USA: మిస్‌ ఎంపవరింగ్‌ యూనివర్స్‌గా శిల్పా రేవూరి

‘మిస్‌ ఎంపవరింగ్‌ యూనివర్స్‌ 2023’గా శిల్పా రేవూరి నిలిచారు. యూఎస్‌లో జరిగిన పోటీల్లో ఆమె ఈ కిరీటాన్ని దక్కించుకున్నారు.

Updated : 13 Jan 2024 14:43 IST

యూఎస్‌: ‘మిస్‌ ఎంపవరింగ్‌ యూనివర్స్‌ 2023’గా శిల్పా రేవూరి నిలిచారు. ‘మిస్‌ ఎలైట్‌ ఇండియా డబ్ల్యూఏ 2023’ తొలి రన్నరప్‌గానూ ఆమె ఎంపికయ్యారు. ‘ఎంపవరింగ్‌ గ్లోబల్‌ ఉమెన్‌ ఫెస్టివల్‌’ 11వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ పోటీల్లో శిల్ప విజేతగా నిలిచారు. యూఎస్‌ కేంద్రంగా పనిచేసే ‘ఎంపవరింగ్‌’ సంస్థ ఈ పోటీలను నిర్వహించింది. ఇది ఎలాంటి లాభాపేక్ష లేని సంస్థ. దీనికి మెంకా సోని నిధులు సమకూర్చారు. ‘ఎంపవరింగ్‌’ సంస్థ గ్లోబల్‌ బ్యూటీ అవార్డ్స్‌ గుర్తింపు పొందింది. అమెరికాలోని వాషింగ్టన్‌, ఒరెగాన్‌ రాష్ట్రాల్లో చాలా సంవత్సరాలుగా ఈ సంస్థ ఆధ్వర్యంలో పలు కేటగిరీల్లో భారతీయుల కోసం పోటీలు నిర్వహిస్తోంది.

‘మిస్‌ ఎంపవరింగ్‌ యూనివర్స్‌ 2023’గా నిలిచిన శిల్ప స్వస్థలం తెలంగాణలోని ఆదిలాబాద్‌. మైక్రోసాఫ్ట్‌లో సీనియర్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ అయిన శిల్పకు భర్త రామ్‌, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ పరంగా ఎలాంటి నేపథ్యం లేనప్పటికీ ఆమె తొలిసారి ఈ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా భర్త, స్నేహితులు నీతా తులూరి, వినతి ఖన్నా, నీరజ, కోచ్‌లు మెంకా సోని, శివాని సింగ్‌ ఈ పోటీల్లో తనకు మార్గదర్శకంగా నిలిచిన కవితా నంది రామారావుకు ధన్యవాదాలు చెప్పారు. ‘ఎంపవరింగ్‌’కు బ్రాండ్‌ అంబాసిడర్‌ అయినందుకు ఎంతో సంతోషం ఉందన్నారు.

‘మిస్‌ ఎంపవరింగ్‌ యూనివర్స్‌ 2023’ విజేతగా నిలిచే క్రమంలో అడుగడుగునా అనేక సవాళ్లు ఎదురయ్యాయని ఈ సందర్భంగా శిల్ప చెప్పారు. ఈ పోటీల్లో పట్టుదల, సానుకూల దృక్పథంతో ముందుకు సాగినట్లు వెల్లడించారు. తన ఈ ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నానన్నారు. క్యాన్సర్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగించాలని భావించే శిల్ప.. చిన్న చిన్న వ్యాపారాల్లోనూ అభివృద్ధితో కూడిన సాధికారత సాధించాలని కోరుకుంటారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లు మనకు ఎంతో నేర్పుతాయని, అవే అవకాశాలను తీసుకొస్తాయని ఆమె బలంగా విశ్వసిస్తారు. జీవిత ప్రయాణంలో ఎన్ని సార్లు కింద పడ్డా.. మళ్లీ అంతే వేగంతో పైకి లేవాలని తరుచూ తన పిల్లలకు చెబుతుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని