ఎన్టీఆర్‌ ఓ మహోన్నత శక్తి.. తెలుగుజాతి ఆయన్ను ఎప్పటికీ మరవలేదు!

తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు కువైట్‌లోని తెదేపా ఎన్నారై సెల్‌ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఇండియన్‌ కమ్యూనిటీ స్కూల్‌ భవనంలో వెంకట్‌ కోడూరి ......

Published : 11 Jun 2022 20:16 IST

కువైట్‌లో ఘనంగా ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు

కువైట్‌: తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు కువైట్‌లోని తెదేపా ఎన్నారై సెల్‌ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఇండియన్‌ కమ్యూనిటీ స్కూల్‌ భవనంలో వెంకట్‌ కోడూరి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా నిలిచిన అన్న నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. సమాజమే దేవాలయం - ప్రజలే నా దేవుళ్లు అనే తారక మంత్రంతో కోట్లాది మంది మనస్సును ప్రభావితం చేసిన ఆయన ఓ మహోన్నత శక్తి అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అండదండల కోసం పార్టీని స్థాపించి కేవలం ఎనిమిది నెలల కాలంలోనే అధికారం చేపట్టిన ఎదురులేని మనిషి ఎన్టీఆర్‌ అన్నారు. కుళ్లు పట్టిన రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేసి రామరాజ్యంగా మార్చిన ఘనత ఆయనకే సొంతమవుతుందని పేర్కొన్నారు. పంచభూతాలు ఉన్నంత కాలం తెలుగు జాతి ఆయన్ను మరువలేదన్నారు. 

ఎన్టీఆర్‌ ఆశయాల సాధనే లక్ష్యంగా తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ నిరంతరం ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వంపై పోరాడుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ఏకపక్షంగా ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు. ఎందుకంటే ఆనాడు జగన్‌కు రాజశేఖర్‌ రెడ్డి కొడుకు అని, ఏదో చేస్తాడని నమ్మి ఒక్క ఛాన్స్‌ ఇచ్చిన ప్రజలను ఆయన నట్టేట ముంచాడంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చారంటూ ధ్వజమెత్తారు. సొంత పార్టీ వాళ్లే జగన్‌ను ఎందుకు గెలిపించామా అని బాధపడుతున్నారని విమర్శించారు.

కువైట్‌ విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి ఎన్నారైలు చూపిన ప్రేమాభిమానాలు తన జీవితంలో మరిచిపోలేనన్నారు. ఇటీవల కువైట్‌లో జరిగిన హత్య కేసులో లక్కిరెడ్డిపల్లికి చెందిన ఓ అమాయకుడికి శిక్షపడిన వెంటనే వారి కుటుంబ సభ్యులు తన వద్దకు రాగానే మాజీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి కేంద్ర మంత్రికి చెప్పించినా ఫలితం లేకపోయిందని, ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నారై తెదేపా సెల్‌ ఆధ్వర్యంలో ఎన్నారై తెదేపా గల్ఫ్‌, ఎన్నారై తెదేపా కువైట్‌ మైనారిటీ విభాగం, ఎన్టీఆర్‌ సేవా సమితి కువైట్‌, చంద్రన్న సేవా సమితి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా నేతలు అంజన రెడ్డి, నిర్మలమ్మ, అంజలి, సరస్వతి, నారాయణమ్మ నాయుకులు పిడికిట శ్రీనివాస్‌, ముస్తాఖ్ ఖాన్, గుదె శంకరయ్య, ఓలేటి రెడ్డయ్య, షేక్ ఎండీ అర్షద్ , చుండు బాలరెడ్డయ్య, మహామ్మద్ బోరా, షేక్ సుబాన్, కోర్రపాటి వెంకటేశ్వర్లు, మద్దిన వెంకటేశ్‌ , వేగి వెంకటేష్, నాయినపాటి విజయ్, సయ్యద్ ఆలీ, బాబు నాయుడు, జనార్దన్ రెడ్డి, పచ్చా నరసింహ, టిక్ టాక్ రాజు, ఖాదిర్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని