించారు.

వచన కవితలు, చందోబద్ధ పద్యాలు, నానీలు, హైకూలు, మణిపూసలు, సమ్మోహనాలు, గేయకవితలు మొదలైన 9 ప్రక్రియలు పొందుపరిచిన ఈ సంపుటిని వంశీ ఆర్ట్ థియేటర్స్ ప్రచురించింది. శుభోదయం గ్రూప్స్ ఛైర్మన్ డా. కలపటపు శ్రీలక్ష్మీప్రసాద్ తొలి ప్రతి అందుకున్నారు. సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, భువనచంద్ర, ఆచార్య ఎన్ గోపి, డా. తెన్నేటి సుధా దేవి ఈ పుస్తకానికి ముందుమాట అందించారు. ప్రచురణకర్తగా డా. వంశీ రామరాజు, శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, ఇతర కార్యవర్గ సభ్యులు, సింగపూర్ స్నేహితులు రాధికకు అభినందనలు తెలిపారు. ‘ఎందరో సినీ దిగ్గజాలు, ప్రముఖ రచయితల సమక్షంలో వెంకయ్యనాయుడు గారు నా పుస్తకం ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉంది’ అని రాధిక  నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని