Published : 24 Dec 2020 17:31 IST

ఘనంగా ‘తాల్‌’ క్రిస్మస్‌ సంబరాలు

లండన్‌: తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ లండన్‌ (తాల్‌) ఆధ్వర్యంలో క్రిస్మస్‌ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ నెల 19న వర్చువల్‌ పద్ధతిలో నిర్వహించిన ఈ వేడుకల్లో లండన్‌, పరిసర ప్రాంతాలకు చెందిన పదికి పైగా చర్చిల పరిధిలోని 100 మంది తెలుగువారు, తాల్‌ కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వందలాది మంది తెలుగువారు ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్‌లో ప్రత్యక్షంగా వీక్షించారు. స్థానిక ఎంపీ స్టీఫెన్‌ టీమ్స్‌ ప్రత్యేక అతిథిగా పాల్గొని అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. గత 15 ఏళ్లుగా ‘తాల్‌’ నిర్వహిస్తున్న క్రిస్మస్‌ వేడులకు భిన్నంగా ఈ ఏడాది కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్వహించిన పలు సేవా, సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన కొనియాడారు. కొవిడ్‌ సమయంలో లండన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులు, కొవిడ్ బారిన పడిన తెలుగువారికి తాల్‌ అందించిన సాయాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కరోనాతో మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు పాస్టర్‌ సలోమి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తన దీవెనలతో తాల్‌ క్రిస్మస్‌ సంబరాలకు ఆమె ముగింపు పలికారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ తాల్‌ ఛైర్మన్‌ భారతి కందుకూరి క్రిస్మస్‌ సందేశం అందించారు. తమ సంస్థ గురించి ప్రస్తావిస్తూ గత 15 ఏళ్లుగా తెలుగు భాష, సంస్కృతిని లండన్‌లోని తెలుగు సమాజానికి అందించాలనే సదుద్దేశంతో ‘తాల్‌’ కృషిచేస్తోందన్నారు. ఈ క్రిస్మస్‌ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషిచేసిన రవి మోచర్ల, రత్నాకర్‌ దార, జమీమ దార, డానియల్‌, ప్రవీణ్‌, కారోల్‌ దారను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా లండన్‌, పరిసర ప్రాంతాలకు చెందిన పిల్లలు, వారి తల్లిదండ్రులు క్రిస్మస్‌ పాటలతో, సంగీతంతో వీక్షకులను అలరించారు.

పాస్టర్లు డానియల్‌, భరత్‌, బ్రదర్‌ ప్రభు చరణ్‌ బైబిల్‌ ప్రత్యేకతను, ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని వివరించారు. ఈ కార్యక్రమానికి రెవరెండ్‌ స్వరూప్‌ కుమార్‌ భారత్‌ నుంచి పాల్గొని క్రిస్మస్‌ సువార్త సందేశాన్ని యూకేలోని తెలుగు క్రైస్తవులకు అందించారు. ఈ వేడుకల్లో ‘తాల్‌’ ట్రస్టీలు రాజేశ్‌ తోలేటి, గిరిధర్‌ పుట్టూర్‌, కిశోర్‌ కస్తూరి, రవీందర్‌ రెడ్డి గుమ్మకొండ, అనిల్‌ అనంతుల, నవీన్ గాదంసేతి, అనితా నోములతో పాటు ఐటీ టీం వాలంటీర్లు రిషి కొత్తకోట, వంశీమోహన్‌, కిరణ్‌ కపెట్ట పాల్గొని తమ వంతు సహకారం అందించారు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని