తానా ఆధ్వర్యంలో ‘ప్రత్యక్ష పరిచయాలు-ప్రత్యేక అనుభవాలు’

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహితీ వేదిక ఆధ్వర్యంలో ఇటీవల ‘ప్రత్యక్ష పరిచయాలు-ప్రత్యేక అనుభవాలు’

Updated : 30 Dec 2021 08:50 IST

సాహితీ ప్రముఖుల జీవిత విశేషాలను పంచుకున్న వక్తలు..

అట్లాంటా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహితీ వేదిక ఆధ్వర్యంలో ఇటీవల ‘ప్రత్యక్ష పరిచయాలు-ప్రత్యేక అనుభవాలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాహిత్య రంగంలో ప్రముఖులైన దివంగత డా.విశ్వనాథ సత్యనారాయణ, డా. ఆచార్య ఆత్రేయ, మహాకవి శ్రీశ్రీ, ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తదితరులు సృష్టించిన సాహిత్యంపై చర్చించారు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయా ప్రముఖులతో సంబంధమున్న పలువురు వక్తలు వారితో తమకు గల అనుభవాలను తెలిపారు. సాహిత్యంపైనే కాకుండా వారి జీవితాల్లో ఎదురైన అనేక మలుపులు, స్ఫూర్తిదాయకమైన జీవనయానాన్ని పంచుకున్నారు.

తొలుత ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి స్వాగతోపన్యాసం చేశారు. విశిష్ట అతిథులందరినీ ఆహ్వానించి సాహితీ చరిత్రలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారంటూ తానా ప్రపంచ సాహితీవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్‌ తోటకూర, వేదిక సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం తోటకూర ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రముఖ సాహితీవేత్తల పేర్లు, వాళ్లు సృష్టించిన సాహిత్యం మాత్రమే మనకు తెలుస్తుందని.. వారి జీవితాల్లో ఎదురైన అవరోధాలు, ఎదుర్కొన్న సవాళ్లు, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక, వృత్తిపరమైన ఇబ్బందులు మనకు తెలియవన్నారు. అలాంటి ఎన్నో ఇబ్బందులను నిబద్ధతతో తట్టుకుని సాహిత్యలోకంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని కొనియాడారు. ఇది మానవాళికి ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పారు. 

డా.విశ్వనాథ సత్యనారాయణతో గడిపిన రోజులు, ఆయనతో ఉన్న అనుబంధాన్ని తెలుగు అవధాని డా.పాలపర్తి శ్యామలాంద ప్రసాద్‌, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత చొక్కాపు వెంకటరమణ వివరించారు. ప్రముఖ సినీ కథా రచయిత జేకే భారవి మాట్లాడుతూ డా.ఆచార్య ఆత్రేయతో గడిపిన సందర్భాల్లో ఎదురైన సంఘటనలను తెలిపారు. ఆత్రేయ తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొని నిలిచారన్నారు. ప్రముఖ కథా రచయిత, సాహితీవేత్త డా.వంగూరి చిట్టెన్‌రాజు మాట్లాడుతూ మహాకవి శ్రీశ్రీ హ్యూస్టన్‌లోని తమ ఇంట్లో కొన్నివారాలు గడిపినప్పటి విషయాలను పంచుకున్నారు. ఆ సమయంలో శ్రీశ్రీ రాసిన సిప్రాలి కవితా సంపుటి విశేషాలను, ఆయనతో జరిపిన సంభాషణలను వివరించారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎదిగిన తీరు.. ఆయన దుందుడుకు స్వభావాన్ని ప్రముఖ సామాజిక సేవకుడు, విశ్రాంత అధ్యాపకుడు యర్రంశెట్టి సత్యారావు మాస్టారు వివరించారు. ముఖ్యంగా సిరివెన్నెల సినీరంగ ప్రవేశానికి ముందు జీవితాన్ని ఆయన అత్యద్భుతంగా ఆవిష్కరించారు. సిరివెన్నెల జీవితంలో జరిగిన అనేక సంఘటలను ఈ కార్యక్రమంలో పంచుకున్నారు. సిరివెన్నెలతో తనకున్న 20 ఏళ్ల ఆత్మీయ అనుబంధాన్ని ప్రముఖ కవి, రేడియో కార్యక్రమాల వ్యాఖ్యాత కిరణ్‌ ప్రభ పంచుకున్నారు. కాలిఫోర్నియాలోని తన ఇంటిలో రెండు నెలలపాటు బస చేసినపుడు పాడిన పాటలు, మానవ సంబంధాలపై ఆయన చూపిన ప్రత్యేక అభిమానాన్ని కిరణ్‌ ప్రభ వివరించారు.


Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని