America: ఊబకాయంతో ఏటా 40లక్షల మంది బలి..!

అగ్రరాజ్యం అమెరికాను సుదీర్ఘకాలంగా ఊబకాయ సమస్య వేధిస్తూనే ఉంది. ఇక్కడ ప్రతిఏటా దాదాపు 40లక్షల మంది ఊబకాయం వల్ల కలిగే సమస్యలతో ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Updated : 27 Oct 2021 15:42 IST

దీర్ఘకాలంగా అమెరికాను వెంటాడుతున్న స్థూలకాయం సమస్య

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాను సుదీర్ఘకాలంగా ఊబకాయం సమస్య వేధిస్తూనే ఉంది. ఇక్కడ ఏటా దాదాపు 40లక్షల మంది ఊబకాయం వల్ల కలిగే సమస్యలతో ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. సురక్షితమైన చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ అమెరికన్లు వాటిని వినియోగించుకోకపోవడం వల్లనే ఈ సమస్య ప్రమాదకరంగా మారుతున్నట్లు తాజా నివేదికలు పేర్కొన్నాయి.

అమెరికా జనాభాలో సగం మందికిపైగా పెద్దవారితో పాటు 20 శాతం చిన్నారులు కూడా ఊబకాయం సమస్యతో బాధపడుతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. బరువు తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా అక్కడి వైద్యులు పలు సూచనలు చేస్తున్నప్పటికీ చాలా మంది అవసరమైన చికిత్స తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నట్లు తాజాగా ఎండోక్రైన్‌ సొసైటీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. ఇలా స్థూలకాయంతో బాధపడుతున్న బాధితులు చికిత్స పొందేందుకు ఆసక్తి చూపకపోవడంతో సహరుగ్మతలు (Comorbidities) మరింత పెరిగి ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నట్లు వెల్లడించింది. ఇన్సూరెన్స్‌ కవరేజ్‌ లేకపోవడం, చికిత్స ఖర్చులు కూడా ఎక్కువగా ఉండటం ఇందుకు అదనపు కారణాలుగా తాజా అధ్యయనం అభిప్రాయపడింది.

స్థూలకాయం అనేది ఎంతోకాలంగా వేధిస్తోన్న సమస్య. మధుమేహం, కాలేయానికి కొవ్వు పట్టడం (ఫ్యాటీ లివర్‌)తో పాటు హృదయ సంబంధ వ్యాధులకు కారణమవడంతో ఆయుర్దాయం, నాణ్యమైన జీవనంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు మసాచుసెట్స్‌లోని బెత్‌ ఇజ్రాయెల్‌ డియోకొనెస్‌ మెడికల్‌ సెంటర్‌కి చెందిన సీనియర్‌ వైద్యులు క్రిస్టోస్‌ ఎస్‌ మాంట్‌జొరొస్‌ పేర్కొన్నారు. అయితే, ఊబకాయం వల్ల హార్మోన్‌ల ప్రభావం, ఇతర రుగ్మతలకు ఇది ఏవిధంగా కారణమవుతుందనే విషయాలు మొన్నటివరకు తెలియవని అన్నారు. వీటికి సంబంధించి కారణాలను ఇటీవలే తెలుసుకోగలుగుతున్నామని.. దీంతో చికిత్సలు కూడా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్‌ కంపెనీలు కూడా వీటిని పరిగణనలోకి తీసుకోవాలని తాజా నివేదికలో నిపుణులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని