ఘనంగా ‘సింగపూర్‌ తెలుగు సమాజం’ మే డే వేడుకలు

మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.......

Published : 05 May 2022 17:17 IST

సింగపూర్‌: మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. దాదాపు 1200 మంది స్థానిక తెలుగు కార్మికులను వివిధ డార్మెటరీలలో కలుసుకొని అందరికీ ప్రత్యేకంగా తయారు చేయించిన రుచికరమైన బిర్యానీ అందజేసినట్టు నిర్వాహకులు తెలిపారు. అలాగే, కరోనా వైరస్‌ ప్రభావంతో రెండేళ్ల తర్వాత కార్మికులను కలుసుకొని వారి బాగోగులను తెలుసుకొని ఆత్మస్థైర్యాన్ని నింపారు. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్‌, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌తో పాటు సింగపూర్‌ తెలుగు సమాజం పూర్వ, ప్రస్తుత కార్యవర్గ సభ్యులంతా కార్మిక సోదరులందరికీ శుభాకాంక్షలు చెప్పారు.

ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు కోటిరెడ్డి మాట్లాడుతూ.. తెలుగు కార్మిక సోదరులకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సింగపూర్ తెలుగు సమాజం ఎల్లప్పుడూ వారికి అండగా ఉందన్నారు. రేయింబవళ్లు తేడా లేకుండా తనతో పాటు తన కార్యవర్గం ఎప్పుడూ వారికి అండగా ఉంటామని మరోసారి భరోసా ఇచ్చారు. రెండేళ్ల తర్వాత అందరినీ భౌతికంగా కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లోనైనా అంతా ధైర్యంగా, కలిసికట్టుగా ఉంటూ చేతనైనంతలో సహాయం చేద్దామని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

కుటుంబాలకు దూరంగా నివసిస్తున్న 1200 మంది కార్మికులకు స్థానిక రెస్టారంట్ల సహకారంతో బిర్యానీ బాక్సులు అందించినట్టు సింగపూర్‌ తెలుగు సమాజం ఉపాధ్యక్షులు, కార్యక్రమ నిర్వాహకులు కిరిచేటి జ్యోతీశ్వర్‌ రెడ్డి తెలిపారు. అన్ని వేళలా కార్మిక సోదరులకు అండగా ఉంటూ ఈనాటి కార్యక్రమాన్ని పర్యవేక్షించి విజయవంతం కావడానికి  సహకరించిన కార్యవర్గ సభ్యులు పోతగాని నరసింహగౌడ్‌, నాగరాజుల సేవలను ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమానికి  హాజరైన తెలుగువారికి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి శ్రమించిన కార్యవర్గ సభ్యులు, దాతలు, సహకరించిన రెస్టారంట్‌ యాజమాన్యాలకు సింగపూర్‌ తెలుగు సమాజం కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని