హృద్యమైన పద్యం భాషా వికాసానికి మూలం: బుద్ధప్రసాద్‌

నేటి ప్రపంచంలో నలుమూలలా తెలుగు భాష వృద్ధి చెందుతున్న పరిణామం మంచి భవిష్యత్తును సూచిస్తోందని ఏపీ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు......

Published : 13 Aug 2021 21:03 IST

మెల్‌బోర్న్‌: నేటి ప్రపంచంలో నలుమూలలా తెలుగు భాష వృద్ధి చెందుతున్న పరిణామం మంచి భవిష్యత్తును సూచిస్తోందని ఏపీ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. ఆస్ట్రేలియా తెలుగు సంస్థ ‘తెలుగుమల్లి’ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ప్రారభమైన ‘తెలుగు కావ్య సౌరభాలు’ పేరిట జూమ్‌ వేదికగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభోపన్యాసం చేశారు. ఈ రోజుల్లో రచయితలు విరివిగా రచనలు చేయడం ముదావహమే అయినా తెలుగు కావ్యాలు, పూర్వ సాహిత్యాన్ని చదివే పాఠకులు మళ్లీ రావాలని, పద్య సాహిత్యం పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. వెయ్యేళ్ల తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేస్తే తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలు, పద్య ప్రాముఖ్యత సజీవంగా అర్థమవుతాయని చెప్పారు. ఈ విషయంలో విదేశాల్లోని తెలుగు వారి కృషిని ప్రశంసించారు. ఆస్ట్రేలియాలోని ‘తెలుగుమల్లి’ సంస్థ ద్వారా నిర్వాహకులు కొంచాడ మల్లికేశ్వరరావు తెలుగు పద్యప్రచారానికి పూనుకొని కరోనా సమయంలో కూడా అవధానాలు, పద్యకావ్య రచనలు, కావ్య సమీక్షలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. 

ఆస్ట్రేలియాలో సాహిత్య ప్రక్రియలకు కొదవలేదని, ఇక్కడ కథలు, కవితలు, పద్యాలు రాసే శతకకర్తలు కూడా చాలా మంది ఉన్నారని బుద్ధప్రసాద్‌ అన్నారు. గతేడాది తెలుగు భాష ప్రపంచ దేశాల్లో మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాలో సామాజిక భాషగా గుర్తింపు పొందడం, అందులో ఇక్కడి తెలుగువారంతా పాలుపంచుకోవడం శ్లాఘనీయమన్నారు. ఈ సందర్బంగా తెలుగు పంచకావ్యాలను వారానికొకటి చొప్పున విశ్లేషించేందుకు ముందుకొచ్చిన డాక్టర్‌ చింతలపాటి మురళీకృష్ణను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇక్కడ నెలనెలా అవధానాలు నిర్వహిస్తున్న ఆస్ట్రేలియా అవధాని తటవర్తి కల్యాణ చక్రవర్తి సేవల్ని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో రావిపాటి శ్రీకృష్ణ, డా.చారి ముడుంబి, డా.వేణుగోపాల్‌ రాజుపాలెం, డా.ఉష శ్రీధర్‌, డా.శనగపల్లి కోటేశ్వరరావు, సునీల్‌ పిడుగురాళ్ల, విశ్వనాథశర్మ, పిలుట్ల ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు సింగపూర్‌, మలేసియా, అమెరికా, దక్షిణాఫ్రికా దేశాల్లోని తెలుగువారు సైతం ఈ కార్యక్రమాన్ని ఆసక్తితో తిలకించినట్టు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని