సంగీతం, నాట్యంలో సిలికానాంధ్ర ‘సంపద’ - PSTU సర్టిఫికెట్‌ పరీక్షలు

విదేశాల్లో ఉంటూ కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం, శాస్త్రీయ నృత్య కళలైన కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్ర నాట్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు పొట్టి శ్రీరాములు తెలుగు......

Published : 28 Mar 2022 22:22 IST

హైదరాబాద్‌: విదేశాల్లో ఉంటూ కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం, శాస్త్రీయ నృత్య కళలైన కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్ర నాట్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (PSTU) వారు నిర్దేశించిన పాఠ్య ప్రణాళిక ద్వారా పరీక్షలు నిర్వహించి, అకడెమిక్‌ క్రెడిట్స్‌తో కూడిన జూనియర్, సీనియర్ సర్టిఫికెట్స్ అందించే సంస్థ SAMPADA (Silicon Andhra Music Performing Arts and Dance Academy). ఈ విద్యా సంవత్సరానికి గాను దాదాపు  2000 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తోంది. మార్చి 26న వర్సిటీ అధికారుల పర్యవేక్షణలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అంతర్జాలం ద్వారా దాదాపు 650 మందికి పైగా విద్యార్థులకు జూనియర్ సర్టిఫికెట్, సీనియర్ సర్టిఫికెట్ పరీక్షలు నిర్వహించినట్టు ‘సంపద’ డీన్‌, అధ్యక్షులు దీనబాబు కొండుభట్ల ఓ ప్రకటనలో వెల్లడించారు. మరో 1300 మంది విద్యార్థులకు ఏప్రిల్ 9న లెవెల్-1; లెవెల్- 3 పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.

విద్యార్థులెవరూ తమ ఇళ్ల నుంచి బయటకు రాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సునాయాసంగా, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించిన ‘సంపద’.. విశ్వవిద్యాలయ అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన గురువుల ప్రశంసలు అందుకుందన్నారు. ఈ పరీక్షలు సజావుగా నిర్వహించడంలో సంపద కీలక బృంద సభ్యులయిన ఫణిమాధవ్ కస్తూరి, శాంతి కొండా, ఉష మాడభూషి, జయమాధవి పునుగుపాటి, తెలుగు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. భట్టు రమేష్, పరీక్షల నియంత్రణాధికారి డా.మురళీ కృష్ణ, అంతర్జాతీయ తెలుగు కేంద్రం నిర్వహణాధికారి డా. రెడ్డి శ్యామల పర్యవేక్షణలో అధికారుల బృంద సభ్యులైన డా.హనుమంతరావు కోట్ల, డా. పద్మప్రియ, డా. శ్రీనివాసాచారి, నృత్య విభాగం అధిపతి డా. వనజ ఉదయ్, సంగీత విభాగం అధిపతి డా. రాధ సారంగపాణి సహకారం ఎంతో ఉందన్నారు. ఈ పరీక్షల నిర్వహణలో ముందుండి దిశానిర్దేశం చేసిన తెలుగు వర్సిటీ వీసీ డా.తంగెడ కిషన్‌రావుకు దీనబాబు కొండుభట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో పరీక్షలు రాయాలనుకొనే విద్యార్థులు SAMPADA.SILICONANDHRA.ORG వెబ్‌సైట్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని