Congress: రాహుల్‌ యాత్ర.. లోగో విడుదల చేసిన కాంగ్రెస్‌

Bharat Jodo Nyay Yatra: ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ లోగోను కాంగ్రెస్‌ పార్టీ తాజాగా విడుదల చేసింది.

Updated : 06 Jan 2024 15:33 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో మహాయాత్రకు కాంగ్రెస్‌ (Congress) సన్నద్ధమైన విషయం తెలిసిందే. పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) నేతృత్వంలో ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర (Bharat Jodo Nyay Yatra)’ చేపట్టనుంది. దీనికి సంబంధించిన లోగోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే శనివారం విడుదల చేశారు. ఈ యాత్ర ‘న్యాయం జరిగే వరకు’ అనే నినాదమిచ్చారు.

ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో సమస్యలు లేవనెత్తేందుకు ప్రభుత్వం అనుమతించట్లేదని, అందుకే తాము ఈ న్యాయ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ‘‘మణిపుర్‌లో ఇటీవల ఎన్నో దురదృష్టకర ఘటనలు చోటుచేసుకున్నాయి. వాటి గురించి ప్రధాని మోదీ అనేక చోట్ల ప్రసంగాలిచ్చారు కానీ.. ఆ రాష్ట్రానికి మాత్రం వెళ్లలేదు. దీని గురించి పార్లమెంట్‌లో మేం మాట్లాడేందుకు ప్రయత్నించినా మాకు అవకాశం ఇవ్వలేదు. దేశ చరిత్రలోనే తొలిసారి 146 మంది ఎంపీలను సస్పెండ్‌ చేశారు. అందుకే, మా గళాన్ని వినిపించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు మేం ఈ యాత్ర చేపడుతున్నాం’’ అని ఖర్గే వివరించారు.

వైకాపాకు మరో షాక్‌.. మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు గుడ్‌బై

ఇక, నూతనంగా తీసుకొచ్చిన కార్మిక చట్టాలు, క్రిమినల్‌ చట్టాల గురించి మాట్లాడుతూ.. ప్రభుత్వం నియంతృత్వ పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలను అణచివేసేందుకు ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. 

రాహుల్‌ గాంధీ నేతృత్వంలో జనవరి 14న ప్రారంభమయ్యే ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ మార్చి 30న ముగుస్తుంది. 66 రోజులపాటు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా దాదాపు 6,713 కిలోమీటర్ల పాటు యాత్ర కొనసాగనుంది. అయితే, తొలి దశలో జరిగిన భారత్‌ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా.. న్యాయ్‌ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగుతుంది. అక్కడక్కడా పాదయాత్ర ఉంటుందని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. గతంలో రాహుల్‌ గాంధీ.. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 136 రోజులపాటు 12 రాష్ట్రాల్లో దాదాపు 4,500 కిలోమీటర్ల మేర జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని