తెలుగు సంస్కృతి, సంప్రదాయానికి అద్దంలా జి.డబ్ల్యూ.టి.సి.ఎస్‌: జగపతిబాబు ప్రశంస

తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలకు జీడబ్ల్యూటీసీఎస్‌ అద్దం పడుతుందని ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు అన్నారు. వాషింగ్టన్‌ డీసీలో గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు.......

Published : 16 May 2022 22:30 IST

వాషింగ్టన్‌ డీసీ: తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలకు జీడబ్ల్యూటీసీఎస్‌ అద్దం పడుతుందని ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు అన్నారు. వాషింగ్టన్‌ డీసీలో గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు సంస్కృతి సంఘం ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి జీడబ్ల్యూటీసీఎస్‌ అధ్యక్షురాలు సాయి సుధ పాలడుగు అధ్యక్షత వహించారు. బృహత్తర వాషింగ్టన్‌ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో వందల మంది తెలుగువారి సమక్షంలో తారా తోరణంతో కళాకారులు, చిన్నారుల ఆటపాటలతో, మహిళల సందడితో పెద్దల శుభాశీస్సులతో ఆహ్లాదంగా మొదలైన ఈ కార్యక్రమం కనుల విందుగా అద్వితీయంగా కొనసాగింది.  ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ.. ఒక జాతి అస్తిత్వాన్ని, ప్రత్యేకతను చాటి చెప్పేది మాతృభాషేనన్నారు. భాష మారినా, సంస్కృతులు మారుతున్నా సమకాలీన సామాజిక ధోరణులు మారుతున్నా.. తెలుగు ఆచార వ్యవహారాలను పరిరక్షిస్తున్నారని ప్రశంసించారు. మీరు ఏ భాష మాట్లాడినా చక్కటి తెలుగు కళలను పిల్లలకు నేర్పిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో, క్రమశిక్షణతో సాగితే అందిరి జీవితం శుభప్రదంగా సాగుతుందని, తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానమిచ్చారు.

జీడబ్ల్యూటీసీఎస్‌ అధ్యక్షురాలు సాయి సుధ పాలడుగు మాట్లాడుతూ.. గత 47 ఏళ్లుగా ప్రతి తరానికి దగ్గర చేస్తూ ముందుకు సాగుతున్న తమ సంస్థ గొప్పతనాన్ని వివరించారు. తెలుగు పండుగలను, సంస్కృతిని ప్రతిబించేందుకు ఇక్కడ ఉన్న యువతీ యువకులను ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఇటీవల జరిగిన ఉమెన్స్‌ డే కార్యక్రమానికి కూడా అపూర్వ స్పందన వచ్చిందన్నారు. మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున తెలుగు దనం ఉట్టిపడేలా హాజరుకావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షులు వేమన సతీశ్‌, చంద్ర మల్లోతు, భాను మాగులూరి, విజయ్‌, సుధీర్‌ కొమ్మి, నరేన్‌ కొడాలి, కవిత చల్లా, సత్య సూరపనేని, గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు, కార్యవర్గ సభ్యులు, తదతరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని