Team India: టాప్‌ ఆర్డర్‌ ఇలానే ఆడితే.. బుమ్రా - షమీతో ఆసీస్‌కు కష్టాలే: టీమ్‌ పైన్‌

ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ విభాగంపై ఆ జట్టు మాజీ కెప్టెన్ టిమ్‌ పైన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. మరీ ముఖ్యంగా టాప్ ఆర్డర్‌ విఫలం కావడం ఆందోళనకరమని అతడు వ్యాఖ్యానించాడు.

Updated : 11 Mar 2024 14:11 IST

ఇంటర్నెట్ డెస్క్‌: న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో ఆస్ట్రేలియా అతికష్టంగా విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను ఆసీస్‌ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. అయితే, తమ జట్టు ప్రదర్శన అద్భుతంగా ఏమీ లేదని ఆసీస్‌ మాజీ కెప్టెన్ టిమ్‌ పైన్ విమర్శించాడు. టాప్‌ ఆర్డర్ ఘోరంగా విఫలం కావడమే దీనికి కారణమని వ్యాఖ్యానించాడు. ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివర్లో భారత్‌తో జరిగే సిరీస్‌లో ఆసీస్‌కు కష్టాలు తప్పవని హెచ్చరించాడు. 

‘‘టెస్టు సిరీస్‌ను మేం గెలిచినా.. నేను మాత్రం తీవ్రంగా నిరుత్సాహానికి గురయ్యా. న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ కంటే కూడా మాదే బలమైన టీమ్. కివీస్‌పై కష్టపడి గెలిచాం. విండీస్‌ చేతిలో ఓ మ్యాచ్‌ను ఓడిపోయాం. టాప్‌ ఆర్డర్‌ విఫలమవుతోంది. కానీ, కెప్టెన్‌తోపాటు కోచ్‌, సెలక్టర్లు ‘మాకు ఎలాంటి ఆందోళన లేదు’ అని చెబుతారు. ఇప్పుడంతా బాగానే ఉంది. టాప్‌ ఆర్డర్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. స్మిత్, ఖవాజా, మార్నస్ లబుషేన్ ఫామ్‌లో లేరు. గత నాలుగు టెస్టుల్లోనూ వారు పెద్దగా రాణించలేదు. దీనిపై మనం లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది. ఇప్పుడున్న బ్యాటింగ్‌ లైనప్‌ భారత ఫాస్ట్‌ బౌలింగ్‌ దళాన్ని సమర్థంగా ఎదుర్కోలేదు. బుమ్రా, షమీ పేస్‌ దాడి దెబ్బకు ఇక్కట్లు తప్పవు. ఇంగ్లాండ్‌ పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగితే ఆ జట్టునూ అడ్డుకోవడం కష్టమే. ఇక భారత్‌ నుంచి అశ్విన్‌, జడేజా, సిరాజ్‌ నుంచి కూడా ముప్పు తప్పదు. వీటన్నింటికీ త్వరగా సమాధానం వెతకాలి’’ అని టిమ్‌ పైన్‌ వ్యాఖ్యానించాడు. 

కివీస్‌పై విక్టరీ.. రెండో స్థానానికి ఆసీస్‌

న్యూజిలాండ్‌పై రెండో టెస్టులో ఆసీస్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 281 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ ఒక దశలో 80/5 స్కోరుతో కష్టాల్లో పడింది. అయితే, మిచెల్ మార్ష్ (80), అలెక్స్‌ కేరీ (98*) ఆరో వికెట్‌కు 140 పరుగులు జోడించి విజయానికి బాటలు వేశారు. ఒకే ఓవర్‌లో మార్ష్‌తోపాటు స్టార్క్‌ (0) ఔటైనప్పటికీ.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (32*)తో కలిసి కేరీ జట్టును గెలిపించాడు. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC 2023-25) పాయింట్ల పట్టికలో ఆసీస్‌ రెండో స్థానానికి చేరింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా 62.50 శాతంతో కొనసాగుతోంది. భారత్‌ (68.51 శాతం) అగ్రస్థానంలో ఉంది. న్యూజిలాండ్‌ (50) మూడో స్థానానికి పడిపోయింది. 

కేరీ 98* మీద ఉన్నాడని తెలియదు: కమిన్స్

కివీస్‌ను చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించిన అలెక్స్‌ కేరీ 98 పరుగులు సాధించాడు. మరో రెండు రన్స్‌ చేస్తే సెంచరీ పూర్తయ్యేదే. కానీ, విన్నింగ్‌ షాట్‌ను కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ బాదేశాడు. దీంతో కేరీకి శతకం చేజారింది. మ్యాచ్‌ అనంతరం దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరూ విజయం కోసం కష్టపడ్డారు. అభిమానులు కూడా ఉత్కంఠకు గురయ్యారు. చివరికి మేం విజయం సాధించాం. అయితే, కేరీ సెంచరీకి చేరువగా ఉన్నాడనే దానిపై అప్పటికి అవగాహన లేదు’’ అని వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని